ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drone Farming: డ్రోన్‌ పైలెట్‌ మన సంధ్య

ABN, Publish Date - Mar 08 , 2025 | 06:12 AM

పొలానికి పురుగుమందులు పిచికారీ చేయడం కోసం డ్రోన్‌ను ఉపయోగిస్తూ వినూత్నమైన జీవనభృతిని ఎంచుకుంది పల్నాడు జిల్లా, అచ్చంపేటకు చెందిన, కోట సంధ్య. పొలం పనుల్లో డ్రోన్‌ వినియోగంతో పొందే ప్రయోజనాలు, ఆదాయాల గురించి ఆమె ‘నవ్య’తో పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు...

హిళల జీవితంలో పెళ్లి, పిల్లలతో కెరీర్‌కు బ్రేక్‌ పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే! ఎమ్మెస్సీ బిఇడి చదివిన నేను ప్రారంభంలో అచ్చంపేటలో కస్బూర్బా స్కూల్లో ఏడేళ్లపాటు టీచర్‌గా పని చేశాను. పెళ్లయ్యాక, గర్భిణిగా ఉన్న సమయంలో వైద్యులు బెడ్‌రెస్ట్‌ సూచించడంతో టీచర్‌ వృత్తికి బ్రేక్‌ పడింది. అలా ఇద్దరు పిల్లల తల్లిగా, పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలను నిర్వరిస్తూ గృహిణిగా స్థిరపడిపోయాను. ఆ తర్వాత డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా చేరాను. ఆ సమయంలో కోరమాండల్‌ పురుగుమందుల కంపెనీ మమ్మల్ని సంప్రతించి, డ్రోన్‌ పైలట్‌గా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా డ్రోన్‌లను పంపిణీ చేస్తామని చెప్పింది. డ్రోన్‌తో పురుగుమందులు చల్లే ఆ ఆలోచన నాకు నచ్చింది. దాంతో ఏడాది క్రితం హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపిఎమ్‌)లో ఏడు రోజుల శిక్షణ తీసుకున్నాను. మూడు రోజుల థియరీ శిక్షణలో భాగంగా డ్రోన్లలో రకాలు, డ్రోన్ల నిర్మాణం, అవి పని చేసే విధానాల గురించి తెలుసుకున్నాను. మిగతా నాలుగు రోజులు డ్రోన్‌ను ఎగరేయడమెలాగో నేర్చుకున్నాను. తర్వాత గుంటూరు, లామ్‌లో రెండుసార్లు శిక్షణ తీసుకున్నాను. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రభుత్వంతో అనుసంధానమైన కోరమాండల్‌ కంపెనీ నుంచి ఉచితంగా డ్రోన్‌ను అందుకున్నాను.



రోజుకు 20 ఎకరాల మేరకు...

ప్రస్తుతం నేను 25 కిలోల డ్రోన్‌ను ఉపయోగిస్తున్నాను. ఈ డ్రోన్‌ అడుగున పది లీటర్ల ట్యాంక్‌ ఉంటుంది. ఒక ఎకరాకు సరిపడా పురుగు మందును పది లీటర్ల నీళ్లలో కలిపి, ట్యాంక్‌లో నింపి, డ్రోన్‌ను గాల్లో ఎగరేస్తూ పొలానికి పిచికారీ చేయవచ్చు. పంటకు ఎంత ఎత్తులో మందును పిచికారో చేయాలో ముందే డ్రోన్‌ తెర మీద గుర్తులు పెట్టుకుని, జాయ్‌స్టిక్‌తో డ్రోన్‌ను నియంత్రిస్తూ గాల్లో ఎగరేయాలి. పురుగుమందులు పిచికారీకి డ్రోన్‌ను ఉపయోగించడంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రమాదకరమైన పురుగుమందులకు బహిర్గతం కాకుండా, అతి తక్కువ సమయంలో పొలాలకు పిచికారీ చేయవచ్చు. అంతే కాకుండా పంట మొత్తానికీ మందు సోకేలా సమంగా పిచికారీ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ పనికి కూలీలను వినియోగించుకుంటూ ఉంటారు. ఒక కూలీకి ఒక ఎకరాకు, రోజుకు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే పనిని డ్రోన్‌తో, 300 రూపాయలకే పూర్తి చేసుకోవచ్చు. ఒక ఎకరా పిచికారీ కేవలం 7 నుంచి 8 నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. పంట ఎత్తు మీద రుసుము ఆధారపడి ఉంటుంది. అలాగే సాధారణంగా ఒక ఎకరాకు ఒక లీటరు పురుగు మందు అవసరమవుతుంది. కానీ డ్రోన్‌ను ఉపయోగిస్తే, ఒక ఎకరాకు 750 మిల్లీలీటర్ల పురుగుమందు సరిపోతుంది. ఇలా డ్రోన్‌తో ఒక రోజుకు 20 ఎకరాలకు పురుగుమందులు పిచికారీ చేసుకోవచ్చు. పైగా డ్రోన్‌ వాడకం వల్ల పురుగుమందు ఖర్చు కలిసొస్తుంది. ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది. ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.



