‘పాలమూరు-రంగారెడ్డి’ జాతీయ హోదాకు కృషి
ABN, Publish Date - Jan 29 , 2024 | 02:58 AM
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు.
ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి
తెలంగాణభవన్‌లో పదవీ బాధ్యతల స్వీకరణ
కేసీఆర్ దోపిడీలో మోదీకి భాగం: యాష్కీ
కులగణనతోనే బీసీల సమగ్రాభివృద్ధి: వీహెచ్
న్యూఢిల్లీ/బర్కత్‌పుర/హైదరాబాద్/తార్నాక, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, అనిరుధ్ రెడ్డి, వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో నాలుగేళ్లు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం తనకుందన్నారు. కేంద్రంలోని మంత్రులు, అధికారులతో మాట్లాడి తెలంగాణకుసంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పా రు. తనను ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి బరిలో దిగుతానని, ఎంపీగా గెలిచిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రెండు బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. మధు యాష్కీ మాట్లాడుతూ.. తెలంగాణలో దోచుకుని దాచుకున్న దాంట్లో నుంచి కోట్లాది రూపాయలను మాజీ సీఎం కేసీఆర్ బీజేపీకి కప్పం కింద చెల్లించారని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో కవితను మోదీ ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం.. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య బంధాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ ఫాంహౌ్‌సపై త్వరలో దాడి చేసి వందల కోట్ల అవినీతి సొమ్మును బయటకు కక్కిస్తామని చెప్పారు. కాగా, గాంధీభవన్‌లో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణను అభాసుపాలు చేశారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు బయటపడి 3 నెలలు దాటినా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోకుండా దాటవేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓయూ పూర్వ విద్యార్థి అయిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పేరుతో వర్సిటీలో పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ నిర్ణయం చరిత్రాత్మకం: వీహెచ్
రాష్ట్రంలో కులగణనతో బీసీల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. సేవారంగంలో మున్నూరు కాపులు ముందున్నారని, రాజకీయ రంగంలోనూ వారు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని కాచిగూడ మున్నూరుకాపు భవన్‌లో మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు ఆధ్వర్యంలో విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షి్‌పలను పంపిణీ చేసిన అనంతరం వీహెచ్ మాట్లాడారు.
Updated Date - Jan 29 , 2024 | 02:58 AM