Hollywood: అనుభవమే అన్నీ నేర్పింది
ABN, Publish Date - Feb 18 , 2025 | 11:54 PM
అదే ఆమెను రంగుల ప్రపంచం వైపు ఆకర్షించింది. ప్రొడక్షన్ డిజైనర్‌ను చేసింది. అదీ ఇక్కడో... అక్కడో కాదు... ఏకంగా హాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. ఇటీవల తను పని చేసిన ఓ చిత్రానికి అవార్డు కూడా అందుకున్న అచ్చతెలుగు అమ్మాయి...
సినిమా అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. కానీ పరిశ్రమ తలుపు తట్టాలని ఎన్నడూ అనుకోలేదు. కాలేజీ వేడుకల్లో చిన్న చిన్న సెట్లు వేసిన అనుభవం. అదే ఆమెను రంగుల ప్రపంచం వైపు ఆకర్షించింది. ప్రొడక్షన్ డిజైనర్‌ను చేసింది. అదీ ఇక్కడో... అక్కడో కాదు... ఏకంగా హాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. ఇటీవల తను పని చేసిన ఓ చిత్రానికి అవార్డు కూడా అందుకున్న అచ్చతెలుగు అమ్మాయి...
లక్ష్మీ నైమిషా గుమ్మడి హైదరాబాద్ టూ లాస్‌ఏంజెలెస్ జర్నీ ఇది.
‘‘సినీ పరిశ్రమ అనగానే ఎవరైనా తెర మీద కనిపించాలని కోరుకొంటారు. కానీ నాకు అటు వైపు వెళ్లాలన్న ఆలోచనే ఎన్నడూ రాలేదు. చిన్నప్పుడు సినిమాలు చూసేదాన్ని. అయితే కెమెరామన్, దర్శకుడు... ఇలా తెర వెనుక ఎంతోమంది శ్రమ ఉంటుందని తెలిసేది కాదు. వెండితెర మీద కనిపించేవారే అన్నీ అనుకొనేదాన్ని. పెరిగేకొద్దీ ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి అర్థమైంది. దాంతో సినిమా కంటే చివర్లో వచ్చే ‘బిహైండ్ ది సీన్స్’ బాగా నచ్చేవి. ఆ డిజైన్ ఎలా చేశారు? ఈ కలర్ ఎలా తీసుకురాగలిగారు? ముఖ్యంగా మన తెలుగు చిత్రాల్లో పాటలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో కనిపించే కళాత్మకత నన్ను బాగా ఆకట్టుకొనేది.
దానికితోడు మా అమ్మానాన్నలిద్దరూ ఆర్కిటెక్ట్‌లు. నాన్నకు కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో ఉన్నారు. అమ్మ కూడా ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. ఈ క్రమంలో ఎప్పుడూ రకరకాల డిజైన్లు చూస్తుండేదాన్ని. ఇంట్లో కూడా వాటి గురించి మాట్లాడుతుండేవారు. అలా డిజైనింగ్ అనేది నాకు ఒక అభిరుచిలా మారిపోయింది. సినిమాలు చూసేటప్పుడు కూడా నా దృష్టి ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ మీదే ఉండేది. వాటి గురించి తెలుసుకోవాలన్న తపనే ఇవాళ నన్ను ప్రొడక్షన్ డిజైనర్‌గా హాలీవుడ్‌లో నిలబెట్టింది.
కాలేజీలో మొదలైంది...
మా స్వస్థలం గుంటూరు. పెరిగిందంతా హైదరాబాద్‌లో. టెన్త్ వరకు ‘సంఘమిత్ర స్కూల్’లో చదివాను. ‘ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్’లో పన్నెండో తరగతి అవ్వగానే ఆర్కిటెక్చర్‌లో బీటెక్ చేద్దామని కర్ణాటక ‘మణిపాల్ యూనివర్సిటీ’ (ఎంఐటీ)కి వెళ్లాను. 2021లో బీటెక్ పూర్తయింది. డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తితో కాలేజీలో వార్షికోత్సవాలు, థియేటర్ స్కిట్స్ వంటి వాటికి సెట్టింగ్‌లు వేసేదాన్ని. అందరూ బాగున్నాయనేవారు. అలా సెట్ డిజైనింగ్ మీద ఆసక్తి పెరిగింది. డిగ్రీ అవ్వగానే కొన్నాళ్లు హైదరాబాద్‌లోని ఓ డిజైనింగ్ స్టూడియోలో ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి పని చేశాను.