డ్రోన్లతో బహుళ ప్రయోజనాలు

పురుగుమందుల పిచికారీకి డ్రోన్లను వాడుకోవడం వల్ల రైతులూ, ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే మహిళలూ.. ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రోన్‌ను నడిపించడం కూడా ఎంతో తేలిక. చదువుకోని మహిళలు సైతం దీన్నెంతో సులువుగా ఉపయోగించుకోవచ్చు. డ్రోన్‌ సహాయంతో పత్తి, వరి, మొక్కజొన్న, మినుము, కంది, మిరప, అరటి పంటలకు పురుగుమందుల పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ డ్రోన్‌కు కూడా ఒకట్రెండు ప్రతికూలతలున్నాయి. ఆకారంలో పెద్దగా ఉంటుంది కాబట్టి పొలం దగ్గరకు తీసుకువెళ్లడానికి ఆటో లేదా ట్రాలీ లాంటి వాహనం అవసరమవుతుంది. పిచికారీతో పొందే ఆదాయంలో 50 శాతం ఈ వాహనానికే ఖర్చయిపోతూ ఉంటుంది. అలాగే డ్రోన్‌ బ్యాటరీ సహాయంతో ఎగురుతుంది. ఈ బ్యాటరీ ఒక ఎకరా పంట పిచికారీ వరకే పని చేస్తుంది. తర్వాత డ్రోన్‌ను నేల మీదకు దింపుకుని బ్యాటరీ మార్చుకోవాలి. డ్రోన్‌తో పాటు మాకు అందిన ఐదు అదనపు బ్యాటరీలను వాడుకున్నప్పటికీ ప్రతి రెండు గంటలకోసారి వాటన్నిటినీ చార్జ్‌ చేసుకోడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. ఈ సమయం కలిసి రావాలంటే మా దగ్గర జనరేటర్‌ సదుపాయం ఉండాలి. డ్రోన్‌ను తరలించడానికి వాహనంతో పాటు, జనరేటర్‌ సదుపాయాలను కల్పిస్తే ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చు. ఈ విషయంలో మాలాంటి వాళ్లకు ప్రభుత్వ తోడ్పాటు ఎంతో అవసరం.

గోగుమళ్ల కవిత

మా వారు బాల యోగీంద్రబాబు ఎరువుల వ్యాపారి. మాకిద్దరు పిల్లలు. పెద్ద బాబు 6వ తరగతి, చిన్నవాడు ఒకటో తరగతి. డ్రోన్‌ విషయంలో మా వారు నన్నెంతో ప్రోత్సహించారు. ప్రస్తుతం ఓ పక్క డ్రోన్‌ పనులు చూసుకుంటూ, ఆన్‌లైన్‌లో ట్యూషన్లు కూడా చెప్తున్నాను.

Updated Date - Mar 08 , 2025 | 06:12 AM