పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2024-02-06T23:28:24+05:30
పీఎం విశ్వకర్మ పథకాన్ని వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పీఎం విశ్వకర్మ స్కీమ్‌పై సమావేశాన్ని నిర్వహించారు.
రంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 6 : పీఎం విశ్వకర్మ పథకాన్ని వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పీఎం విశ్వకర్మ స్కీమ్‌పై సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పీఎం విశ్వకర్మ స్కీమ్ కింద చేతి వృత్తుల వారికి శిక్షణ ఇచ్చి రుణం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ ద్వారా కళా నైపుణ్యాలకు వన్నె దిద్దడమేగాక వృత్తిదారులకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్నారు. గ్రామీణంలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఈ పథకానికి 18రకాల కుల వృత్తుల వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వడ్రంగి, కమ్మరి, కంసాలి, మోచీ, తాళాల మరమ్మతులు చేసేవారు, బీటకమ్మరి, అవుసలి, కుమ్మరి, మేదరి, ఉప్పరి, ఎరుకలి, శిల్పులు, బొమ్మలు చేసేవారు, చాకలి, మంగలి, పూలల్లే వారు, దర్జీ, నేతలు, బెస్తలు తదితర కుల వృత్తుల వారు ఈ పథకానికి అర్హులని వివరించారు. శిక్షణ ఇచ్చి గుర్తింపు కార్డు, ధ్రువీకరణ పత్రం, రూ.15వేల విలువ గల టూల్ కిట్ ఇస్తారని తెలిపారు. అలాగే వృత్తిపని కొనసాగించేందుకు వడ్డీ లేని రుణం ఇస్తారన్నారు. అభ్యర్థులు కనీస వయసు 18 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 60 ఏళ్లలోపు ఉండాలన్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల రుణ సాయం పొందని వారే అర్హులన్నారు. కుటుంబంలో ఒక్కరికే పథకం వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వ్యక్తికి పథకం వర్తించదన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, పరిశ్రమల అధికారి రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి గీతారెడ్డి, డీసీబీ అధికారి ధాత్రిదేవి, ఇన్‌చార్జి డీపీవో సంధ్యారాణి, మెప్మా పీడి శంకర్ సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
ఈ నెల 7వ తేదీ నుంచి 14 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఉదయం 8గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులకు వారి గ్రామాల సమస్యలు తెలుసుకోవాలన్నారు. సానిటేషన్ డ్రైవ్‌లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, అదనపు కలెక్టర్లు, మండల అధికారులు రోజూ ఒక గ్రామంలో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 15న పంచాయతీల్లో గ్రామసభ నిర్వహించి పంచాయతీ పారిశుధ్య, ఇతర సిబ్బందిని సన్మానించాలని సూచించారు. స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ కార్యక్రమానికి ఏ అధికారి, సిబ్బంది గైర్జాజరు కాకూడదన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రతిమాసింగ్, ఇన్‌చార్జి డీపీవో సంధ్యారాణి, సీఈవో దిలీ్‌పకుమార్, మిషన్ భగీరథ ఎస్‌ఈ ఆంజనేయులు, పీఆర్ ఎస్‌ఈ రాజేశ్వర్, డీఆర్డీఏ అదనపు పీడీ నీరజ, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీల అభివృద్ధిలో ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలి
ప్రత్యేకాధికారులు గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ శశాంక తెలిపారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రత్యేక అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినందున ఈ నెల 2 నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టినట్టు చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో అధికారులు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. వారు 2018పంచాయతీ రాజ్ యాక్ట్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీల బ్యాంక్ అకౌంట్ల గురించి, గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, కోర్టు కేసులపైన అవగాహన పెంచుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ ఇంటికి నల్లా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు వంద శాతం పని దినాలను కల్పించాలన్నారు.
Updated Date - 2024-02-06T23:28:25+05:30 IST