సర్పంచుల పనితీరు భేష్!
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:22 PM
ఐదేళ్ల పదవీ కాలంలో జిల్లాలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి మరువలేనిదని జడ్పీ చైర్‌పర్సన్‌పట్నం సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో సర్పంచుల పనితీరు బాగుందని, అభినందనీయమని ఆమె కొనియాడారు.
గ్రామాల అభివృద్ధిలో వారి కృషి అభినందనీయం
జిల్లా పరిషత్‌చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి
వికారాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఐదేళ్ల పదవీ కాలంలో జిల్లాలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి మరువలేనిదని జడ్పీ చైర్‌పర్సన్‌పట్నం సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో సర్పంచుల పనితీరు బాగుందని, అభినందనీయమని ఆమె కొనియాడారు. సర్పంచుల పదవీకాలం ముగియనున్న సందర్భంగా బాగా కష్టపడి పని చేసిన సర్పంచులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో చాలా మంది సర్పంచులు తమ గ్రామాల అభివృద్ధి కోసం తమ సొంత భూములు అమ్ముకున్నారని, మరి కొందరు అప్పులు చేసి పనులు చేశారని ఆమె గుర్తు చేశారు. అలాంటి సర్పంచులకు సంబంధిత ఇంజినీర్లు, పంచాయతీ అధికారులు ఎంబీ రికార్డులు చేసి ఇవ్వాలని అధికారులకు సూచించారు. సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసికు వెళ్లినట్లు ఆమె గుర్తుచేశారు. అయితే కొన్ని గ్రామాల సర్పంచులు మాత్రం అప్పటి ఎమ్మెల్యేల అండతో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. బషీరాబాద్ మండలం బాద్లాపూర్ సర్పంచ్ నీలిబాయి అభివృద్ధి చేసి అప్పుల పాలై అడ్డమీద కూలీగా పనిచేయడం తనను ఎంతగానో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఎలాగైతే సన్నానం చేస్తారో గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో మంది కష్టపడి పనిచేసిన సర్పంచులను కూడా తమ పదవీ కాలం పూర్తి చేసుకున్న సమయంలో ఆయా గ్రామాల ప్రజలు పౌర సన్మానాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఐదేళ్ల పాటు చిత్తశుద్ధితో పనిచేసిన సర్పంచుల సేవలను ప్రజలు కూడా ఎప్పటికీ గుర్తించుకోవాలని సోమవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఆమె కోరారు.
Updated Date - Jan 29 , 2024 | 11:22 PM