Copper Utensils: రాగి వస్తువులు మెరవాలంటే...
ABN, Publish Date - Mar 01 , 2025 | 07:04 AM
రాగితో తయారుచేసిన పాత్రలు, బిందెలు, గ్లాసులు, వాటర్‌బాటిల్స్ లాంటివి ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో జరిగే ఆక్సికరణ చర్యల వల్ల ఇవి నల్లగా మారుతుంటాయి. వీటిని కొత్తవాటిలా మెరిపించే చిట్కాలివి.
ఒక గిన్నెలో నాలుగు చెంచాల ఉప్పు, రెండు చెంచాల నిమ్మరసం వేసి బాగా కలపాలి. పలుచని వస్త్రం లేదా స్క్రబ్బర్‌తో ఈ మిశ్రమాన్ని అద్ది దాంతో రాగి వస్తువులను తోమాలి. రెండు నిమిషాల తరవాత మంచినీటితో శుభ్రం చేసి పొడిగుడ్డతో తుడిస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.
గిన్నెలో మూడు చెంచాల వెనిగర్, రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి పేస్టులా కలపాలి. దూది ఉండ లేదా పలుచని వస్త్రం సహాయంతో ఈ మిశ్రమాన్ని రాగి వస్తువులకు పూతలా పట్టించాలి. పావుగంటసేపు అలాగే ఉంచాలి. తరవాత తడిగుడ్డతో శుభ్రంగా తుడిస్తే వాటిపై పేరుకున్న నలుపుదనం తొలగిపోతుంది.
టమాటా రసంలో స్క్రబ్బర్ ముంచి దాంతో రాగి వస్తువులను తోమితే వాటిపై పేరుకున్న నలుపుదనం, దుమ్ము, ధూళి తొలగిపోతాయి.
ఒక గిన్నెలో రెండు చెంచాల ముల్తానీమిట్టి, మూడు చెంచాల నీళ్లు కలిపి పేస్టులా చేయాలి. దీనిని రాగి వస్తువులకు పట్టించాలి. మెత్తని బ్రష్‌తో రెండు నిమిషాలు సున్నితంగా రుద్ది తరవాత నీటితో కడిగితే వాటి నలుపుదనం మొత్తం పోతుంది. ఈ చిట్కా వల్ల వస్తువుల ఉపరితలంపై గీతలు పడకుండా ఉంటాయి.
Updated Date - Mar 01 , 2025 | 07:04 AM