Mahashivaratri: శివ సామీప్యాన్ని అనుభూతి చెందే రోజు
ABN, Publish Date - Feb 26 , 2025 | 04:30 AM
సాధారణంగా పండుగలు, పర్వదినాలు అనగానే... కుటుంబ సభ్యులు, సన్నిహితుల కలయికలు, విందులు, వినోదాల్లాంటి వేడుకలు ఉంటాయి. కానీ మహా శివరాత్రినాడు ఇవేవీ కనిపించవు. ఉపవాసం, జాగారాలు, పూజలు, అభిషేకాలు, భజనలు, ప్రార్థనలతో రోజంతా గడిపే పండుగ ఇది.
మాఘ కృష్ణ చతుర్దశ్యా మాదిదేవో మహానిశి
శివలింగ తయోద్భూతః కోటి సూర్య సమప్రభః
కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే మహా శివుడి లింగోద్భవం జరిగిన రోజును మాఘ బహుళ చతుర్దశిగా, మహా శివరాత్రిగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ రోజు అనుసరించాల్సిన విధి, విధానాలను పేర్కొంటూ... వాటి ప్రాధాన్యతను, ఆవశ్యకతను కూడా వివరించాయి. శివరాత్రి నాడు చాలామంది భక్తులు పూర్తి ఉపవాసం పాటిస్తారు. ఏ రకమైన ఆహారాన్ని తీసుకోరు, కొందరు మంచి నీరు కూడా తాగకుండా ఉంటారు. రాత్రంతా శివారాధన చేసిన తరువాత... మరునాడు ఉదయం ఆహారాన్ని తీసుకుంటారు. వీటన్నిటివల్లా శరీరం, మనసు పరిశుద్ధమవుతాయని, దృష్టి ఆధ్యాత్మికత మీద కేంద్రీకృతం అవుతుందని పూర్వులు పేర్కొన్నారు. అలాగే రాత్రంతా మేల్కొని, శివ పూజలో నిమగ్నం కావడం కూడా అనాదిగా వస్తున్న సంప్రదాయం. ‘జాగరణ’ అంటే మేలుకోవడం. మనలో ఉన్న దైవిక శక్తులను మేలుకొలపడానికి, ప్రతికూల వైఖరులను విడిచిపెట్టి... సానుకూల దృక్పథాన్ని పొందడానికి శివరాత్రి ఎంతో అనుకూలమైన రోజు.
అలాగే యోగ సాధకులకు కూడా శివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. యోగ, ధ్యానాలకు శివుడు అధిపతి. ఈ రోజున పలువురు యోగులు, భక్తులు ధ్యానం, యోగా చేస్తారు. రాత్రంతా ధ్యానం చెయ్యడం చాలా శక్తిమంతమైనదనీ, ఆధ్యాత్మిక వృద్ధికి, జ్ఞానానికి దోహదం చేసేది అనీ యోగ గురువులు చెబుతారు. ఇక, శివరాత్రి నాడు అభిషేకాలకు, అర్చనలకు, ప్రార్థనలకు, భజనలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆలయ సందర్శనలు, దాన ధర్మాలు కూడా హిందూ సంప్రదాయంలో భాగమే.
పౌరాణికంగా చూస్తే... శివుడు అగ్నిలింగంగా ఉద్భవించిన రాత్రిగా, తాండవ నృత్యాన్ని ప్రదర్శించిన రాత్రిగా, శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుగా, సముద్ర మధనంలో హాలాహలం ఉద్భవించినప్పుడు... దాన్ని తన గళాన నిలిపి సమస్త లోకాలను శివుడు కాపాడిన రోజుగా... ఇలా అనేక కథలు కనిపిస్తాయి. కాగా, తాత్త్వికమైన దృష్టిలో శివరాత్రికి భిన్నమైన ప్రాధాన్యం ఉంది. ఇది దేవుడితో జీవుడు ఏకత్వాన్ని కనుగొనే రోజు. శివుడి సామీప్యాన్ని అనుభూతి చెందే రోజు. ‘శివుడు, నేను వేరు వేరు కాదు...’
అనే సత్యాన్ని గ్రహించి, మనలో ఉన్న శివుణ్ణి మేల్కొలిపే రోజు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News
Updated Date - Feb 26 , 2025 | 04:30 AM