జాడలేని హెల్త్‌కిట్లు
ABN, Publish Date - Jan 24 , 2024 | 11:15 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద, మధ్య తరగతి విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేందుకు వారి ఆరోగ్యానికి భరోసాను కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అందించే హెల్త్‌కిట్లు జాడలేకుండా పోయాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 ఆగస్టులో మొదటి విడత, ఆ తర్వాత ఏడాది వరకు నాలుగు విడతలుగా పంపిణీ చేశారు. ఏటా నాలుగు విడతలుగా హెల్త్‌కిట్లను అందిస్తామని తొలుత అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
విద్యార్థినుల ఎదురుచూపులు
ఐదేళ్ల క్రితం పంపిణీ
ఏటా నాలుగు విడతలు అందిస్తామని ప్రకటన
రెండేళ్లపాటు ఇచ్చారు.. తర్వాత మరిచారు
కొత్త సర్కారుపై బాలికల ఆశలు
కేసముద్రం, జనవరి 24 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద, మధ్య తరగతి విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేందుకు వారి ఆరోగ్యానికి భరోసాను కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అందించే హెల్త్‌కిట్లు జాడలేకుండా పోయాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 ఆగస్టులో మొదటి విడత, ఆ తర్వాత ఏడాది వరకు నాలుగు విడతలుగా పంపిణీ చేశారు. ఏటా నాలుగు విడతలుగా హెల్త్‌కిట్లను అందిస్తామని తొలుత అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు విడతలే పంపిణీ చేసి, ఐదేళ్లుగా ఒక్కసారి కూడా హెల్త్‌కిట్లను ఇవ్వలేదు. దీంతో హెల్త్‌కిట్ల కోసం జిల్లాలోని పేద, మధ్య తరగతి వర్గాల బాలికలు ఎంతోఆశగా ఎదురుచూస్తున్నారు.
జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్‌స్కూళ్లు, బాలికల వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదివే 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల బాలికలకు హెల్త్ అండ్ హైజిన్ కిట్ల పంపిణీకి 2018 ఆగస్టులో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.1600 విలువ చేసే బ్రాండెడ్ కంపెనీలకు చెందిన 13 రకాల వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లను బాలి కలకు 2018, ఆగస్టులో అందజేశారు. ఏడాదిలో ప్రతీ మూడు నెలలకొకసారి చొప్పున నాలుగు విడతలుగా కిట్లను అందిస్తామని అప్పటి ప్రభు త్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం అందించాల్సిన హెల్త్‌కిట్లు ఐదేళ్ల అవుతున్నా ఏడాదికి ఒక్కసారి కూడా సరఫరా కాకపో వడంతో బాలికలు నిరాశకు గురవుతున్నారు. అప్పట్లో రెండుసార్లు ఇచ్చిన హెల్త్‌కిట్లలోని వస్తువులన్నీ విద్యార్థినులకు ఎంతో అవసరమైనవి కావడంతో బాగా వినియోగించుకున్నారు. ప్రస్తుత అవసరాలకు హెల్త్‌కిట్లలోని వస్తువులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థినులు సదరు వస్తువులను కొనుగోలు చేసే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు.
బాలికల ఆరోగ్యమే లక్ష్యంగా..
రాష్ట్ర ప్రభుత్వం బాలికల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, బాలిక విద్యను బలోపేతం చేస్తూ వారి ఆరోగ్యమే లక్ష్యంగా ఈ హెల్త్‌అండ్‌హైజిన్ కిట్ల పంపిణీని కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాల స్థాయిలోనే బాలికలకు రుతుస్రావ ప్రక్రియలో పరిశుభ్రత పాటిస్తూ.. వారి అవసరాలకు తగిన విధంగా కిట్‌ను రూపొందించారు. దీనివల్ల వారు భవిష్యత్తులో ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులబారిన పడకుండా జాగ్రతలు పడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం 13 రకాల వస్తువులతో కిట్‌ను రూపొందించారు. ఇందులో పతంజలి కంపెనీకి చెందిన మూడు స్నానపు సబ్బులు, మూడు బట్టల సబ్బులు, డాబర్ వాటిక షాంపూ, హేయిర్ ఆయిల్, డాజిలర్ పౌడర్, బబుల్ టూత్‌పేస్ట్‌లు రెండు, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, బొట్టు బిళ్లల ప్యాకెట్ ఒకటి, రిబ్బన్, దువ్వెన, రబ్బర్ బ్యాండ్లు రెండు, విస్పర్ కంపెనీకి చెందిన సానిటరీ నాప్‌కిన్లు ఆరు ప్యాకెట్లు ఇచ్చారు.
జిల్లాలో 10,947 మంది విద్యార్థినులు..
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 790 పాఠశాలల్లో హెల్త్‌కిట్లు పొందేందుకు అర్హులుగా 10,947 మంది 7 నుంచి 10వ తరగతి చదివే బాలికలు ఉన్నారు. 2018లో మొదటి విడతలో 16 మండలాల్లో 14,219 మంది బాలికలకు హెల్త్‌కిట్లను అందజేశారు. ఇందులో జడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే 8,814 మంది బాలికలు, మోడల్ స్కూళ్లలో 2,674 మంది, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలల్లో 2683మంది, ఎయిడెడ్ పాఠశాలలో 48 మంది వెరసి 14,219 మంది బాలికలకు కిట్లు అందించారు.
మండలాల వారీగా..
మండలాల వారీగా కొత్తగూడ మండలంలో 365 మంది బాలికలకు, గంగారంలో 76, బయ్యారంలో 557, గార్లలో 702, డోర్నకల్‌లో 1,173, కురవిలో 1,313, మహబూబాబాద్‌లో 1,908, గూడూరులో 672, కేసముద్రంలో 1,404, నెల్లికు దురులో 1,310, నర్సింహులపేటలో 658, చిన్నగూడూరులో 251, మరిపెడలో 1,403, దంతాలపల్లిలో 562, తొర్రూరులో 1,377, పెద్దవంగర మండలంలో 488 మంది బాలికలకు అందించారు. జిల్లాలో 2018, 2019 సంవత్సరాల్లో నాలుగు విడతల్లో 56,283 హెల్త్‌కిట్లను పంపిణీ చేశారు. 2019 నుంచి హెల్త్‌కిట్ల పంపిణీని అప్పటి ప్రభుత్వం ఐదేళ్లపాటు విస్మరిం చింది. తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి వెంటనే హెల్త్‌కిట్లను అందించాలని బాలికలు కోరుతున్నారు.
Updated Date - Jan 24 , 2024 | 11:15 PM