Amit Shah: జగన్ పాలనంతా అవినీతిమయం: అమిత్‌షా
ABN, First Publish Date - 2023-06-11T19:57:22+05:30
సీఎం జగన్ (CM Jagan) నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయమని కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) ఆరోపించారు.
విశాఖ: సీఎం జగన్ (CM Jagan) నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయమని కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) ఆరోపించారు. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖలోని రైల్వేగ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందని విమర్శలు గుప్పించారు. అన్నదాతల ఆత్మహత్యలు ఆపని జగన్ సిగ్గుపడాలన్నారు. కేంద్రం ఇస్తున్న ఇళ్లకు జగన్ పేరు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) ఇస్తున్న ఉచిత బియ్యం పథకానికి కూడా జగన్ ఫొటోనా అని ప్రశ్నించారు. వైసీపీ వచ్చాక విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. పదేళ్లలో ఏపీ అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని తెలిపారు. మైనింగ్, మాఫియా, గంజాయికి ఏపీ అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. అమరావతి, విశాఖ, కాకినాడ, తిరుపతిని స్మార్ట్ సిటీలు చేస్తున్నామని అమిత్‌షా ప్రకటించారు.
ప్రపంచ దేశాలన్నీ మోదీ జపం చేస్తున్నాయి
‘‘యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. కాంగ్రెస్ సర్కార్ ఒక్క అవినీతి ఆరోపణపైనా చర్యలు తీసుకోలేదు. పుల్వామా దాడి ఘటన జరిగిన 10 రోజుల్లోనే పాక్‌కు బుద్ధి చెప్పాం. చొరబాట్లను సర్జికల్ స్ట్రైక్స్‌తో ఎదుర్కొన్నాం. 70 కోట్ల మంది పేదలకు అనేక పథకాలు అమలు చేశాం. రైతులకు ఏటా రూ.6 వేలు సాయం అందిస్తున్నాం. కేంద్ర పథకాలకు జగన్ తన పేరు చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో భారత ప్రతిష్ఠను మోదీ పెంచారు. ప్రపంచ దేశాలన్నీ మోదీ జపం చేస్తున్నాయి. మోదీ వచ్చాక దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం అయింది’’ అని అమిత్‌షా గుర్తుచేశారు.
Updated Date - 2023-06-11T20:03:59+05:30 IST