ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘రేషన్‌’ మాఫియా..

ABN, Publish Date - Dec 09 , 2024 | 01:19 AM

జిల్లాలో ‘రేషన్‌’ మాఫియా రెచ్చిపోతోంది. రేషన్‌ స్మగర్లపై ఉక్కుపాదం మోపుతామని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ హెచ్చరికలను సైతం ఖాతరు చేయడం లేదు. దీంతో పోలీసుల సహకారంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గోడౌన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం(ఫైల్‌)

- పీడీ యాక్టు హెచ్చరికలను ఖాతరు చేయని వైనం

- పట్టుబడితే డ్రైవర్లపైనే కేసులు నమోదు..

- ప్రతినెలా 2వేల టన్నులపైనే అక్రమ రవాణా

- అక్రమ దందాపై సివిల్‌ సప్లై కమిషనర్‌ సీరియస్‌

కోల్‌సిటీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘రేషన్‌’ మాఫియా రెచ్చిపోతోంది. రేషన్‌ స్మగర్లపై ఉక్కుపాదం మోపుతామని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ హెచ్చరికలను సైతం ఖాతరు చేయడం లేదు. దీంతో పోలీసుల సహకారంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు రేషన్‌ బియ్యం పట్టుబడినా డ్రైవర్లపై కేసులు నమోదు చేసి పంపడం సాధారణం అయ్యింది. రేషన్‌ స్మగ్లర్ల పేర్లు ఎక్కడా కూడా కనీసం ఎఫ్‌ఐఆర్‌లోకి రావడంలోకి రావడం లేదు. వారిపై కేసులు నమోదు కూడా చేసిన పరిస్థితి కూడా లేదు. దీంతో జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ దందా నిర్విరామంగా కొనసాగుతోంది.

జిల్లా నుంచి మహారాష్ట్రకు...

జిల్లాలో 416రేషన్‌ షాపులు ఉండగా ప్రతి నెల 3వేల నుంచి 3500టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుంది. ఇందులో సుమారు 2వేల నుంచి 2500టన్నులు స్మగ్లర్ల చేతుల్లోకి పోతోంది. మొదట రైస్‌ మిల్లులకు రీసైక్లింగ్‌కు రేషన్‌ బియ్యం అమ్మగా ఇప్పుడు లిక్కర్‌ ఫ్యాక్టరీలకు, కోళ్ల ఫారాలకు అమ్ముతున్నారు. జిల్లాలో ముఖ్యంగా ముగ్గురు స్మగ్లర్లు మంథని, పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తమిళనాడులోని లిక్కర్‌ పరిశ్రమలకు, కోళ్ల దానా పరిశ్రమలకు విక్రయాలు జరుపుతున్నారు. కొంత కాలంగా డీలర్ల ద్వారా కృష్ణపట్నం, కాకినాడ రేవులకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్మగర్లపై కేసులే లేవు...

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఇటు సివిల్‌ సప్లై, పోలీసులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. దీర్ఘకాలంగా సివిల్‌సప్లై విభాగం రేషన్‌ మాఫియాకు సహకరిస్తుందనేది బహిరంగ రహస్యం. పోలీసుల నుంచి కూడా అదే స్థాయిలో సహకారం అందుతున్నట్టు ఇంటలీజెన్స్‌ సైతం నివేదికలు ప్రభుత్వానికి పంపింది. సేకరణ మొదలు రాష్ట్ర సరిహద్దు దాటే వరకు ఉన్న ఠాణాలతో స్మగ్లర్లకు సత్సంబంధాలు ఉన్నట్టు పోలీస్‌ శాఖలోనే చర్చ జరుగుతోంది. ఠాణాల నెలవారీ మామూళ్లలో రేషన్‌ దందాలు కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ఎక్కడ రేషన్‌ బియ్యం పట్టుకున్నా వాహనాల డ్రైవర్లపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. ట్రక్కులు, వ్యాన్‌లతో టన్నుల కొద్ది బియ్యం దొరుకుతున్నా రేషన్‌ బియ్యం దందా చేసే వారి పేర్లు మాత్రం పోలీస్‌ రికార్డులకు ఎక్కడం లేదు. దందాకు పాల్పడే వారు వాహనాలను కూడా దళిత బంధు లబ్దిదారుల నుంచి తీసుకున్నవి, తమ వద్ద పని చేసే సిబ్బంది పేర తీసుకున్నవి మాత్రమే వినియోగిస్తున్నారు.

