Meher Baba: మౌనమే ఆయన సందేశం...
ABN, Publish Date - Jan 31 , 2025 | 04:35 AM
దేశ, విదేశాల్లో పర్యటించినప్పుడు, ప్రమాదాలకు గురై చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఆయన మౌనాన్ని విడిచిపెట్టలేదు. మౌనమే తన సందేశంగా జీవించారు. అయితే తాను మౌనాన్ని ఒక ప్రతిజ్ఞలా కానీ, తపోదీక్షగా కానీ చేపట్టలేదనీ, విశ్వకళ్యాణం కోసమే చేపట్టాననీ ఆయన స్పష్టం చేశారు.
‘‘నేను మేలుకొలుపడానికే కాని బోధించడానికి రాలేదు’’ అని ప్రకటించిన సద్గురువు అవతార్ మెహెర్‌బాబా. ఆయన 44 ఏళ్ళ పాటు సుదీర్ఘ మౌన దీక్షలో గడిపారు. దేశ, విదేశాల్లో పర్యటించినప్పుడు, ప్రమాదాలకు గురై చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఆయన మౌనాన్ని విడిచిపెట్టలేదు. మౌనమే తన సందేశంగా జీవించారు. అయితే తాను మౌనాన్ని ఒక ప్రతిజ్ఞలా కానీ, తపోదీక్షగా కానీ చేపట్టలేదనీ, విశ్వకళ్యాణం కోసమే చేపట్టాననీ ఆయన స్పష్టం చేశారు. ‘‘మీరు చూస్తున్న ఈ ప్రపంచం అంతా ఒక మిధ్య. ఇదంతా ఒక కల. ఈ నిజాన్ని మీరు తెలియజేయడం కోసమే మెహర్‌బాబాగా మీ మధ్యకు వచ్చాను. ఈ సత్యం తెలుసుకోవాలంటే మీకు భగవంతుడి కృప కావాలి. నిరంతర భగవన్మామ స్మరణ ద్వారానే అది లభిస్తుంది. తద్వారా మంచి కర్మలు చేపట్టడం, మంచి సంస్కారాలు పొందడం, క్రమేణా జన్మ రాహిత్యం, భగవంతుడిలో ఐక్యం కావడం సులువవుతుంది’’ అని చెప్పారు.
ఇన్ని మతాలు ఎందుకు?
‘ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అసలు ఇన్ని మతాలు ఎందుకు?’ అనే విషయం గురించి మెహెర్‌బాబా మాట్లాడుతూ ‘‘వివిధ కాలాల్లో ఆవిర్భవించిన ఆ అవతార పురుషుడు మతాలను ప్రజలకు వరంగా ఇచ్చాడు. ప్రజల మనసులను భగవంతుడివైపు మరల్చడానికే మతాలను సృష్టించాడు. మరి ‘ఒక్కో మతం ఒక్కో రకంగా ఎందుకు ఉంది? అన్ని మతాలు ఒకేలా ఎందుకు లేవు?’ అంటే... బుద్ధుడి కాలం వేరు, మహమ్మద్ ప్రవక్త కాలం వేరు. తమ అవతార కాలంలోని పరిస్థితులకు తగినట్టు, ప్రజల మానసిక పరిపక్వతకు తగినట్టు వారు తమ బోధనలు చేశారు. మార్గనిర్దేశకత్వం చేశారు. కాబట్టి అన్ని మతాలూ ఒక్కటే’’ అని ఆయన చెప్పారు. ‘‘నేను ప్రత్యేక మతాన్ని స్థాపించడానికి రాలేదు. నా మతం పేరు ‘ప్రేమ మతం’. నేటి మానవాళికి అవసరమైనది ప్రేమ’’ అని వెల్లడించారు. ‘‘నిస్వార్థ సేవ, ప్రేమ... ఈ రెండూ దైవీ గుణాలు. ఆధ్యాత్మిక పథంలో అత్యాశ, కామం, పరోక్ష నిందలు అత్యంత ప్రమాదకరమైనవి. తోటి మానవులను ప్రేమించడం భగవంతుణ్ణి ప్రేమించడానికి తొలిమెట్టు. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించడం నిజమైన, స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం. ఇతరుల మేలు కోసం మీరు ప్రార్థిస్తే... మీకు కూడా తప్పకుండా మేలు జరుగుతుంది’’ అని తెలిపారు.
ప్రశ్నలన్నిటికీ జవాబు...
మెహెర్‌బాబా శిష్యులలో ఒకరైన జి.ఎ్‌స.ఎన్.మూర్తి నిత్యం భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేవారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులలోని వేదాంతపరమైన కొన్ని అంశాలను బాబాను అడిగి తెలుసుకుందామని ఆయన అనుకున్నారు. తన సంశయాలన్నిటినీ ఒక కాగితం మీద టైప్ చేసి తీసుకువెళ్ళారు. బాబా ఎదుట కూర్చొని... ప్రశ్నించడానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా బాబా తన ఎదురుగా ఉన్న ఒక చిన్న పుస్తకాల కట్టలోంచీ ఒక పుస్తకాన్ని తీసి... మూర్తికి ఇచ్చారు. ఆ పుస్తకంలోని అక్షరాలను తన చూపుడువేలుతో చూపిస్తూ... వాటిని చదవమన్నారు. ఆ అక్షరాలను మూర్తి చదువుతూ ఉంటే... తన ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికిట్టయింది. ఆ పుస్తకాన్ని కొనుక్కుందామని మూర్తి నిశ్చయించుకున్నారు. అప్పుడు బాబా ‘‘ఏం ఆలోచిస్తున్నావ్?’’ అని అడిగారు. ‘‘ఏమీ లేదు’’ అన్నారు మూర్తి. బాబా ఆ పుస్తకాన్ని మూర్తికి బహుమతిగా ఇస్తూ ‘‘దీన్ని ఎప్పుడూ నీదగ్గరే ఉంచుకో. ఇకపై నీకు ఇదే భగవద్గీత. దీన్ని ప్రతిరోజూ పఠించు. నీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి’’ అని చెప్పారు.
నేడు అమరతిథి...
అవతార్ మెహెర్‌బాబా 1969 జనవరి 31న దేహ త్యాగం చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కేంద్రానికి సుమారు అయిదు కిలోమీటర్ల దూరంలోని మెహెరాబాద్‌లో చిన్న కొండవై ఆయన సమాధి ఉంది. నేడు (జనవరి 31న) ఆయన 56 అమరతిథిని భక్తులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12.00 నుంచి 12.15 వరకూ.... ఆయనను స్మరిస్తూ వారు మౌనం పాటిస్తారు.
డాక్టర్ మల్లాది కృష్ణానంద్, 9959553218
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 31 , 2025 | 04:35 AM