మునుగోడు మొనగాడెవరో?
ABN, First Publish Date - 2022-11-04T06:21:45+05:30
మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో.. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మునుగోడు మహాపోరులో మునిగేదెవరో? తేలేదెవరో? అన్న చర్చ కొనసాగుతోంది.
గెలుపు మాదేనంటూ టీఆర్‌ఎస్ హుషారు
నల్లగొండ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో.. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మునుగోడు మహాపోరులో మునిగేదెవరో? తేలేదెవరో? అన్న చర్చ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం అత్యధికంగా అధికార టీఆర్‌ఎ్‌సకే అనుకూలమని చెప్పాయి. కానీ, లెక్కింపు రోజు ఏం జరుగుతుందో, ఓటర్ల మనసులో ఏముందో, ఏజెన్సీల ఫలితాలు అన్నివేళలా నిజమవుతాయా? అన్న చర్చ జరుగుతోంది. గెలుపు కారుదంటే.. కాదు కమలానిదేనంటూ బెట్టింగులు సైతం జరుగుతున్నాయి. అయితే అధికార టీఆర్‌ఎస్ మాత్రం గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక అనుభవాలను గుణపాఠాలుగా మలుచుకుని మునుగోడులో గులాబీ దళం ఏ అవకాశాన్ని వదులుకోకుండా పనిచేసింది. ప్రతి ఎంపీటీసీ పరిధిలో మంత్రి లేదా ఎమ్మెల్యేకు బాధ్యత అప్పగించారు. ఇక్కడ ఎమ్మెల్యేలు పెట్టిన ప్రతీ పైసా అధిష్ఠానం పంపడంతో ఉత్సాహంగా గులాబీ దళం పనిచేసింది. మరోవైపు ఎదుటి పార్టీలో ప్రజాప్రతినిధి లేకుండా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. తమ పరిఽధిలోని ఓటర్ల సమస్యలన్నింటినీ ఫోన్లలో, ఇతర మార్గాల్లో స్థానికంగా మకాం వేసిన నేతలు పూర్తిచేశారు. పోలింగ్‌కు ముందు మంత్రులు కేటీఆర్, హరీశ్, తలసాని రోడ్‌షోలు, మరోసారి ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు ముందు రోజు 90శాతం మంది ఓటర్లకు రూ.3వేలు చొప్పున నగదు కూడా పంపిణీ చేశారని చెబుతున్నారు. పోలింగ్‌కు ముందు రాత్రి పొద్దుపోయాక ప్రతి ఓటరుకు మరో రూ.1000 చొప్పున అందజేసినట్లు తెలుస్తోంది. కాగా, తమ ప్రచార వ్యూహం ఫలించిందన్న నమ్మకం ఉందని, 15 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సందిగ్ధంలో కమల దళం..!
బలమైన సంస్థాగత నిర్మాణం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూపంలో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు దొరకడంతో మునుగోడులో తన శక్తిని చాటేందుకు ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. జాతీయ నాయకత్వం సైతం మునుగోడుపై దృష్టి పెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో మునుగోడులో భారీ సభ ఏర్పాటు చేశారు. బీజేపీ అనుబంధ సంస్థల యంత్రాంగం మొత్తం మునుగోడులో మోహరించింది. వీరికి తోడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు వంటి వారి ప్రచారం తోడైంది. దీంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఓటర్లు సైతం బీజేపీ నేతల నుంచి భారీగా పంపకాలు ఉంటాయని ఆశించారు. అయితే రాజగోపాల్‌రెడ్డి కేంద్రంగా రాష్ట్ర నిఘా వ్యవస్థ పనిచేసిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ అభ్యర్థి ఆర్థిక మూలాలను సీఎం కేసీఆర్ ఎక్కడికక్కడ స్తంభింపజేయడంతో ఇబ్బందులు మొదలయ్యాయని చెబుతున్నారు. దీంతో భారీగా ఆశలు పెట్టుకున్న ఓటర్ల నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థి పార్టీ 90 శాతం మందికి రెండు దఫాల్లో డబ్బు పంపిణీ చేయడంతో కింది స్థాయిలో తమ శ్రేణులు స్తబ్ధుగా ఉండాల్సి వచ్చిందని చెప్పుకొస్తున్నారు. అయినా యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు తమ వైపే ఉన్నారని ఆశిస్తున్నారు.
ఓటు బ్యాంకు పదిలమంటున్న హస్తం
మొదటి నుంచి అనుకున్న మేరకు పని చేసి ఆ మేరకు ఓటు బ్యాంకు కాపాడుకున్నామన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పార్టీ ఓటు బ్యాంకు అనుకున్న వారిని గుర్తించి ప్రతి ఓటుకు రూ.1000 అందించడం, పార్టీ బలంగా ఉన్న చోట బాధ్యతలు తీసుకున్న నేతలు చివరి వరకు పనిచేయడం కలిసొచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. మహిళా సెంటిమెంట్, అభ్యర్థి విస్తృతంగా ప్రచారంతో గత ఉప ఎన్నికతో పోలిస్తే మునుగోడులో భరోసా కల్పించే స్థాయిలో తమకు ఓట్లు దక్కుతాయని అంచనాలో ఉన్నారు.
Updated Date - 2022-11-04T09:59:39+05:30 IST