కాళేశ్వరంపై మళ్లీ విజిలెన్స్ విచారణ
ABN, Publish Date - Jan 18 , 2024 | 05:14 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మరోసారి విచారణ ప్రారంభించారు.
మేడిగడ్డకు 20 మంది అధికారులు
డీజీ రాజీవ్ రతన్ నేతృత్వంలో తనిఖీలు
మహదేవపూర్ రూరల్, జనవరి 17: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మరోసారి విచారణ ప్రారంభించారు. డీజీ రాజీవ్ రతన్ నేతృత్వంలో 20 మంది అధికారుల బృందం బుఽధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్ చేరుకున్న డీజీ, ఇతర అఽధికారులు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు అంశాలను సమీక్షించిన అనంతరం మేడిగడ్డ బ్యారేజీ వంతెన దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకున్నారు. వంతెన కుంగుపాటుపై అక్కడున్న ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత బ్యారేజీ వంతెనపై నుంచే కుంగుబాటుకు గురైన పిల్లర్లను పరిశీలించారు. బ్యారేజీలో నీటి నిల్వలు లేకపోవడంతో మహారాష్ట్ర వైపు నుంచి గోదావరి నదిలోకి వెళ్లారు. దెబ్బతిన్న 20వ పిల్లరును విజిలెన్స్ అధికారులు స్వయంగా పరిశీలించినట్టు తెలిసింది. బ్యారేజీ పరిశీలన అనంతరం మేడిగడ్డ బ్యారేజీ కంట్రోల్ కార్యాలయంలో అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు 10 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం తిరిగి కాళేశ్వరం హరితహోటల్‌కు తిరిగి వెళ్లిపోయారు. రాత్రి మరోమారు ఇరిగేషన్ అధికారులతో సమీక్షించినట్టు తెలిసింది. ఈ సమీక్షలకు మీడియాతోపాటు స్థానిక పోలీసులను సైతం దూరంగా ఉంచారు.
వారం రోజుల్లోనే..
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎస్పీ రమేష్ నేతృత్వంలో ఈనెల 9న మేడిగడ్డను సందర్శించారు. మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించి కీలక ఫైళ్లు, హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజులు కూడా గడవక ముందే మరోమారు డీజీ స్థాయి అధికారితో విచారణ ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం కేంద్రంగా ఈ బృందం మరో రెండు రోజులపాటు విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది.
Updated Date - Jan 18 , 2024 | 10:59 AM