కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
ABN, Publish Date - Nov 25 , 2024 | 01:16 AM
వచ్చే మార్చిలోగా జరుగనున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేస్తున్నది. ఇప్పటికే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది... అన్న విషయంలో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంతో సర్వే చేయించి నివేదిక తెప్పించుకున్నది.
- గాంధీభవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీపై చర్చ
- అభ్యర్థి ఎంపికపై అభిప్రాయాల సేకరణ
- పార్టీ అనుబంధం, సామాజిక, ఆర్థిక, ప్రజాసంబంధాలపై ఆరా
- గెలుపే లక్ష్యంగా కసరత్తు
- టీపీసీసీ అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల హాజరు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వచ్చే మార్చిలోగా జరుగనున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేస్తున్నది. ఇప్పటికే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది... అన్న విషయంలో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంతో సర్వే చేయించి నివేదిక తెప్పించుకున్నది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీలోని సీనియర్ నాయకులతో అభ్యర్థి ఎంపిక విషయమై చర్చించాలని భావించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన సోమవారం గాంధీభవన్‌లో ఈ సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఆయా నేతలను హాజరు కావాలని సమాచారం అందించినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం మార్చిలోగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఓటరు లిస్టు రూపొందించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నమోదు ప్రక్రియను చేపట్టి ముసాయిదా జాబితాను సిద్ధం చేసింది.
ఫ కొనసాగుతున్న ఓటర్ల నమోదు
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 271 మండలాల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదును చేపట్టి వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించింది. ఈ నియోజకవర్గ పరిధిలో 3,58,579 దరఖాస్తులు రాగా సుమారు 41వేల దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురికాగా సుమారు 3.16 లక్షల దరఖాస్తులను ఆమోదించి వారిని ఓటర్లుగా అంగీకరించినట్లు సమాచారం. ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా మళ్లీ ఈనెల 23 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రెండో విడత ఓటర్ల నమోదును చేపట్టింది. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో ఎక్కువ ఓట్లు నమోదైనట్లు తెలిసింది. ఆమోదం పొందిన 3.16 లక్షల ఓట్లలో సుమారు 1.45 లక్షల ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఉన్నాయని తెలుస్తున్నది. ఈ ఓటర్ల నమోదు అంశాన్ని అభ్యర్థుల ఎంపికలో పరిగణలోకి తీసుకొని చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఫ ఆశావహుల్లో కరీంనగర్ వారే అధికం
కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నవారిలోనూ కరీంనగర్‌కు చెందినవారే అధికంగా ఉన్నారు. జిల్లా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీగా పోటీచేయడానికి ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రసన్న హరికృష్ణ, ఇటీవల కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్‌రావు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ మెదక్ జిల్లాకు చెందిన ఆర్ సత్యనారాయణ, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆశిస్తున్నారు. వీరిలో నరేందర్‌రెడ్డి, ప్రసన్న హరికృష్ణ సభ్యత్వ నమోదు విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించారు. ప్రస్తుతం ఈ అభ్యర్థుల విషయంలోనే కాకుండా ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఉన్నారా... అభ్యర్థిత్వం ఆశిస్తున్నవారి సామాజికవర్గం, ఆర్థిక స్థితిగతులు, ప్రజలతో వారికున్న సంబంధం, ప్రజల్లో వారిపై ఉన్న సానుకూల, వ్యతిరేక అంశాలను గాంధీభవన్‌లో జరిగే సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. మెజార్టీ ఓట్లు ఉమ్మడి జిల్లాలో నమోదు కావడంతో ఆ జిల్లా నుంచే అభ్యర్థిని నిలపాలా.. లేక అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలపాలా అనే విషయంపై చర్చ జరిగే అవకాశముంది. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి పక్షాన నేతలంతా ప్రచారం చేయడంతోపాటు డిసెంబరు 9వరకు ఇంకా పట్టభద్రుల ఓట్లను నమోదు చేయించడం ద్వారా బలాన్ని పెంచుకోవాలనే అంశంకూడా చర్చలో తెరపైకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
ఫ పట్టును నిలబెట్టుకోవాలని..
పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చేసిన సర్వేలో వెల్లడైన అన్ని అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తూ ఆచీతూచి అడుగులు వేస్తున్నది. తిరిగి జీవన్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాన్ని కూడా తోసి పుచ్చలేమని పార్టీకి చెందిన నేతలు అంటున్నారు. జీవన్‌రెడ్డి ఇప్పటికే నరేందర్‌రెడ్డికి ఆశీస్సులు అందించి ముందుకు సాగమని చెప్పడంతోనే ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించారని అంటున్నారు. గెలుపునే ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎలాంటి ఊహించని నిర్ణయమైనా జరుగవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో గాంధీభవన్‌లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగే సమావేశం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
Updated Date - Nov 25 , 2024 | 01:16 AM