Diabetes: చక్కెర వ్యాధికి చుక్కలు చూపిద్దాం!
ABN, Publish Date - Feb 25 , 2025 | 03:58 AM
మధుమేహాన్ని తిరోగమించేలా చేయవచ్చు. అంతే తప్ప తిరిగి రాకుండా చేయలేం! అంటున్నారు ప్రముఖ వైద్యులు, డాక్టర్ వసంత్ కుమార్. ఈ వ్యాధిని రివర్స్ చేస్తామనే ప్రలోభాలకు లోను కావద్దనీ, కొత్త మందులతో చక్కెర వ్యాధికి చుక్కలు చూపించడం సాధ్యమేననీ అంటున్నారాయన. ఈ వ్యాధి గురించి ఆయన మాటల్లోనే...
ఏళ్ల తరబడి మధుమేహంతో బాధపడుతూ, చక్కెర హెచ్చుతగ్గులకు లోనయ్యే వాళ్లలో మందులు ప్రభావం చూపించని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే మూత్రపిండాలు, గుండె దెబ్బతినే సమస్య కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో పాత మాత్రలే వాడుకోవడం వల్ల ప్రయోజనం లేకపోగా, మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో గత ఐదు, పదేళ్ల నుంచి మధుమేహానికి కొత్త మందులు అందుబాటులోకొచ్చాయి. సురక్షితమైన, ప్రభావవంతమైన ఈ మందులతో మూత్రపిండాలు, గుండెకు కూడా అదనపు రక్షణ దక్కుతుంది. దీర్ఘకాలం నుంచి మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు కూడా ఈ మందులను నిర్భయంగా వాడుకోవచ్చు. నిజానికి పాత మందులు విఫలయ్యేవరకూ ఆగకుండా, వీలైనంత త్వరగా కొత్త మందులు మొదలుపెట్టుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.
కొత్త మందులతో గుండెకు, కిడ్నీలకు రక్ష
మధుమేహంలో మూడు రకాల మందులున్నాయి. మొదటి రకం... జిఎల్‌పి-1 అనలాగ్స్. ఇవి ఇంజెక్షన్స్, మాత్రలు... రెండు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఈ మందులకున్న అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే, అధిక బరువు కలిగి ఉన్న వాళ్లు ఈ మందులు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కానీ ఈ మందులు ఖరీదైనవి. ఇవే కాకుండా డిపిపి-4 ఇన్హిబిటర్స్ అనే రెండో రకం మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మాత్రల రూపంలో దొరుకుతాయి. పాత మందుల స్థానంలో వీటిని వాడుకోవచ్చు. కొత్తగా మధుమేహం బారిన పడిన వాళ్లు కూడా వీటితోనే చికిత్స మొదలుపెట్టుకోవచ్చు. మూడో రకం మందులు... ఎస్‌జిఎల్‌టి2 ఇన్హిబిటర్స్. ఈ విభాగానికి చెందిన ‘డాపాగ్లిఫోజిన్’ విస్తృతంగా వాడుకలో ఉంది.
పాత మందులు బరువును పెంచే దుష్ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ కొత్త మందులతో ఆ భయం లేకపోగా, బరువు తగ్గే ప్రయోజనాన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంది. ఈ మందులు, రక్తంలో ఉన్న చక్కెరను మూత్రపిండాల సహాయంతో మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. దాంతో మూత్రం ద్వారా చక్కెర బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి ఈ మందులతో చక్కెర వ్యాధి ముప్పు తప్పినా, కొంతమందిలో మూత్రనాళ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వేధించే అవకాశాలుంటాయి. కానీ ఈ సమస్యకు శారీరక శుభ్రతతో అడ్డుకట్ట వేయవచ్చు.
కొని తెచ్చుకుంటున్నామా?
