junk food cravings: జంక్ ఫుడ్ మీద మోజు ఎందుకు?
ABN, Publish Date - Feb 11 , 2025 | 04:21 AM
ఉదయం కంటే రాత్రివేళే మనసు జంక్ ఫుడ్ వైపు లాగుతూ ఉండడాన్ని మీరెప్పుడైనా గమనించారా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం!
ఉదయం నిద్ర లేవగానే మన రక్తంలోని చక్కెర మోతాదులు తక్కువగా ఉండి, వాటిని స్థిరీకరించడం కోసం శరీరం సమతులాహారాన్ని కోరుకుంటుంది. కాబట్టి శరీరం, చక్కెర లేదా కొవ్వులతో కూడిన ఆహారానికి బదులుగా మాంసకృత్తులు, సంక్లిష్టమైన పిండిపదార్థాలు కలిగిన సమతులాహారాన్ని కోరుకుంటుంది. నిద్రలో ఆకలిని తగ్గించే లెప్టిన్ హార్మోన్ మోతాదు పెరిగి, ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ మోతాదు తగ్గుతుంది. అలాగే నిద్రలో శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది. దాంతో ఉదయం నిద్ర లేవగానే శరీరంలో నీటి మోతాదును పెంచే పోషకభరిత ఆహారం వైపే మొగ్గు చూపుతూ ఉంటాం. అయితే రాత్రి వేళ రక్తంలో చక్కెర మోతాదులు తగ్గి లేదా భావోద్వేగాలు ప్రేరేపితమమై, జంక్ తినాలనే కోరిక పెరుగుతుంది. జంక్ ఫుడ్ మీదకు మనసు మళ్లకుండా చేయడంలో మన హార్మోన్లు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే రక్తంలో చక్కెర మోతాదులు అదుపు తప్పుతాయో, నిద్రలేమి, పోషకలోపాలు వేధిస్తాయో, భావోద్వేగాలు అదుపు తప్పి, హార్మోన్లు క్రమం తప్పి, ఆహారం మీద యావ పెరుగుతుంది.
రక్తంలో చక్కెర మోతాదులు తగ్గితే, తక్షణ భర్తీ కోసం శరీరం పరితపిస్తుంది. అలాంటి సందర్భాల్లో అత్యధిక క్యాలరీలతో కూడిన ఆహార పదార్థాలు, పానీయాల వైపు మనసు సాగుతుంది. అవి శీతాల పానీయాలు కావచ్చు. లేదా చక్కెర కలిపిన టీ, కాఫీలూ కావచ్చు. సరిపడా నిద్ర లేనప్పుడు కూడా ఆకలి హార్మోన్ గ్రెలిన్ ఆకలిని విపరీతంగా పెంచేస్తుంది. సాధారణంగా ఉదయం వేళ ఈ హార్మోన్ మోతాదు తక్కువగానే ఉంటుంది. కానీ హార్మోన్ అసమతౌల్య సమస్య ఉన్నవాళ్లలో గ్రెలిన్ మోతాదు పెరిగి ఆకలి పెరుగుతుంది. ఆకలిని పెంచే పోషకలోపాలు, క్యాల్షియం, ప్రొటీన్ లోపాలకు సూచికలు. రాత్రి భోజనం తర్వాత తీపి తినాలనే కోరిక వేధిస్తుంటే, ఆ భోజనంలో సరిపడా పీచు, ప్రొటీన్, సంక్లిష్టమైన పిండిపదార్థాలు లేవని అర్థం. పాలిష్ పట్టిన బియ్యం, మైదాతో తయారైన పదార్థాలు, లేదా బంగాళాదుంపలతో రాత్రి భోజనాన్ని ముగిస్తే, రక్తంలో చక్కెర మోతాదులు అకస్మాత్తుగా పెరిగిపోయి, వెంటనే చక్కెర మోతాదులు అంతే వేగంగా పడిపోతాయి. ఈ పరిస్థితి కూడా తీపి పదార్థాల వైపు ఆకర్షిస్తుంది. ఆకలిని ప్రేరేపించి, మనసును జంక్ దారి పట్టించే పరిస్థితికి దూరంగా ఉండాలంటే పోషకాలు సరిపడా ఉండే సమతులాహారాన్ని ఎంచుకోవాలి. కంటి నిండా నిద్ర పోవడం కూడా తప్పనిసరి.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..
Updated Date - Feb 11 , 2025 | 04:21 AM