రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఇద్దరు జడ్జిలు
ABN, Publish Date - Mar 19 , 2024 | 04:07 AM
ఇతర రాష్ట్రాల హైకోర్టుల నుంచి తెలంగాణ హైకోర్టుకు నూతనంగా ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ సుజయ్ పాల్, కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ మౌషుమి భట్టాచార్య బదిలీలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్
మధ్యప్రదేశ్, కలకత్తా నుంచి బదిలీ..
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల హైకోర్టుల నుంచి తెలంగాణ హైకోర్టుకు నూతనంగా ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ సుజయ్ పాల్, కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ మౌషుమి భట్టాచార్య బదిలీలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణ హైకోర్టుకు వీరిని బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 14న కేంద్రానికి సిఫార్సు చేసింది. వ్యక్తిగత కారణాలతో తనను బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ మౌషుమి భట్టాచార్య సుప్రీంకోర్టు కొలీజియంకు లేఖ రాశారు. తన కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నందున తనను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని అక్కడి హైకోర్టు జడ్జి జస్టిస్ సుజయ్ పాల్ కూడా లేఖ రాశారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం వారిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ ఇద్దరు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టులో మొత్తం జడ్జిల సాంక్షన్డ్ స్ర్టెంత్ 42 కాగా ప్రస్తుతం 26 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిద్దరి రాకతో ఈ సంఖ్య 28కి చేరనుంది.
Updated Date - Mar 19 , 2024 | 04:07 AM