state ranks fifth in HIV : హెచ్‌ఐవీలో ఐదో స్థానంలో రాష్ట్రం
ABN, Publish Date - Jan 09 , 2024 | 03:58 AM
దేశంలో లక్షకు పైగా హెచ్‌ఐవీ కేసులున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉంది. మన రాష్ట్రంలో 1.59 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో 1.59 లక్షల మందికి ఎయిడ్స్
మహారాష్ట్ర ఫస్ట్.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
దేశంలో 24.67 లక్షల మంది బాధితులు
గణాంకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో లక్షకు పైగా హెచ్‌ఐవీ కేసులున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉంది. మన రాష్ట్రంలో 1.59 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సంకల్క్ బుక్‌లెట్-2023 పేరుతో ఐదో ఎడిషన్ నివేదికను ఇటీవల నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(న్యాకో), కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా విడుదల చేశాయి. దేశంలో అత్యధిక ఎయిడ్స్ కేసులున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. అక్కడ 3.88 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులున్నారు. ఇక 3.22 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక (2.74 లక్షలు), తమిళనాడు(1.65 లక్షలు), తెలంగాణ (1.59 లక్షల మంది), గుజరాత్(లక్ష) ఉన్నట్లు వార్షిక నివేదిక వెల్లడించింది. దేశంలోని హెచ్‌ఐవీ కేసుల్లో 72 శాతం ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా 24.67 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక ఎయిడ్స్ కేసులున్న రెండో దేశంగా ఇండియా నిలిచిందని నివేదిక తెలిపింది.
ఈశాన్య రాష్ట్రాల్లో విజృంభణ..
ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్లు వెల్లడించింది. మరణాల రేటు కంటే కొత్త ఇన్ఫెక్షన్ల రేటు ఎక్కువగా ఉందని పేర్కొంది. మణిపూర్, మిజోరం, నాగాలాండ్‌లో ప్రతీ లక్ష మందిలో 900 మంది హైరిస్క్ గ్రూప్(మహిళా సెక్స్ వర్కర్లు, హిజ్రా/ట్రాన్స్ జెండర్లు, మేల్ హోమోలు, ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకునేవాళ్ల)లో ఉన్నట్లు తెలిపింది. హెచ్‌ఐవీ ఎక్కువగా మహిళా సెక్స్ వర్కర్లు, హిజ్రా/ట్రాన్స్ జెండర్లు, మేల్ హోమోలు, ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకునేవాళ్లలో కనిపిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. జైళ్లలోని ఖైదీల్లో కూడా హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ట్రక్ డ్రైవర్లు, వలసదారులు, హైరిస్క్ వర్గాల నుంచి సాధారణ ప్రజలకు హెచ్‌ఐవీ వ్యాపిస్తున్నట్లు పేర్కొంది.
వేశ్యల సంఖ్యలో రెండో స్థానంలో ఏపీ..
దేశవ్యాప్తంగా మహిళా సెక్స్ వర్కర్ల గణాంకాలను న్యాకో విడుదల చేసింది. 2022 సమాచారం ప్రకారం భారత్‌లో 9,95,499 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు. 1,53,337 మందితో కర్ణాటక తొలి స్థానంలో.. 1,19,367 మందితో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర (95,351), ఢిల్లీ (88,399), తెలంగాణ(75,381), తమిళనాడు (60,775), మధ్యప్రదేశ్(53,455), ఉత్తరప్రదేశ్ (40,480), అసోం(39,721), గుజరాత్(37,118) ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రతి లక్ష జనాభాకు 450 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యధికం. జాతీయ సగటు 73గా ఉంది. ఇక హైరిస్క్ గ్రూపులో ఉన్న డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య పంజాబ్‌లో ఎక్కువగా(45,098 మంది) ఉంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్(35,411), ఢిల్లీ(32481) ఉన్నాయి. దేశవ్యాప్తంగా హైరిస్క్ గ్రూప్‌లో 96,193 మంది హిజ్రాలు, 3,51,020 మంది స్వలింగ సంపర్కులు, 2,88,717 మంది మాదక ద్రవ్యాలు తీసుకునే వారు ఉన్నారు.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలో గర్భిణుల్లో హెచ్‌ఐవీ వ్యాప్తి అంచనా 0.18 శాతం, వేశ్యలలో 1.81 శాతం, స్వలింగ సంపర్కులలో 2.07, హిజ్రాలలో 4, మాదక ద్రవ్యాలు తీసుకునే వారిలో 0.40 శాతంగా ఉంది. మన రాష్ట్రంలో ప్రతి లక్షకు 250-325 మంది హైరిస్క్ జనాభా ఉన్నారు. అలాగే మహిళా సెక్స్ వర్కర్లలో 1.65 లక్షల మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా.. 206 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక ఏఆర్‌టీ కేంద్రాల్లో ఎయిడ్స్‌కు చికిత్స అందించే విషయంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది.
Updated Date - Jan 09 , 2024 | 03:58 AM