రహదారుణం
ABN, Publish Date - Nov 22 , 2024 | 11:14 PM
కేశంపేట - షాద్‌నగర్ ప్రధాన రహదారి అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా మారింది. 22 కిలోమీటర్ల ఈ దారిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే గంటన్నర సమయం పడుతుందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అధ్వానంగా కేశంపేట- షాద్‌నగర్ ప్రధాన రహదారి
గుంతలమయంగా రోడ్డు.. ఇబ్బందుల్లో వాహనదారులు
తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని పాలకులు
రోడ్డును విస్తరించాలని స్థానికుల డిమాండ్
కేశంపేట, నవంబరు22 (ఆంధ్రజ్యోతి): కేశంపేట - షాద్‌నగర్ ప్రధాన రహదారి అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా మారింది. 22 కిలోమీటర్ల ఈ దారిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే గంటన్నర సమయం పడుతుందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గోతులమయమైన ఈ రోడ్డుపై తరుచు ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. అధ్వానంగా ఉన్న ఈ రహదారిని పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు.
కేశంపేట శివారులోని నూర్ ప్యాలెస్ సమీపంలో రోడ్డు పూర్తిగా పాడైంది. ఇటీవల ఇక్కడ జరిగిన ప్రమాదంలో బొదునంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మక్సోనికుంట దగ్గర కల్వర్టు వద్ద రోడ్డు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. అదేవిధంగా వేముల్‌నర్వ శివారులో మిషన్ భగీరథ పైప్‌లైన్ వేసేందుకు రోడ్డు తవ్వారు. అక్కడ సిమెంట్ సరిగా వేయకపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. దానికి సమీపంలోనే వరద తాకిడికి రోడ్డు కోతకు గురైంది. వేముల్‌నర్వ నుంచి ఇప్పలపల్లి మార్గంలో చౌదరిగూడ, దత్తాయపల్లి గేటు సమీపంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పలపల్లి నుంచి కమ్మదానం వరకు రోడ్డు భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి. పాపిరెడ్డిగూడ సమీపంలోని మలుపుల వద్ద రోడ్డుపై రాళ్లు తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డును విస్తరించి పటిష్టంగా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డుకు మరమ్మతు చేపట్టాలి
కేశంపేట నుంచి షాద్‌నగర్ వరకు దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతు చేయాలి. అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో బైక్ నడపడం కూడా కష్టంగా ఉంది. ఈ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుతున్నా అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదు.
పసుల నరసింహ యాదవ్, బీజేపీ నాయకుడు, కేశంపేట
కారు షాకాబ్బర్లు దెబ్బతింటున్నాయి
ఈ రోడ్డుపై అడుగుకో గుంత ఉండటంతో వాహనాలు పాడవుతున్నాయి. తరచూ రిపేర్లు వస్తున్నాయి. మిషన్ భగీరథ, రైతుల అవసరాలకు తవ్విన రోడ్లను పూడ్చకుండా అలాగే వదిలేశారు. వేముల్‌నర్వ సమీప రోడ్డుపై చాలా గుంతలు ఏర్పడ్డాయి.
గాండ్ల అశోక్ కుమార్, వేముల్‌నర్వ, కేశంపేట మండలం
Updated Date - Nov 22 , 2024 | 11:14 PM