Cauliflower Recipes: కాలీఫ్లవర్‌తో కొత్తగా...
ABN, Publish Date - Feb 08 , 2025 | 12:09 AM
కాలిఫ్లవర్ అంటే ఇష్టపడనివారు ఉండరు. దీంతో మంచూరియా, పకోడీ లాంటి స్నాక్ ఐటమ్స్ మాత్రమే కాదు... రుచికరమైన కూరలు కూడా చేసుకోవచ్చు. అలాంటి కొన్ని కూరల తయారీ మీ కోసం...
ఆలూ గోబీ మసాలా
కావాల్సిన పదార్థాలు
ఫ ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు- ఒక కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు- ఒక కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు- అర కప్పు, నూనె- మూడు చెంచాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, టమాటా ముక్కలు- ఒక కప్పు, జీలకర్ర- ఒక చెంచా, అల్లం తరుగు- రెండు చెంచాలు, వెల్లుల్లి తరుగు- ఒక చెంచా, ధనియాల పొడి- ఒక చెంచా, కారం- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, ఆమ్‌చూర్- ఒక చెంచా, ఇంగువ- తగినంత, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు
తయారీ విధానం
ఫ స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇంగువ, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి బాగా వేపాలి. తరవాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. మిశ్రమం నుంచి నూనె పైకి తేలుతున్నప్పుడు ఆలుగడ్డ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, బఠానీలు వేసి కలపాలి. ఒక నిమిషం తరవాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాలు మగ్గించాలి. తరవాత కొత్తిమీర చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ కూరని పిల్లలు ఇష్టంగా తింటారు.
జాగ్రత్తలు
ఆలుగడ్డ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసిన తరవాత అవి చిదమకుండా జాగ్రత్తగా కలపాలి.
కూర గ్రేవీలా రావాలనుకుంటే చివరలో కమ్మని పెరుగు కలుపుకోవచ్చు.
కాలీఫ్లవర్ చికెన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు
ఫ బోన్‌లెస్ చికెన్ ముక్కలు- అరకేజీ, కాలీఫ్లవర్- అరకేజీ, పెద్ద సైజు ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిరపకాయలు- మూడు, టమాటాలు- రెండు, తరిగిన అల్లం- రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, గరం మసాలా పొడి- రెండు చెంచాలు, పసుపు- పావు చెంచా, కారం- అర చెంచా, ధనియాల పొడి- ఒక చెంచా, నూనె- మూడు చెంచాలు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని, తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు
తయారీ విధానం
ముందుగా చికెన్ ముక్కలు, కాలీఫ్లవర్‌లను మంచినీళ్లతో శుభ్రంగా కడగాలి. కాలీఫ్లవర్‌ను పువ్వుల మాదిరి కోయాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలను కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోవాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి అయిదు నిమిషాలు వేగనివ్వాలి. తరవాత పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, అల్లం తరుగు, వెల్లుల్లి మిశ్రమం వేసి కలపాలి. అవి రెండు నిమిషాలు వేగాక టమాటా ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ ముక్కలు వేసి కలిపి గిన్నెమీద మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తరవాత కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలిపి కొన్ని నీళ్లు చల్లి మూతపెట్టాలి. పది నిమిషాల తరవాత ధనియాల పొడి కలపాలి. చివరలో కొత్తిమీర చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ కూర వేడి అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది.
జాగ్రత్తలు
కాలీఫ్లవర్ కొనేముందు బాగా తెల్లగా గట్టిగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి.
ఈ వంటకం రుచిని పెంచడానికి చికెన్ ముక్కలు ఉడికేటప్పుడు పావు కప్పు కొబ్బరిపాలు చేర్చుకోవచ్చు.
చికెన్ ముక్కలు తొందరగా మెత్తబడతాయి. అవి ఉడుకుతున్నప్పుడు మధ్యమధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా ఉడికితే కూర అంత రుచిగా ఉండదు.
కాలీఫ్లవర్ మసాలా బుర్జీ
కావాల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్- పావు కేజీ, పచ్చి బఠానీలు- ఒక కప్పు, నూనె- మూడు చెంచాలు, లవంగాలు- అయిదు, యాలకులు- మూడు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, జీలకర్ర- అర చెంచా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, టమాటాలు- మూడు, పచ్చిమిరపకాయలు- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, కారం- రెండు చెంచాలు, ధనియాల పొడి- ఒక చెంచా, కసూరీ మేతీ- ఒక చెంచా, గరం మసాలా పొడి- అర చెంచా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నీళ్లు- ఒక కప్పు
తయారీ విధానం:
ముందుగా కాలీఫ్లవర్‌ను పెద్ద ముక్కలుగా విడదీయాలి. వీటికి కాడ ఉండేలా చూసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పోసి అర చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా మరిగించి దించాలి. ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసి అయిదు నిమిషాలు ఉంచాలి. తరవాత ముక్కలను పళ్లెంలోకి తీసి చల్లారనివ్వాలి. పచ్చి బఠానీలను కూడా నీళ్లు పోసి సగం వరకు ఉడకనివ్వాలి.
లావుపాటి పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్ సహాయంతో కాలీఫ్లవర్ ముక్కలను తురిమి బుర్జీని సిద్దం చేసుకోవాలి. టమాటాలను ముక్కలుగా కోసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి దోరగా వేపాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అయిదు నిమిషాలు వేగనివ్వాలి. తరవాత టమాటా పేస్టు, ఉప్పు, పచ్చి బఠానీలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. మిశ్రమం నుంచి నూనె తేలే వరకు వేగనివ్వాలి. తరవాత ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపి రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి. తరవాత కాలీఫ్లవర్ బుర్జీని కూడా వేసి బాగా కలిపి ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఆరు నిమిషాలు ఉడికించాలి. గిన్నెలో మిశ్రమం దగ్గరకు వచ్చాక కసూరి మేతీ, గరం మసాలా పొడి, కొత్తిమీర తరగు వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ మసాల బుర్జీని వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
జాగ్రత్తలు
కూరలో బఠానీలు మెత్తగా ఉండాలన ుకుంటే ముందుగానే ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఫ్రోజెన్ బఠానీలు తెచ్చుకుంటే వాటిని నేరుగా వాడుకోవచ్చు.
కూరలో ఒక చెంచా పెరుగు కలిపితే దాని రుచి పెరుగుతుంది.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?
Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు
Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత
Updated Date - Feb 08 , 2025 | 12:09 AM