నీటి పారుదల శాఖలో కట్టప్పలు!
ABN, First Publish Date - 2024-02-06T04:55:27+05:30
నీటిపారుదల శాఖలో కట్టప్పలు ఉన్నారని ప్రభుత్వం భావిస్తోందా!? ఒకవైపు ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాలకు హాజరుకావడమే కాకుండా వాటిలో చర్చించే ప్రతి అంశాన్ని, ప్రతి పరిణామాన్ని ఎప్పటికప్పుడు పొల్లుపోకుండా విపక్షానికి అందిస్తున్నారని అనుమానిస్తోందా!? కృష్ణా నదిపై
ప్రభుత్వ సమావేశాలకు హాజరవుతూ విపక్షాలకు కీలక పత్రాలు
కృష్ణా ప్రాజెక్టులు చేజారిపోయాయనే ప్రచారంలోనూ కీలక పాత్ర
మేడిగడ్డలో సమావేశం నుంచీ మంత్రులకు తప్పుడు సమాచారం
కృష్ణా బోర్డు భేటీలో ప్రేక్షక పాత్ర.. బయటకు వచ్చి దుష్ప్రచారం
మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిన తేదీ, అంచనా వ్యయంపైనా ఇదే తీరు
రాష్ట్రం వచ్చాక అన్ని నిర్ణయాల్లో వీరే సూత్రధారులు, పాత్రధారులు
ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ సర్కారు మల్లగుల్లాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖలో కట్టప్పలు ఉన్నారని ప్రభుత్వం భావిస్తోందా!? ఒకవైపు ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాలకు హాజరుకావడమే కాకుండా వాటిలో చర్చించే ప్రతి అంశాన్ని, ప్రతి పరిణామాన్ని ఎప్పటికప్పుడు పొల్లుపోకుండా విపక్షానికి అందిస్తున్నారని అనుమానిస్తోందా!? కృష్ణా నదిపై ప్రాజెక్టులు చేజారిపోయాయని ప్రచారం చేయడంలో వీరే కీలక పాత్ర పోషించారని సందేహిస్తోందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి నీటిపారుదల శాఖలోని ఉన్నత స్థాయి వర్గాలు! మేడిగడ్డ వద్ద జరిగిన సమావేశంలో మంత్రులకు తప్పుడు లెక్కలు సమర్పించడం నుంచి కృష్ణా బోర్డు సమావేశాల తర్వాత దుష్ప్రచారం చేయడం వరకూ వీరే కీలక పాత్ర పోషించినట్లు సర్కారు అనుమానిస్తోంది. సదరు సమాచారాన్ని విపక్షానికి చేరవేస్తూ.. గత పదేళ్లుగా పొందిన అధికార హంగులకు మొక్కులు తీర్చుకుంటున్నారని సర్కారు భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలను వివరించాయి. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 17న సమావేశం ఉంటుందని అధికారులకు సమాచారం వచ్చింది. ఆ సమావేశం కంటే ముందే కొన్ని చర్యలు తీసుకోవాలని సర్కారు భావించింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణకు ఏవిధంగా అన్యాయం జరుగుతుంది!? 811 టీఎంసీల కృష్ణా జలాలను పంచడానికి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్రం విడుదల చేసిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్) ఏమిటి!? తదితర వివరాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను రూపొందించి, దాన్ని కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించాల్సి ఉండగా.. సదరు అధికారులు ఆ పని చేయలేదు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించలేమని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తేల్చి చెప్పినా ఆ సమాచారాన్ని కూడా పంచుకోలేదు. సమావేశంలో అసాంతం తాపీగా కూర్చున్నారు. సరికదా.. ఆ తర్వాత ప్రాజెక్టులు చేజారిపోయాయనే ప్రచారం చేయడంలో వారు కీలక పాత్ర పోషించారని ఉన్నతాధికారులు తాజాగా గుర్తించారు. అంతేనా, సమావేశం జరిగిన మర్నాడే కీలక సమాచారమంతా విపక్ష పార్టీకి చేరవేయడంలో ప్రధానంగా కొందరు అధికారులు కీలక పాత్రను పోషించారని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. సోమవారం వరకూ బయటపడిన పలు రికార్డులనూ విపక్ష నేతలకు అందించారని అంచనాకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో జరిగిన పలు కీలక సమావేశాల