Hair Growth: గోరింటాకుతో కురులు ఆరోగ్యంగా...
ABN, Publish Date - Feb 05 , 2025 | 04:05 AM
గోరింటాకులో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శిరోజాలు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి. గోరింటలోని ఫ్రీరాడికల్స్... మాడు మీద హానికారక సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. గోరింటాకుతో శిరోజాలను అందంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం!
గోరింటాకును మెత్తగా రుబ్బి తలకు పట్టించాలి. అరగంటసేపు ఆరిన తరవాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే శిరోజాలకు పోషణ అంది చక్కగా పెరుగుతాయి. మాడు మీద దురద, చుండ్రు, కురుపులు లాంటి సమస్యలు రావు.
గుప్పెడు గోరింట ఆకులను ఒక కప్పు కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి వడకట్టాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెని చేతి వేళ్లతో తీసుకుని మాడుకు పట్టేలా మర్దన చేయాలి. పలుచని వస్త్రాన్ని తలకు కట్టుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం, నెరవడం లాంటి సమస్యలు తగ్గుతాయి.
ఒక కప్పు గోరింటాకు పొడిలో రెండు చెంచాల మెంతి పొడి, ఒక చెంచా శీకాయ పొడి, ఒక చెంచా ఉసిరి పొడి వేసి అర కప్పు టీ డికాషన్‌తో ముద్దలా కలపాలి. దీనిని తల వెంట్రుకలకు, మాడుకు పట్టించాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే శిరోజాలు రాలడం తగ్గి నల్లగా ఒత్తుగా నిగారిస్తాయి.
ఒక కప్పు గోరింటాకు పొడిలో రెండు చెంచాల కాఫీ పొడి, ఒక చెంచా మందార నూనె వేసి నీళ్లతో కలిపి తలకు పట్టిస్తే జుట్టు నెరవడం తగ్గుతుంది.
గోరింట పొడిని గుడ్డు తెల్ల సొనతో కలిపి తలకు పట్టించి రెండు గంటల తరవాత శీకాయ పొడితో తలస్నానం చేస్తే తల వెంట్రుకలు నున్నగా మెత్తగా మెరుస్తాయి.
ఒక కప్పు బ్లాక్ టీలో అర కప్పు గోరింట పొడిని కలిపి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఈ మిశ్రమంలో కొద్దిగా పెరుగు కలిపి తలకు పట్టించి ఇరవై నిమిషాల తరవాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
Updated Date - Feb 05 , 2025 | 04:05 AM