పగలే రావాణా...

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రేషన్‌ కింగ్‌పిన్‌గా పేరున్న ఒక స్ర్కాప్‌ దందా నిర్వాహకుడు పగలే దర్జాగా రవాణా చేస్తున్నట్టు పోలీస్‌ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇటీవల సివిల్‌ సప్లై స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహించగా పగటిపూటే సంబంధిత స్మగ్లర్ల వాహనాలు పట్టుబడ్డాయి. ఇది రామగుండం స్పెషల్‌ అంటూ సివిల్‌ సప్లై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పేర్కొంటున్న పరిస్థితి. స్మగ్లర్లకు సంబంధించిన వాహనాలు గోడౌన్ల నుంచి బయలుదేరి రాష్ట్ర సరిహద్దులు దాటే వరకు తనిఖీలు ఉండవనే ప్రచారం ఉంది. ఒక స్మగ్లర్‌కు చెందిన వాహనాన్ని మంచిర్యాల జిల్లాలో పట్టుకుంటే స్మగ్లర్ల ఒత్తిడితో డ్రైవర్లు వాహనాలకు సంబంధించిన పేపర్లు చూపించలేదనే పెనాల్టీ వేసి పంపినట్టు తెలుస్తోంది.

సివిల్‌ సప్లై కమిషనర్‌ సీరియస్‌

ఆంధ్రా, తెలంగాణల నుంచి రేషన్‌ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా అవుతోందనే సమాచారం మేరకు సివిల్‌ సప్లై విభాగం అప్రమత్తమైంది. ఇటీవల మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించిన కమిషనర్‌, అదనపు డీజీపీ డీహెచ్‌ చౌహాన్‌ అక్రమ దందా వ్యవహారాలపై సీరియస్‌ అయినట్టు సమచారం. శాఖల సహకారం లేకుండా బియ్యం తరలింపు సాధ్యం కాదని, దందా ఆగాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలో సివిల్‌ సప్లై అధికారులు, పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వారం రోజులుగా తనిఖీలు జరుపుతున్నారు. గోదావరిఖని పట్టణంలో సివిల్‌ సప్లై 5 టన్నుల బియ్యం పట్టుకోగా గోదావరి వంతెన వద్ద కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రెండున్నర టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసుల్లో కూడా స్మగ్లర్ల పేర్లు లేవు. సాధారణంగా 1వ తేది నుంచి 10తేది వరకే వెయ్యి నుంచి 1500టన్నుల బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది.

హెచ్చరికలు మామూలే...

రేషన్‌ అక్రమ రవాణా దారులపై పీడీ యాక్టులు పెడతామని కమిషనరేట్‌ నుంచి వస్తున్న హెచ్చరికలు మామూలయ్యాయి. జాబితా సిద్ధం చేస్తున్నామని చెబుతున్నా అసలు ఠాణాల్లో స్మగ్లర్లపై కేసులే లేవని పోలీస్‌ వర్గాలే పేర్కొంటున్నాయు. దీంతో పోలీసుల హెచ్చరికలు సాంప్రదాయంగానే మారాయి. గతంలో రామగుండం కమిషనరేట్‌లో నలుగురు రేషన్‌ స్మగ్లర్లపై పీడీ యాక్టులు నమోదు అయ్యాయి. ఇప్పుడు కేసులు నమోదయ్యే పరిస్థితే లేదు.

Updated Date - Dec 09 , 2024 | 01:20 AM