Aloe Vera: కలబందతో కాంతివంతంగా...
ABN, Publish Date - Jan 19 , 2025 | 02:49 AM
ముఖం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, సూర్య కిరణాలు, చలి గాలులవల్ల ముఖం నిగారింపు కోల్పోతుంటుంది.
ముఖం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, సూర్య కిరణాలు, చలి గాలులవల్ల ముఖం నిగారింపు కోల్పోతుంటుంది. కలబంద గుజ్జుతో చిన్న చిట్కాలు పాటిస్తే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఒక చెంచా కలబంద (అలోవెరా) గుజ్జులో అర చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. పది నిమిషాలు ఆరిన తరవాత మంచి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే ఎండ వల్ల వచ్చిన నలుపుదనం తగ్గుతుంది. చర్మానికి తేమ అంది ముఖం నున్నగా మెరుస్తుంది.
రెండు చెంచాల కలబంద గుజ్జులో మూడు చెంచాల కీర గుజ్జు వేసి కలపాలి. దీనిని ముఖానికి పట్టించాలి. కళ్ల మీద కీర చక్రాలు పెట్టుకోవాలి. అరగంట విశ్రాంతి తీసుకున్న తరవాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఓసారి చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఒక అంగుళం కలబంద ముక్క నుంచి గుజ్జును తీసి దానికి రెండు చెంచాల గ్రీన్ టీ నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో కొద్దిగా తీసుకుంటూ నుదుటి మీద, కళ్ల కింద, బుగ్గల మీద రాయాలి. ఇరవై నిమిషాలు ఆరిన తరవాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులు చేస్తే నుదుటి మీద గీతలు, కళ్ల కింద వలయాలు, మూతి చుట్టూ ముడతలు తగ్గిపోతాయి. చర్మం బిగుతుగా మారుతుంది.
అర చెంచా కలబంద గుజ్జులో ఒక ఇ విటమిన్ క్యాప్సూల్‌లోని నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పలుచగా ముఖమంతా రాయాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తూ ఉంటే ముఖం మీద మొటిమలు, గుల్లలు రావు. ఈ చిట్కా పొడి చర్మం ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఒక చెంచా కలబంద గుజ్జులో రెండు చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరవాత మంచి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మీద ఉండే జిడ్డు, మురికి తొలగిపోయి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ చిట్కా జిడ్డు చర్మం ఉన్నవారికి బాగా పనిచేస్తుంది.
Updated Date - Jan 19 , 2025 | 02:49 AM