సారాంశాన్ని.. అందులోనూ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని దెబ్బతీసే సమాచారాన్ని ఎంచుకొని వీరు చేరవేశారని నిర్ధారణకు వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో మంత్రులనూ తప్పుదోవ పట్టించిందని భావిస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిన తేదీ, నిర్మాణ అంచనా వ్యయం తదితరాల విషయంలో తారుమారు చేసినట్లు అంచనాకు వచ్చింది. ఒక డాక్యుమెంట్‌లో 2019 సెప్టెంబరు 10న; మరో డాక్యుమెంట్‌లో 2020 ఫిబ్రవరి 29న; ఇంకో డాక్యుమెంట్‌లో 2021 మార్చి 15వ తేదీన పూర్తయినట్లు రికార్డుల్లో పేర్కొన్నారని, తద్వారా నిర్మాణ సంస్థకు అనుకూలంగా వ్యవహరించారని నిర్ధారణకు వచ్చింది. అంతేనా.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్ డి సెంబరు 29న మేడిగడ్డ వద్ద సమీక్షించిన విషయం తెలిసిందే. అంబట్‌పల్లి గ్రామంలో అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చారు. అందులో మేడిగడ్డ నిర్మాణ వ్యయం రూ.3,625.82 కోట్లు మాత్రమేనని చెప్పారు. నిజానికి, మేడిగడ్డ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడు అంచనా వ్యయం రూ.2,591 కోట్లు మాత్రమే. ఆ తర్వాత మూడుసార్లు అంచనాలను సవరించారు. 2018 మేలో రూ.675 కోట్లను పెంచారు. తర్వాత 2020 ఫిబ్రవరి, నవంబరుల్లో అంచనాలను సవరించాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వెరసి, 2021 సెప్టెంబరు ఆరో తేదీనాటికి అంచనా వ్యయాన్ని రూ.4,613 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, గత ఏడాది డిసెంబరులో మంత్రులకు ఇచ్చిన పీపీటీలో అంచనా వ్యయం రూ.3,625.82 కోట్లు మాత్రమేనని అధికారులు చెప్పారని సర్కారు గుర్తించింది.
అన్ని పరిణామాల్లోనూ వీరే..
తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి అన్ని సందర్భాల్లోనూ సదరు అధికారులే కీలక పాత్ర పోషించారని సర్కారు నిర్ధారణకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపిణీకి సంబంధించి 2015లో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. 811 టీఎంసీల కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాలు పంచుకునేందుకు నిర్వహించిన ఆ సమావేశానికి వీరు హాజరయ్యారు. ఏపీ 63 శాతం, తెలంగాణ 37 శాతం నీటిని పంచుకోవడానికి ఆ ఒక్క ఏడాది కోసమే ఒప్పందం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొని ఒప్పందానికి జైకొట్టిన అధికారులే కట్టప్పలని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి, 2015 వాటర్ ఇయర్ ఒక్క దానికే తెలంగాణకు 37 శాతం నీళ్లు పంచాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, 2017 వరకూ ఈ నిర్ణయమే అమలైంది. అంతేనా.. ఏటా కృష్ణా జలాలను తెలంగాణ 30 శాతానికి కన్నా ఎక్కువ వినియోగించుకోవడం లేదంటూ 2018లో ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మంగా కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. దాంతో, తెలంగాణ వాటాను 37 శాతం నుంచి 34 శాతానికి కుదించుకుంటూ ప్రస్తుత అధికారులే అప్పట్లో అంగీకారం తెలిపారని సర్కారు గుర్తించింది. చివరికి, 2022-23 వాటర్ ఇయర్‌లో 50:50 శాతం నీటిని పంపిణీ చేయాలని పట్టుబట్టి, చివర్లో వర్కింగ్ ఆరేంజ్‌మెంట్ కింద కృష్ణా బోర్డే తుది నిర్ణయం తీసుకునే అధికారం అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని, ఈ నిర్ణయంలో ప్రస్తుతం కట్టప్పలుగా మారిన అధికారులే సూత్రధారులని నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో, సదరు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సర్కారు మల్లగుల్లాలు పడుతోందని తెలుస్తోంది.
Updated Date - 2024-02-06T04:55:28+05:30 IST