వడ్ల కొనుగోళ్లకు సిద్ధం!
ABN, Publish Date - Mar 19 , 2024 | 11:38 PM
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా వరి కోతల సమయం దగ్గరపడుతుండడంతో ధాన్యం సేకరణకు సంబంధించిన యాక్షన్‌ను సిద్ధం చేసుకున్నారు. గత యాసంగి సీజన్‌లో మాదిరిగానే ఈ సీజన్‌లోనూ జిల్లావ్యాప్తంగా 190 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు కసరత్తు పూర్తి
190 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం
2.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
ఉగాది తర్వాత ప్రారంభానికి చర్యలు
జనగామ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా వరి కోతల సమయం దగ్గరపడుతుండడంతో ధాన్యం సేకరణకు సంబంధించిన యాక్షన్‌ను సిద్ధం చేసుకున్నారు. గత యాసంగి సీజన్‌లో మాదిరిగానే ఈ సీజన్‌లోనూ జిల్లావ్యాప్తంగా 190 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధాన్యం సేకరణ, రవాణా, బిల్లుల చెల్లింపు వంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో కత్తెర పంట కోతకు రాగా యాసంగి పంట మరో 15-20 రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 15-20 రోజుల్లో కోతలు ప్రారంభం కానుండగా కొన్ని చోట్ల నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉగాది తర్వాత ఏప్రిల్ రెండో వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా.. జిల్లావ్యాప్తంగా ధాన్యం దిగుబడి అంచనా, కేంద్రాల ఏర్పాటు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్, డ్రయ్యర్లు, టార్పాలిన్ కవర్లు ఎంత మేర అవసరమవుతాయనే అంచనాకు వచ్చి సిద్ధంగా ఉంచుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎలాంటి హడావిడి లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
జిల్లావ్యాప్తంగా 190 కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఐకేపీ పరిధిలో 100, పీఏసీఎస్ పరిధిలో 90 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా గ్రామాల వారీగా ఏర్పాటు చేయాల్సిన కేంద్రాలపై గ్రామీణాభివృద్ధి, సహకార శాఖలు దృష్టి సారించాయి. కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహించనుండగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు.
2.10 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సెంటర్లకు వస్తుందని అధికారులు అంచనా వేసుకున్నారు. గత ఏడాది యాసంగి సీజన్‌లో 1.74 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు భావించారు. కానీ.. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా దాదాపు 30 శాతం వరి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. వరి పంట పొట్ట దశకు వచ్చిన, కొన్ని చోట్ల కోత దశకు వచ్చిన సమయంలోనే బలమైన ఈదురుగాలులు, వడగళ్ల ప్రభావంతో వడ్లన్నీ రాలిపోయాయి. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా కేవలం 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కాగా.. ఈ ఏడాది అంతే మొత్తంగా సాగు చేయగా 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రకృతి సహకరిస్తే అధికారుల అంచనాకు తగ్గట్టుకు ధాన్యం దిగుబడి రానుంది. కాగా.. ఇందుకు సంబంధించి గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లను సమకూర్చుకోనున్నారు. జిల్లావ్యాప్తంగా 52.50 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా ప్రస్తుతం 30.30 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 3800 టార్పాలిన్లు అవసరం కాగా అందుకు రెట్టింపు సంఖ్యలో 6174 టార్పాలిన్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. జిల్లాలో ఉగాది తర్వాత ఏప్రిల్ రెండో వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభిస్తాం..
- రోహిత్‌సింగ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబం ధించిన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశాం. జిల్లాలో మరో 15-20 రోజుల్లో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఏప్రిల్ రెండో వారంలో సెంటర్లను ప్రారంభించాలని భావిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో 190 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించాం. మరో వారం, పది రోజుల్లో కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇస్తాం. ధాన్యం కొనుగోలు, రవాణా, బిల్లుల చెల్లింపు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటాం.
Updated Date - Mar 19 , 2024 | 11:38 PM