Nakka Anandbabu: చంద్రబాబు జైల్లో ఉన్నారని జగన్ పొందేది శునకానందమే
ABN, First Publish Date - 2023-10-12T16:24:56+05:30
అసత్యాలతో తన నోటి దూల తీర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సామర్లకోట సభలో ప్రజాధనం వెచ్చించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: అసత్యాలతో తన నోటి దూల తీర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) సామర్లకోట సభలో ప్రజాధనం వెచ్చించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు (TDP Leader Nakka Anandbabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు (TDP Chief Chandrababu) జైల్లో ఉన్నారని జగన్ పొందేది శునకానందమే అని అన్నారు. కేసీఆర్ దగ్గర ఇరుక్కుపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. అక్క -చెల్లెల్లు, కుటుంబ గౌరవాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. తన ఇంటి చెల్లెమ్మలు షర్మిల, సునీతలకు ఏపాటి గౌరవం దక్కుతోందో జగనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత ఇంటి చెల్లెమ్మలే ఇక్కడ ఉండలేమని పారిపోతే, ఇక రాష్ట్రంలో ఉన్న చెల్లెమ్మల్లకు ఏం చేస్తావ్ అని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్రమంతటా తిరిగి జగన్ అవినీతిని ఎండకఫుతున్నందుకే ఆయన్ని అక్రమ కేసులో అరెస్టు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. సెంటు భూమి పట్టాల పథకంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని నిరూపించేందుకు తాము సిద్ధమని.. వైపీపీలో ఎవరైనా తమ సవాల్‌ను స్వీకరించగలరా అని ఛాలెంజ్ చేశారు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదల ముఖాలు చూడకూడదని రాత్రికి రాత్రే ఖాళీ చేయించిన సీఎం, పేదల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. జగన్ చర్యలతో పేదల కళ్ళల్లో రక్తం కారుతుంటే వెకిలి నవ్వులు నవ్వుతున్నారంటూ నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు.
Updated Date - 2023-10-12T16:26:50+05:30 IST