Banana Stem: అరటి దుంప పెరటి మందు
ABN, Publish Date - Mar 01 , 2025 | 07:10 AM
అరటి దుంపను తినేవాళ్లు తక్కువ మందే! దీనిని చాలా మంది తవ్వి బయట పారేస్తారు. దీనికి కారణం- అరటి దుంప ఉపయోగాలు తెలియకపోవటమే! అరిటి దుంప ఉష్ణ మండల వాసులకు ముఖ్యంగా తెలుగువారికి వరప్రసాదమనే చెప్పాలి.
అరటిలోని ఆకులు, కాండం, పళ్లు, దూట- ఇలా ప్రతి భాగం మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అయితే అరటి దుంపను తినేవాళ్లు తక్కువ మందే! దీనిని చాలా మంది తవ్వి బయట పారేస్తారు. దీనికి కారణం- అరటి దుంప ఉపయోగాలు తెలియకపోవటమే! అరిటి దుంప ఉష్ణ మండల వాసులకు ముఖ్యంగా తెలుగువారికి వరప్రసాదమనే చెప్పాలి. అందుకే భోజన కుతూహలం గ్రంధంలో అరటి దుంప గుణాలను విపులంగా చర్చించారు. ఈ గ్రంధంలో
‘‘బల్యః కదల్యాః కందస్స్యాత్ కఫపిత్తహరో గురుఃవాతలో రక్తశమన్ కషాయో రూక్షశీతలః’’ అని పేర్కాన్నారు. ఈ శ్లోక అర్థాన్ని గమనిస్తే బల్యః కదల్యః కందస్స్యాత్: అరటి దుంప బలకరమైన ఆహార ద్రవ్యం.
కఫపిత్తహరో: కఫ వ్యాధులు దీనితో తగ్గుతాయి. పైత్యవ్యాధులు అదుపులోకి వస్తాయి. వేడి తగ్గి శరీరంలో ఉద్రేకం శాంతిస్తుంది.
గురుః: ఆలస్యంగా అరుగుతుంది. కడుపుపులో దండిగా ఉంటుంది. అలూతోనో కందదుంపతోనో మనం వండుకునేవన్నీ అరటి దుంపతోనూ వండుకోవచ్చు. అరటి దుంపని ఇలా వండుకుని కొద్దిగా తిన్నా చాలు, ఎక్కువ ఫలితం కనిపిస్తుంది.
వాతల: ఆలస్యంగా అరిగే ద్రవ్యాలను పరిమితంగా తినాలి. జీర్ణశక్తి మందంగా ఉన్నవారికి ఇది వాతాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి జీర్ణశక్తి ననుసరించి దీన్ని వండుకునే విధానం ఉండాలి.
రక్తశమన: రక్తంలో ఉద్రేకాన్ని ఉపశమింపచేస్తుంది. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు నెరవేరుతాయి. మొదటిది బీపీ పెరుగుదలను అరికడుతుంది. రెండోది రక్తస్రావాన్ని అరికడుతుంది.
కషాయో: దీనికి వగరు రుచి ఉంటుంది. అందువల్ల దీనిని మధుమేహం, స్థూలకాయం ఉన్నవారు తినవచ్చు.
రూక్షా: శరీరానికి బిరుసుదనాన్నిస్తుంది.
శీతల: శరీరానికి చలవనిస్తుంది. వేడిని తగ్గిస్తుంది.
ప్రయోజనాలెన్నో!
అరటి దుంప కడుపులో ఎసిడిటిని నియంత్రిస్తుంది. పేగుపూత వంటి వ్యాధులను నివారిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే శక్తి దీనికుంది. పురుషుల్లో జీవకణాల్ని పెంచుతుంది. అరటి దుంపను తరచూ తినేవారికి జుత్తు ఏపుగా పెరుగుతుంది. స్త్రీ సంబంధిత వ్యాధుల్లో దీని ప్రభావం ఎక్కువ. గర్భాశయపోషకాల్లో ఇది ముఖ్యమైంది. రక్తంతో కూడిన వాంతుల్ని అరికడుతుంది. పళ్లలో నుంచి రక్తం కారటం తగ్గుతుంది. మూత్రం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. కడుపులో తిష్ఠ వేసుకుని ఉంటున్న ఎలికపాముల్ని చంపి బయటకు తోసేస్తుంది. దీని వేర్లకు క్రిమిసంహారక గుణం ఉంది.
ఇలా వండుకోవచ్చు...
అరటి దుంపల్ని పిలకలు, వేర్లతో సహా వండుకుని తినవచ్చు. ముందుగా అరటి దుంపను వేర్లతో సహా పెకలించి, మట్టి పోయేలా కడిగి పైన పెచ్చు తీసేసి సన్నని ముక్కలుగా తరిగి దానిలో కొద్దిగా నూనె వేసి.. దానిపై నీళ్ల మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన ముక్కలతో కూర చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు.
గంగరాజు అరుణాదేవి
అరటి దుంప గుణధర్మాల్ని అనుసరించి దాన్ని వండుకునే విధానం ఉండాలి. ఇది చలవ నిచ్చే ద్రవ్యం కాబట్టి వేడి చేసే పదార్థాలతో కలిపి వండితే విరుద్ధాహారం అవుతుంది. అలాగే ఇది ఆలస్యంగా అరుగుతుంది. కాబట్టి దీన్ని తేలికగా అరిగించే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం లాంటి వాటితో కలిపి వండుకోవాలి. ఇది వాతస్వభావం కలిగింది కాబట్టి దీన్ని చింతపండు రసం పోయకుండా వండాలి.
Updated Date - Mar 01 , 2025 | 07:10 AM