ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Meenakshi Das: సాహసమే శ్వాసగా

ABN, Publish Date - Feb 18 , 2025 | 11:47 PM

దాదాపు ఏడాది కాలంలో... అరవై నాలుగు దేశాల్ని ఆమె బైక్‌ మీద చుట్టేశారు అసోం రాష్ట్రానికి చెందిన 41 ఏళ్ల ఈ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌... ఇప్పుడు మరో యాత్రకు సిద్ధమవుతున్నారు.

లలు అందరూ కంటారు... సాహసం, సహనం ఉన్న మీనాక్షి దాస్‌ లాంటి వారు మాత్రమే వాటిని నెరవేర్చుకోగలుగుతారు. దాదాపు ఏడాది కాలంలో... అరవై నాలుగు దేశాల్ని ఆమె బైక్‌ మీద చుట్టేశారు అసోం రాష్ట్రానికి చెందిన 41 ఏళ్ల ఈ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌... ఇప్పుడు మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. భీకరమైన వాతావరణాలు, వీసా కష్టాలే కాదు... ఎందరో అపరిచితుల ప్రేమను, ఆతిథ్యాన్ని చవి చూశానంటున్న మీనాక్షి తన ప్రయాణం గురించి చెబుతున్న సంగతులివి.

‘‘బైక్‌ నడపడం నేర్చుకుంటానంటే ఎప్పుడూ వద్దనే నాన్న... నా ఆసక్తిని గుర్తించి తన కైనెటిక్‌ హోండా నడపడం నేర్పారు. అప్పుడు నాకు పదహారేళ్ళు. మొదటిసారి గువాహటి వీధుల్లో బైక్‌ నడుపుతున్నప్పుడు... గొప్ప స్వేచ్ఛ లభించిన అనుభూతి. అప్పటి నుంచి బైక్‌ నా జీవితంతో విడదీయలేని భాగం అయిపోయింది. అస్సామీ మహిళగా... ఈశాన్య భారత దేశమంతా చుట్టేయాలని ఉండేది. చదువు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వృత్తి బాధ్యతలతో ఆ ఆలోచన క్రమంగా మరుగున పడిపోయింది. పెళ్ళయిన తరువాత, నా భర్త వేదాంతకు కూడా బైక్‌ ట్రిప్స్‌ సరదా కావడంతో... ఆయనతో కలిసి అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో తిరిగి వచ్చాను.


ఆ రోడ్లలో, మలుపుల్లో ప్రయాణం ఆహ్లాదాన్నే కాదు, భయాన్ని కూడా కలిగించింది. ఏదో ఒక రోజు నేనొక్కదాన్నే పర్యటనలు చెయ్యాలనుకొనేదాన్ని. కొన్నేళ్ళపాటు నా జీతంలో దాచుకున్న డబ్బుతో... 2019లో సొంతంగా నా మొదటి బైక్‌ కొనుక్కున్నాను.

కొన్ని నెలల తరువాత... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న మోటారబుల్‌ రహదారి ‘ఉమ్లింగ్‌ లా పాస్‌’లో బైక్‌ మీద ప్రయాణం చేశాను. ఈ మార్గంలో యాత్ర చేసిన రెండవ మహిళను నేనే.


ఆ మూడూ కుదరలేదు...

ఉమ్లింగ్‌ లా పాస్‌ అనుభవం నాకు ఉత్సాహాన్నిచ్చింది. కరోనా ఆంక్షలు ముగిసిన తరువాత... 2022లో నేపాల్‌కు సోలో రైడ్‌ చేశాను. ‘‘మగ తోడు లేకుండా ఈ తిరుగుళ్ళేమిటి?’’ అని నోళ్ళు నొక్కుకున్నవారు చాలామంది ఉన్నారు. నేను అవేవీ పట్టించుకోలేదు. కొత్త సాహసాలు చేయాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉండేది. వివిధ దేశాల్ని బైక్‌లో చుట్టెయ్యాలనే ఆలోచన వచ్చింది. ఒక మహిళ పేరిట 50 దేశాల్లో... బైక్‌ మీద పర్యటించిన ప్రపంచ రికార్డు ఉందని విన్నాను. నేను 67 దేశాల్లో ప్రయాణించి, ఆ రికార్డును బద్దలుగొట్టడంతోపాటు, మహిళా సాధికారతను చాటి చెప్పాలని నిశ్చయించుకున్నాను. నా భర్త, కుటుంబం కూడా అంగీకరించారు. 2023 డిసెంబర్‌ 17న నేపాల్‌కు బైక్‌లో వెళ్ళి, అక్కడినుంచి ముంబై చేరుకున్నాను. నా బైక్‌ను దుబాయ్‌ పంపించి, నేను కూడా అక్కడికి విమానంలో వెళ్ళాను. అక్కడి నుంచి నా యాత్ర ప్రారంభమయింది. 2024 డిసెంబర్‌ 24న... స్వదేశం చేరుకోవడంతో పూర్తయింది. ఈ ప్రయాణంలో... 372 రోజుల్లో... 64 దేశాలు పర్యటించాను. మయన్మార్‌, ఒమన్‌, ఇరాక్‌ దేశాల్లో కూడా ప్రయాణిస్తే... నా 67 దేశాల లక్ష్యం నెరవేరేది. కానీ భద్రతాపరమైన ఆక్షల కారణంగా... ఆ దేశాల్లో ప్రవేశానికి అనుమతి దొరకలేదు.


ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేశాను...

ఇది అంత సులువుగా, సజావుగా సాగిన ప్రయాణం కాదు. మొదటి సమస్య నిధులు. ఈ మొత్తం యాత్రకు రూ.54 లక్షలు అవసరమవుతుందని అంచనా వేశాను. ఇది ఈశాన్య భారతం నుంచే కాదు, మొత్తం మన దేశం నుంచి స్థాపించే ప్రపంచ రికార్డు కాబట్టి, ప్రజలు సాయం చేస్తారని విశ్వసించాను. స్పాన్సర్ల కోసం వెతికాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, క్రీడా, పర్యాటక మంత్రిత్వ శాఖలకు విజ్ఞాపనలు చేసుకున్నాను. అందరూ హామీలు ఇచ్చారు, కానీ ఎవరి నుంచీ ఒక రూపాయైునా అందలేదు. దీనితో మా పొలాన్ని తాకట్టు పెట్టాను. మిగిలిన మొత్తం కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ కోసం ప్రయత్నించాను. ఒక వ్యక్తి రూ. 10 లక్షలు ఇచ్చి ప్రోత్సహించారు. అలా నా ఖాతాలో రూ.20 లక్షలు చేరాయి. కీలకమైన వీసాలు తీసుకోవడానికి అది సరిపోతుందని భావించి, నా యాత్రను చేపట్టాను. ఇక ప్రయాణాల్లో ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పాలంటే... యమన్‌, ఒమన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా దారి మార్చుకోవాల్సి వచ్చింది. నన్ను, నా బైక్‌ను ఫెర్రీలో తీసుకువెళ్ళడానికి సిద్ధపడిన ఒక ఎన్జీవో... ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో... కతార్‌కు బైక్‌తో సహా విమానంలో వెళ్ళాల్సి వచ్చింది. దానికి అదనంగా దాదాపు మూడు లక్షలు ఖర్చయ్యాయి. ఇక తీవ్రమైన ఇసుక తుపాను కారణంగా... 13 రోజులు జోర్డాన్‌లో చిక్కుకుపోయాను. అక్కడ ప్రియాంక అనే మహిళ నాకు ఆశ్రయం ఇచ్చారు. అక్కడినుంచి బయలుదేరినప్పుడు... అయిదు వందల డాలర్లు ఒక కవర్లో పెట్టి ఆమె ఇచ్చినప్పుడు.. ఉద్వేగంఆపుకోలేక ఏడ్చేశాను.


కష్టమైనా... ఆపాలనుకోలేదు...

ఇక కొన్ని దేశాల్లో తీవ్ర స్థాయిలో వీసా కష్టాలు కూడా ఎదురయ్యాయి. ఈ యాత్ర కోసం ఎన్నో వదులుకోవాల్సి వచ్చింది. డబ్బు ఆదా చేయడం కోసం నాలుగు నెలలపాటు మధ్యాహ్నం భోజనం చేయలేదు. వర్షాలు, మంచు కారణంగా చిన్న అనారోగ్యాలకు కూడా గురయ్యాను. మా నాన్న అయిదేళ్ళ క్రితం చనిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మకు, బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్న మా అమ్మాయికి, నా భర్తకు దూరంగా ఉండడం బాధగా అనిపించేది. ప్రయాణాల్లో వారు గుర్తుకు వచ్చినప్పుడు ఏడ్చేదాన్ని. నా వేదనలన్నీ నా ముఖానికి ధరించిన హెల్మెట్‌కు తెలుసు. కానీ ఎంత కష్టమైనా... ఈ ప్రయాణాన్ని ఆపాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇది కేవలం నా కోసం కాదు, ఎగతాళికి గురైన ప్రతి ఒంటరి మహిళ కోసం చేసే ప్రయాణం అనుకున్నాను. నేను వెళ్ళాల్సిన దూరాలు ఇంకా చాలా ఉన్నాయి. మిగిలిన మూడు దేశాలతో పాటు.... త్వరలోనే రష్యా, అమెరికాల్లో సాహస యాత్రలకు సిద్ధమవుత ున్నాను. ఈసారి నా భర్త కూడా నాతో ప్రయాణంలో భాగస్వామి అవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Rahul Gandhi: అర్ధరాత్రి నిర్ణయం సరికాదు... సీఈసీ ఎంపికపై రాహుల్

Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా

Mahakumbh: 26న చిట్టచివరి స్నాన ఘట్టం... హై అలర్ట్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 11:47 PM