నేడు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం
ABN, Publish Date - Jan 10 , 2024 | 11:16 PM
జడ్పీ సర్వసభ్య సమావేశం గురువారం మద్గుల్ చిట్టంపల్లిలోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో జానకిరెడ్డి తెలిపారు.
హాజరు కానున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్,
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు
వికారాబాద్ , జనవరి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జడ్పీ సర్వసభ్య సమావేశం గురువారం మద్గుల్ చిట్టంపల్లిలోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో జానకిరెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే ఈ సమావేశానికి శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు పరిగి, తాండూరు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన టి.రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలు శాసనసభ్యుల హోదాలో తొలిసారిగా జడ్పీ సమావేశానికి హాజరవుతున్నారు. తొలిసారిగా జడ్పీ సమావేశానికి హాజరవుతున్న శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలను జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో సన్మానించనున్నారు.
కొన్ని అంశాలపైనే చర్చ...
జడ్పీ సర్వసభ్య సమావేశం ఎజెండాలో పొందుపరిచే 40 అంశాలపై చర్చ కొనసాగడం లేదు. కొన్ని అంశాలపైనే చర్చ కొనసాగించి మిగతా అంశాలను మమ అనిపించేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 10, 15 అంశాలపై చర్చ కొనసాగించి ఆ తరువాత ముగించి వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎజెండాలో పొందుపరిచిన అన్ని అంశాలపైన చర్చ కొనసాగుతుందా, లేక ఎప్పటి మాదిరిగానే కొన్నింటిపై చర్చ కొనసాగించి మమ అనిపించేస్తారా అనేది వేచిచూడాలి.
Updated Date - Jan 10 , 2024 | 11:17 PM