ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arunima Singh: ప్రకృతి రత్నం!

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:05 AM

పధ్నాలుగేళ్ళలో 35 వేలకు పైగా తాబేళ్ళను, ఇతర సముద్ర జీవులను కాపాడారు, అక్రమ తరలింపును అడ్డుకున్నారు. వాటి సంరక్షణ ఆవశ్యకతపై 50 వేల మందికి పైగా పిల్లలకు అవగాహన కల్పించారు.

లచరాలపై ఉన్న ఇష్టాన్ని వాటిని పరిరక్షించే బాధ్యతగా మార్చుకున్నారు అరుణిమ సింగ్‌. పధ్నాలుగేళ్ళలో 35 వేలకు పైగా తాబేళ్ళను, ఇతర సముద్ర జీవులను కాపాడారు, అక్రమ తరలింపును అడ్డుకున్నారు. వాటి సంరక్షణ ఆవశ్యకతపై 50 వేల మందికి పైగా పిల్లలకు అవగాహన కల్పించారు. తోటి ప్రాణుల పట్ల క్రూరత్వం, నిర్లక్ష్యం మనకే ముప్పు తెస్తాయంటున్న 39 ఏళ్ల అరుణిమ కృషి గురించి ఆమె మాటల్లోనే...

‘‘మాది ఉత్తరప్రదేశ్‌లోని లఖనవూ. గోమతీ నది మా నగరంలోంచి పారుతూ ఉంటుంది. మా తాతయ్యకు రోజూ సాయంత్రం నదీ తీరానికి వెళ్ళడం అలవాటు. నేను బడి నుంచి రాగానే... ఆయనతో కలిసి వెళ్ళడానికి సిద్ధమైపోయేదాన్ని. నదుల గురించి, సముద్రాల గురించి, వాటిలో ఉండే వైవిధ్యమైన జీవుల గురించి ఆయన ఎన్నో సంగతులు చెప్పేవారు. జంతువులంటే నాకు చాలా ఇష్టం. జలచరాలంటే ప్రత్యేకమైన ఆసక్తి. అందుకే ఎమ్మెస్సీ లైఫ్‌ సైన్స్‌ చేశాను. ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా.. ‘టర్టైల్‌ సర్వైవల్‌ అలయన్స్‌’ (టిఎస్‌ఎ) ఇండియా విభాగానికి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ శైలేంద్ర సింగ్‌ను కలుసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా తాబేళ్ళు అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్నాయనీ, వాటిని కాపాడుకోవాలనీ ఆయన చెబుతూ... ఆ దిశగా నన్ను ప్రోత్సహించారు. అంతరించే జీవ జాతుల కోసం పాటుపడుతున్న ‘కుకైల్ర్‌ ఘరియల్‌ పునరావాస కేంద్రా’న్ని సందర్శించాల్సిందిగా సూచించారు. ఆ కేంద్రంలో చేపడుతున్న కార్యక్రమాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. అక్కడ కొన్నాళ్ళు స్వచ్ఛందంగా పని చేశాను. ఆ తరువాత ‘టిఎఫ్‌ఎ’లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా చేరాను. దాంతో తాబేళ్ళ పరిరక్షణే నా జీవితంగా మారిపోయింది. ఆ తరువాత టర్టైల్‌ ఎకాలజీలో పిహెచ్‌డి కూడా చేశాను.



దాడులు, బెదిరింపులు

తాబేళ్ళకు ముప్పులు అనేక రూపాల్లో ఉంటాయి. వాటిలో ప్రధానమైనది అక్రమ రవాణా. సముద్ర, నదీ తీరాల నుంచి వాటిని సేకరించి, అక్రమ రవాణా చేసే ముఠాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ముఠాలకు అడ్డుకట్ట వేయడం కోసం బృందాలుగా ఏర్పడి, నిఘా వేసేవాళ్ళం. తాబేళ్ళను తరలించే ప్రయత్నాలను నిరోధించే ప్రయత్నంలో మామీద దాడులు కూడా జరిగాయి. కొందరు స్మగ్లర్లు బెదిరించారు కూడా. కానీ వేటికీ భయపడలేదు. 2017లో... అమేథీ నుంచి తరలిస్తున్న 6,400 తాబేళ్ళను పోలీసుల సాయంతో పట్టుకోగలిగాం. వాటి సంఖ్య చూసి మాకు మతిపోయినట్టయింది. హింసా ప్రవృత్తితో తాబేళ్ళకు హాని చేసేవారు, గాయపడి తీరానికి చేరుకున్న తాబేళ్ళను పట్టించుకోకపోగా వాటిని తరిమికొట్టేవారు ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఆ తాబేళ్ళకు ఎలా సాయం చెయ్యాలనే సంగతి చాలామందికి తెలీదు. ఈ పరిస్థితిని మార్చాలనే ఆలోచనతో... ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అటవీ సిబ్బందికి, పోలీసులకు, స్థానికంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, మత్స్యకారులకు శిక్షణ ఇచ్చాం. దానివల్ల మంచి ఫలితాలు కనిపించాయి.