40 ఏళ్లకు చక్కెర వ్యాధి నిర్థారణ అయితే, ‘అయ్యో ఇంత చిన్న వయసులోనే వచ్చేసిందా?’ అని కంగారు పడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు 30 ఏళ్లకే మధుమేహం బారిన పడుతున్నాం. చిన్న వయసు నుంచి ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు. మనం మన పిల్లలకు శుద్ధి చేసిన పదార్థాలు, ప్యాకెట్లలో దొరికే పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు తినిపిస్తున్నాం. మనమేమో, ప్లేటు నిండా తెల్ల అన్నం పెట్టుకుని, ప్రొటీన్లు, పీచు తక్కువగా, పిండిపదార్థాలు ఎక్కువగా తినేస్తున్నాం. అలాగే నూనెలు, చక్కెరతో తయారయ్యే పదార్థాలు కూడా ఎక్కువగా తింటున్నాం. తీపి పెద్దగా తినం అనుకునేవాళ్లు, రోజుకు ఏడెనిమిది సార్లు టీలు, కాఫీలు తాగితే అంతే సమానమైన చక్కెర మన శరీరాల్లోకి చేరిపోతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఉరుకుల పరుగుల జీవితాలకు అలవాటు పడిపోయి వ్యాయామాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. వీటికి తోడు వృత్తిపరమైన ఒత్తిళ్లు. వెరసి 30 ఏళ్లకే మధుమేహం బారిన పడుతున్నాం. ఈ వ్యాధిలో లక్షణాలు బయల్పడవు కాబట్టి నిర్థారణ, చికిత్స... ఆలస్యమయ్యే ప్రమాదం కూడా ఉంటోంది. కాబట్టి 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారి చక్కెర పరీక్ష చేయించుకోవాలి. దాన్లో మధుమేహం లేదని ఫలితం వస్తే, ఇక మధుమేహం రాదనుకోకూడదు. చక్కెర లేదని తెలిస్తే, మళ్లీ రెండు మూడేళ్ల వరకూ ఆ పరీక్ష జోలికి వెళ్లని వాళ్లు కూడా ఉంటారు. కానీ వీళ్లే, ఏదో ఒక సందర్భంలో చేయించుకునే పరీక్షల్లో అత్యధిక చక్కెర కనిపించగానే భయంతో, వైద్యుల దగ్గరకు పరుగులు పెడుతూ ఉంటారు. మొట్టమొదటిసారి చక్కెర వ్యాధి నిర్థారణ అయిన వాళ్లలో అత్యధిక మోతాదుల్లో చక్కెర ఉండడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టి మధుమేహం లేని వాళ్లు ప్రతి ఆరు నెలలకూ, మధుమేహులు ప్రతి నెలా చక్కెరను పరీక్షించుకుంటూ ఉండాలి. మధుమేహ మందులు వాడుకుంటున్న వాళ్లు, ప్రతి మూడు నెలలకోసారి, హెచ్‌బిఎ1సి పరీక్ష కూడా చేయించుకుంటూ, ఫలితం ఏడు లోపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే, గత మూడు నెలల నుంచి చక్కెర అదుపులోనే ఉందని అర్థం.
మధుమేహం ‘రివర్స్’ కాదు
చక్కెర వ్యాధికి మందులు వాడడం ఎంత ముఖ్యమో, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం అంతే ముఖ్యం. క్రమం తప్పకుండా మందులు వాడుతూ, ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామంతో బరువు తగ్గించుకుంటే, చక్కెర మందులు ఆపేయవచ్చు కూడా! అయితే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, మునుపటి జీవనశైలినీ, ఆహార నియమాలనూ తూచ తప్పకుండా కొనసాగించాలి. ఇలా మధుమేహాన్ని తిరోగమించేలా చేయవచ్చు. కానీ తిరిగి రాకుండా చేయలేం! కానీ ఇటీవలి కాలంలో మధుమేహాన్ని రివర్స్ చేయొచ్చనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇది పూర్తి అబద్ధపు ప్రచారం.
నివారణ మన చేతుల్లోనే...
