లగచర్ల ఘటన వెనక ఉన్నదెవరు..?
ABN, Publish Date - Dec 04 , 2024 | 05:08 AM
లగచర్ల ఘటనకు ప్రధాన సూత్రధారులు ఎవరనే విషయమై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. లగచర్ల కేసులో ఏ-2
ఏ-2 సురేశ్‌రాజ్‌ను విచారించిన పోలీసులు
వికారాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లగచర్ల ఘటనకు ప్రధాన సూత్రధారులు ఎవరనే విషయమై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. లగచర్ల కేసులో ఏ-2 నిందితుడు సురేశ్‌రాజ్‌ను కొడంగల్ కోర్టు కస్టడీకి అనుమతించగా, మంగళవారం ఉదయం పోలీసులు అతడిని సంగారెడ్డి జైలు నుంచి వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకువచ్చారు. లగచర్ల ఘటనపై విచారణాధికారిగా కొనసాగుతున్న తాండూరు డీఎస్పీ.. సురేశ్‌రాజ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ సమక్షంలో ఎస్పీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఈ విచారణ జరిగినట్లు సమాచారం. అధికారులను ఉద్దేశపూర్వకంగా లగచర్లకు రప్పించి వారిపై దాడులు చేసే విధంగా ముందే ప్లాన్ వేసుకున్నారా..? ఎవరి అండదండలతో దాడులకు పాల్పడ్డారు..? అంటూ పోలీసు అధికారులు సురేశ్‌రాజ్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డి పాత్రపై ఆరా తీసినట్లు సమాచారం. లగచర్ల ఘటనకు ముందు, తర్వాత సురేశ్‌రాజ్ ఎవరెవరితో మాట్లాడాడు..? 11న అధికారులపై దాడి జరిగితే 19 వరకు ఆచూకీ దొరక్కుండా ఎక్కడ ఉన్నాడు..? ఎవరు ఆశ్రయం ఇచ్చారు..? తదితర విషయాలపై ఆరా తీసినట్లు సమాచారం. కాగా, పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు సురేశ్‌రాజ్ కాదు.. లేదు.. అంటూ ముక్తసరిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది.
Updated Date - Dec 04 , 2024 | 05:08 AM