దుంగల దొంగలు దొరికేదెన్నడు?
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:00 AM
మండలంలోని గడ్డమల్లాయగూడ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో రైతులు పెంచిన రూ.కోటి విలువైన శ్రీగంధం చెట్లను దుండగులు నరుక్కొని అపహరించుకు పోతుండడంతో రైతులు రాత్రిళ్లు తమ పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
రైతుల పొలాల నుంచి ‘శ్రీగంధం’ చెట్లు అపహరణ
వరుస ఘటనలతో రైతులకు రూ.కోటి వరకు నష్టం
రాత్రిళ్లు పొలాల వద్దకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు
యాచారం, జనవరి 17: మండలంలోని గడ్డమల్లాయగూడ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో రైతులు పెంచిన రూ.కోటి విలువైన శ్రీగంధం చెట్లను దుండగులు నరుక్కొని అపహరించుకు పోతుండడంతో రైతులు రాత్రిళ్లు తమ పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. దుంగల దొంగలు స్థానికులా, దూరా ప్రాంతాల నుంచి వస్తున్నారా? అనేది తెలియడం లేదని రైతులు వాపోతున్నారు. దొంగలు పగటిపూట బిక్షాటన చేస్తూ, పొలాల వద్దకెళ్లి కంజు పిట్టలను పట్టేవారిలా, రియల్టర్లలా నటిస్తూ శ్రీగంధం చెట్లు పెంచుతున్న జాత తెలుసుకుంటూ అర్ధరాత్రి నరికి వేస్తూ ఎత్తుకెళుతున్నట్లు తెలిసింది. శ్రీగంధం చెట్లను దొంగలు అపహరించుకుపోవడంతో రైతులు బోరునవిలపిస్తున్నారు. 20ఏళ్లుగా పెంచిన చెట్లపై పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయని వాపోతున్నారు. మరో ఐదేళ్లపాటు పెంచితే ఒక్కో చెట్టుకు రూ.9లక్షలు వచ్చేవని రైతులు చెప్పారు.
పొలాల్లో పదుల సంఖ్యలో చెట్ల నరికివేత!
గతంలో మాజీ సర్పంచ్ జి.సురేందర్‌రెడ్డి పొలంలో ఏడు శ్రీగంధం చెట్లు, అంజిరెడ్డి, అచ్చన పర్వతాలు, కమలాకర్‌రెడ్డి పొలాల్లో ఒక్కోటి చొప్పున నరుక్క పోయారు. అలాగే చౌదర్‌పల్లిలో ఇద్దరు రైతుల పొలాల్లో నాలుగు శ్రీగంధం చెట్లను నరుక్కపోయారు. ఇటీవల గడ్డమల్లాయగూడలో రైతు భోజిరెడ్డి పొలంలో 2, చంద్రయ్య పొలంలో 4 చెట్లు, రాజశేఖర్‌రెడ్డి పొలంలో 3, వెంకటరెడ్డి పొలంలో 1, రాకే్‌షరెడ్డి పొలంలో 2, యాదగిరి పొలంలో 3 చొప్పున శ్రీగంధం చెట్లను దుండగులు నరికి ఎత్తుకెళ్లారు. అచ్చన వెంకటయ్య అనే వ్యక్తికి చెందిన మూడు గొర్రెలు, రెండు పొట్టేళ్లను సైతం ఎత్తుకెళ్లారు. అలాగే గున్‌గల్‌లో భూషయ్యగౌడ్ పొలంలో ఏపుగా పెరిగిన శ్రీగంధం చెట్లను నరికి ఎత్తుకెళ్లారు.
బైక్‌లపై వస్తూ చెట్ల అపహరణ?
దుండగులు రాత్రివేళ గోప్యంగా బైక్‌లపై వచ్చి శ్రీగంధం చెట్లను నరికి ఎత్తుకెళ్లారు. నరకడానికి ఆలస్యం కాకుండా అత్యంత పదునైన గొడ్డళ్లను, పెట్రోల్‌తో నడిచేకట్టర్లను ఉపయోగించారని తెలుస్తోంది. దొంగల వద్ద మారణాయుధాలు ఉంటుండంతో రాత్రయిందంటే పొలాల వద్ద ఉండాలంటే రైతులు భయపడుతున్నారు. చెట్ల కోసం వచ్చిన వారిని తాము అడ్డుకుంటే చంపేందుకు సైతం వెనకాడరని రైతులు జంకుతున్నారు. దీంతో శ్రీగంధం చెట్లు ఉన్నా వాటిని కావాలి వెళ్లేందుకు రైతులు వెనకాడుతున్నారు. అయితే దుండగులు స్థానికులే అయి ఉంటారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కాకుంటే తాము శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం అనే విషయం వేరే వారికి ఎలా తెలుస్తుందని అనుమానిస్తున్నారు. దుండగుల కోసం యాచారం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి శ్రీగంధం ముక్కలను కొనుగోలు చేసే వ్యాపారుల దుకాణాలపై నిఘా వేశారు. ఈ విషయంపై యాచారం సీఐ సైదయ్యను వివరణ కోరగా క్రైం పోలీసులతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. దుంగల దొంగలపై మాడ్గుల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మంచాల, కడ్తాల, నల్గొండ జిల్లా మర్రిగూడ, చింతపల్లి, నగర శివారు పోలీసులకు సమాచారమందించి దుండగుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. దుండగులు సెల్‌ఫోన్ మాట్లాడారా.. ఏయే వాహనాల్లో దుంగలను తరలించారనే వివరాలను ఆరా తీస్తున్నట్లు చెప్పారు. కాల్‌డేటాను సేకరిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలని ఆయన ప్రజలను కోరారు.
Updated Date - Jan 18 , 2024 | 12:00 AM