సాధారణంగా తెల్ల అన్నం తినేవాళ్లు కూరలు తక్కువగా అన్నం ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది అనారోగ్యకరం. తెల్ల అన్నానికి బదులుగా దంపుడు బియ్యం/బ్రౌన్ రైస్ పరిమితంగా, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులు ఎక్కువగా తీసుకోవాలి. దుంపలు మానేయడం మంచిది. అలాగే మధుమేహులు పండ్లు నిర్భయంగా తినొచ్చు. ప్రతి రోజూ కొద్దిగా బొప్పాయి, లేదా కమలా పండు, జామ పండు తినొచ్చు. అరటి పండ్లు, మామిడి, పైనాపిల్ చాలా తక్కువగా తినాలి. పండ్లలోని విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి, మధుమేహులు పండ్లు తినడం అవసరం. తీపి తినాలనిపించినప్పుడు పండు తినడం అన్ని విధాలా ఆరోగ్యకరం. ఈ నియమాలతో పాటు....
బరువును అదుపులో పెట్టుకోవాలి
ప్రతి రోజూ అరగంట పాటు నచ్చిన వ్యాయామం చేయాలి
ఒత్తిడిని అదుపులో పెట్టుకోవాలి
క్రమం తప్పకుండా చక్కెరను పరీక్షించుకుంటూ ఉండాలి
సమతులాహారం తీసుకోవాలి
తీపిని వీలైనంత తగ్గించాలి
దురలవాట్లకు దూరంగా ఉండాలి
మధుమేహులను దోచుకునే ధోరణి ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఒక పౌడరు వాడుకుంటే, మధుమేహం ఉన్నప్పటికీ ఎలాంటి ఆహార నియమాలూ పాటించవలసిన అవసరం లేదని ప్రచారం చేసుకుంటున్న వాళ్లున్నారు. సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్‌లో రకరకాల చిట్కాలు కూడా షికార్లు చేస్తుంటాయి. కానీ ఇవన్నీ వృథా ప్రయాసలే!
జిఎల్‌పి-1 అనలాగ్ మందులు ఇంజెక్షన్లు, మాత్రల రూపంలో ఉంటాయి. ఇంజెక్షన్ రూపంలో ఉన్న జిఎల్‌పి-1 అనలాగ్‌ను బరువు తగ్గడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ‘ఒజెంపిక్’ పేరుతో విదేశాల్లో విస్తృతంగా వాడుకలోకొచ్చిన ఈ ఇంజెక్షన్లు ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో లేవు. మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు మూత్రపిండాలు, గుండెకు రక్షణ కల్పించడం, బరువు తగ్గించే అదనపు ప్రయోజనాన్ని కలిగి ఉండడం వల్ల ఈ ఇంజెక్షన్లకు సర్వత్రా ఆదరణ పెరిగిపోయింది. మధుమేహం లేని వాళ్లు కూడా అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఈ ఇంజెక్షన్లను తీసుకోవచ్చని యుఎస్ ఎఫ్‌డిఎ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఆమోదించడంతో వీటి వాడకం పెరిగింది. అయితే ఇవే ఇంజెక్షన్లు సెమాగ్లూటైడ్ అనే మాత్రల రూపంలో మనకు కూడా అందుబాటులో ఉన్నాయి. ’
ఇన్సులిన్‌తో ప్రమాదం లేదు
సాధారణంగా ఇన్సులిన్ అనగానే మధుమేహులు ఉలిక్కిపడుతూ ఉంటారు. చక్కెర, మాత్రలతో అదుపు కాని పక్షంలో, చివరి ప్రయత్నంలో భాగంగా ఇన్సులిన్ తీసుకోవాలనే అపోహ మధుమేహుల్లో స్థిరపడిపోయింది. కానీ పదేళ్లు, పదిహేనేళ్ల పాటు మధుమేహంతో బాధపడుతున్న వాళ్లకు మందులు పని చేయని పరిస్థితి తలెత్తవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇన్సులిన్ తీసుకోవడంలో తప్పు లేదు. దీంతో భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. కాబట్టి వైద్యులు ఇన్సులిన్‌ను సూచించినప్పుడు వద్దని అనకూడదు. ఒకవేళ ఇన్సులిన్ ఇంజెక్షన్‌తో చక్కెర అదుపులోకి వస్తే, కొంతకాలం తర్వాత ఈ ఇంజెక్షన్ ఆపేయవచ్చు కూడా!
డాక్టర్ వసంత్ కుమార్
సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్,
ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఆఫ్ డయాబెటిస్ అండ్ యూ సొసైటీ,
అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2025 | 03:59 AM