తాబేళ్ళ కోసం కాలనీలు...

జలచరాలు అంతరించిపోవడానికి మరో ముఖ్య కారణం... వాటి ఆవాసాలను కోల్పోవడం. సముద్రాలు, నదుల్లో కాలుష్యం, మితిమీరిన వేట కారణంగా అవి నివసించే ప్రదేశాల పరిధి తగ్గిపోవడం లేదా ప్రమాదకరంగా మారడం జరుగుతోంది. వాటి సంఖ్య పెరగడానికి, ప్రమాదరహితంగా జీవించడానికి సురక్షితమైన ప్రదేశాలు అవసరం. ఈ నేపథ్యంలో అపురూపమైన 13 జాతుల తాబేళ్ళ కోసం ‘అస్యూరెన్స్‌ కాలనీ’లను, అంతరించే ముప్పులో ఉన్న ఎనిమిది జాతుల కోసం సంతానోత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాం. తద్వారా ముప్ఫైకి పైగా కుటుంబాలకు ఉపాధి కూడా కల్పించాం. నా కార్యక్రమాలు కేవలం తాబేళ్ళకే పరిమితం కాదు. మొసళ్ళు, గంగానదిలోని డాల్ఫిన్ల పరిరక్షణ కోసం కూడా కృషి చేస్తున్నాను. దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను. ఒకసారి లఖనవూలోని భారీ వర్షాలు పడిన సమయంలో... ఒక ఇంట్లోకి మొసలి ప్రవేశించింది. ఈ సమాచారం తెలియగానే నేను అక్కడికి చేరుకున్నాను. దాదాపు ఏడు అడుగులున్న ఆ మొసలిని వరదనీటిలో నియంత్రించడం అంత సులభం కాదు. అయిదుగంటల సేపు ప్రయత్నించిన తరువాత... నేను, నా బృందం దాన్ని పట్టుకొని, అటవీ శాఖవారికి అప్పగించాం. ఈ సంఘటన మా ఇంట్లో చెబితే... ‘‘చిన్నప్పుడు బల్లి అంటే ఎంతో భయపడేదానివి. మొసలి కూడా చాలా రెట్లు పెద్దదైన బల్లిలాగానే ఉంటుంది కదా! ఇప్పుడు భయం పోయిందా?’’ అన్నారు. ‘‘నేను పర్యావరణంతో మమేకమై, జంతువులతో పని చేస్తున్నాను. ఇప్పుడు వాటి పట్ల ప్రేమ తప్ప భయం లేదు’’ అని చెప్పాను. కొన్నిసార్లు జంతువులు దాడి చేయడం, కరవడం కూడా చేశాయి. కానీ బెదిరి పారిపోలేదు. ఎందుకంటే... అవి ఆత్మరక్షణ కోసమే అలా చేస్తాయి.



అది మన కర్తవ్యం

ఇప్పుడు ‘టిఎస్‌ఎ ఇండియా’లో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాను. నా నేతృత్వంలో ఇప్పటివరకూ 35 వేలకు పైగా తాబేళ్ళు, మొసళ్ళు, డాల్ఫిన్‌లను స్మగ్లర్ల నుంచి, హానికరమైన పరిస్థితుల నుంచి కాపాడి, చికిత్స, పునరావాసం కల్పించాం. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా... ప్రజల్లో చైతన్యంతోనే గొప్ప ఫలితాలు వస్తాయి. భవిష్యత్‌ తరాలకు కూడా ఇది తెలియాలి. అందుకే పాఠశాలల్లో, కళాశాలల్లో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ యాభై వేలమందికి పైగా పిల్లలకు అవగాహన కల్పించాం. అలాగే దేశంలో పలు ప్రాంతాల్లో వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నాం. పలు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని చేపట్టిన ఈ కార్యక్రమాలకు గుర్తింపుగా ‘నాట్‌ వెస్ట్‌గ్రూప్‌’ నుంచి ‘ఎర్త్‌ హీరోస్‌’ (సేవ్‌ ది స్పైసెస్‌) అవార్డును, ‘ప్రకృతి రత్న’తో సహా అనేక పురస్కారాలు, గౌరవాలు లభించాయి. నేను సమాజానికి చెప్పేది ఒక్కటే.. తోటి జీవజాతుల పట్ల నిర్లక్ష్యం, క్రూరత్వం, వాటిని అమ్ముకొని లాభం పొందాలనే స్వార్థం లాంటివి పర్యావరణ వ్యవస్థకు, అంతిమంగా మానవులమైన మనకు చేటు తెస్తాయి. కాబట్టి అటువంటి చర్యలను మానుకోవడం, అరుదైన జీవులు అంతరించిపోకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం కావాలి. అందరిలో ఆ కర్తవ్య స్ఫూర్తి నింపడమే నా లక్ష్యం.’’.


Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..

Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..

Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

Updated Date - Mar 03 , 2025 | 01:05 AM