కరోనా సమయంలో...
వాస్తవానికి డిగ్రీ పూర్తవక ముందే, కరోనా సమయంలో నేను అమెరికా వచ్చాను. కొన్ని వర్క్‌లు చేశాను. కాలేజీలో ఉండగానే ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి పరిశోధించాను... ఏ కాలేజీలో చదివితే బాగుంటుందనే దాని మీద. అలాంటి కాలేజీలన్నిటికీ దరఖాస్తు చేసుకున్నాను. టాప్ కాలేజీ ‘అమెరికన్ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్’ (ఏఎ్‌ఫఐ)లో సీటు వచ్చింది. డిగ్రీ తరువాత మళ్లీ ఇక్కడకు వచ్చాను.
మాస్టర్స్ కొనసాగిస్తూనే వారాంతాలు, సెలవుల్లో బయటి సినిమాలతో పాటు కొన్ని ప్రాజెక్టులు కూడా చేశాను. నైపుణ్యం సాధించడానికి అవి నాకు ఎంతో తోడ్పడ్డాయి.
మ్యూజిక్ వీడియోలు...
రెండేళ్ల కిందట మాస్టర్స్ పూర్తయింది. కొన్నాళ్లు ఫ్రీలాన్సర్‌గా సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, యాడ్స్, షార్ట్ ఫిలిమ్స్‌కు పని చేశాను. క్రమంగా హాలీవుడ్‌లో నా పేరు నిర్మాణ సంస్థలకు పరిచయమైంది. ఒక మంచి డిజైనర్‌గా నాకంటూ ఒక గుర్తింపు లభించింది. కెరీర్ చిన్నదే కానీ, పెద్ద ప్రాజెక్టులు చాలా చేశాను. డిస్నీ స్టార్ తదితర బడా ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి తరచూ పిలువు వస్తుంటుంది. ప్రొడక్షన్ డిజైనర్ అంటే... సెట్ డిజైనింగ్. మన దగ్గర ఆర్ట్ డైరెక్టర్‌లాగా. కథను అనుసరించి, దర్శకుడి ఊహలకు తగ్గట్టు సెట్ వేయడం మా పని. సెట్ డిజైనింగ్ నుంచి దాన్ని తొలగించే వరకూ అంతా నేనే చూసుకొంటాను.
అడుగడుగునా సవాళ్లే...
ఒక మహిళగా అదీ పరాయి దేశం వచ్చి హాలీవుడ్‌లాంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్ర పరిశ్రమలో పని చేయడం అంటేనే అతిపెద్ద విజయంగా నేను భావిస్తాను. అయితే ప్రత్యేకించి ప్రొడక్షన్ డిజైనింగ్‌లో మహిళలు తక్కువ. ఇక్కడ మన దేశం నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు కానీ, వారిలో ఎక్కువమంది ఉత్తరాదివారే. ఎక్కువగా మగవారే కనిపిస్తుంటారు. వారిని దాటి అవకాశాలు దక్కించుకోవడం నుంచి సెట్ వేసి మెప్పించడం వరకు అడుగడుగునా సవాళ్లే. మొదట దర్శకుడు, కెమెరామ్యాన్ తదితరులతో చర్చించాలి. వారి ఆలోచనలకు తగ్గట్టు సెట్ నిర్మించాలి. ఎప్పటికప్పుడు మన సామర్థ్యానికి పరీక్ష ఎదురవుతుంటుంది. అవసరాన్ని బట్టి ఎంతమంది టీమ్ కావాలనేది నిర్ణయించుకోవాలి.
ఒక్కోసారి షార్ట్ ఫిలిమ్‌కు పెద్ద సెట్ వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒక హర్రర్ చిత్రానికి చేస్తున్నాం. దానికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పన్నెండు మంది పని చేస్తున్నాం. డిస్నీ స్టార్ కోసం చేసిన పాప్ స్టార్ టైలర్ స్విఫ్ట్ మ్యూజిక్ వీడియోకు దాదాపు వంద మంది కష్టపడ్డాం. అలాగే ఓ తక్కువ బడ్జెట్ సినిమాకు నేను, మరొకరు మాత్రమే పని చేశాం. వీటికితోడు తరచూ ప్రయాణాలు చేయాల్సివస్తుంది. మొత్తం షూటింగ్ స్పాట్‌లో నేను తప్ప మరే అమ్మాయీ లేని సందర్భాలు చాలా ఉన్నాయి. వర్జీనియాలో ఒక తెలుగు సినిమాకు చేశాను. అక్కడా అదే పరిస్థితి. మన జాగ్రత్తలో మనం ఉంటూ, పని పూర్తి చేసుకోవాలి. మహిళనని తెలిసి అఖరి నిమిషంలో కొన్ని ప్రాజెక్టులు చేజారాయి. తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకున్న రోజులూ ఉన్నాయి. మళ్లీ నాకు నేనే సర్దిచెప్పుకొని ముందడుగు వేశాను. ఎక్కడ ఎలా ఉండాలో... పరిశ్రమలో ఎలా నిలదొక్కుకోవాలో... అనుభవమే అన్నీ నేర్పింది.
ప్రముఖులతో కలిసి...
ప్రొడక్షన్ డిజైనర్‌గా టేలర్ స్విఫ్ట్, కైలీ కంట్రాల్, నికోలాస్ జేమ్స్ బార్బర్, నికోల్ రుయిజ్ తదితర ప్రముఖులతో కలిసి పని చేశాను. ఇక ఇప్పుడు నేను లాస్‌ఏంజెలె్‌సలో ఉంటున్నాను. కాలిఫోర్నియా కార్చిచ్చు సంభవించినప్పుడు మమ్మల్ని ఇళ్లు ఖాళీ చేయించారు. మా చుట్టుపక్కల నాలుగైదు ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో షూటింగ్‌లు బంద్ అయిపోయాయి. చాలా అవస్థలు పడ్డాం. నేను మా స్నేహితురాలి ఇంట్లో ఉన్నాను. పరిస్థితులు అదుపులోకి వచ్చాక మళ్లీ వెనక్కి వచ్చాం. నా లక్ష్యం ఒక్కటే... మరిన్ని పెద్ద ప్రాజెక్టులు చేయాలి. హాలీవుడ్‌లోనే స్థిరపడాలి. దాని కోసమే శ్రమిస్తున్నా.’’
హనుమా
మరిచిపోలేని అనుభూతి
ఆ మధ్య నేను ‘తహానన్’ అనే ఒక ఫిలిప్పీన్ చిత్రానికి పని చేశాను. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దానికి ఇటీవల అమెరికాలో జరిగిన ‘కల్వర్ సిటీ ఫిలిమ్ ఫెస్టివల్’లో ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. సొంత దేశం వదిలేసి అమెరికాలో స్థిరపడిన ఓ ఫిలిప్పీన్స్ కథ అది. వారి భాషలో ‘తహానన్’ అంటే అర్థం... ‘ఇల్లు’. భావోద్వేగాలతో నిండి చిత్రం. నా కథ కూడా అలాంటిదే కదా. సొంత ఇల్లు, దేశానికి దూరంగా, ఒంటరిగా అమెరికాలో ఉంటున్నా. అందుకే ఆ చిత్ర నిర్మాణంలో పూర్తిగా లీనమయ్యాను. ఫిలిప్పీన్ దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అమెరికాలో సెట్ వేశాను. ఆ దేశస్తులు కూడా షూటింగ్ తమ ప్రాంతంలోనే తీశారనుకున్నారు. వారందరి నుంచి ప్రశంసలు నాకు ఎంతో మధురమైన అనుభూతినిచ్చాయి. అంతకుముందు చేసిన షార్ట్ ఫిలిమ్.. ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ పలు చిత్రోత్సవాల్లో పన్నెండు నామినేషన్లు దక్కించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Rahul Gandhi: అర్ధరాత్రి నిర్ణయం సరికాదు... సీఈసీ ఎంపికపై రాహుల్
Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా
Mahakumbh: 26న చిట్టచివరి స్నాన ఘట్టం... హై అలర్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 18 , 2025 | 11:54 PM