కల్తీమయం!
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:41 PM
కల్తీకి కాదేది అనర్హం.. అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. బయట కొనే ఏ వస్తువైనా మంచిదేదో.. నకిలీ ఏదో పోల్చుకోలేని దుస్థితి. ప్రజలు బయట పదార్థాలు కొని ఇంటికి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాల విక్రయం
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులు
హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల నిఘా కరువు
బిర్యానీల్లో ప్రమాదకర సింథటిక్ కలర్ల వినియోగం
నెయ్యిలో డాల్డా, అల్లం వెల్లుల్లిలో ఆలుగడ్డ మిక్సింగ్
సిబ్బంది కొరతతో పది నెలల్లో 70 నమూనాలే సేకరణ
17 శాంపిల్స్ అన్‌సే్‌ఫగా నిర్ధారణ, కేసులు నమోదు
అరకొర జరిమానాలు, యథావిధిగా జరుగుతున్న కల్తీ
కల్తీకి కాదేది అనర్హం.. అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. బయట కొనే ఏ వస్తువైనా మంచిదేదో.. నకిలీ ఏదో పోల్చుకోలేని దుస్థితి. ప్రజలు బయట పదార్థాలు కొని ఇంటికి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు. ఆ తీరుగా వ్యాపారులు హోటళ్లు, రెస్టారెంట్‌లతో పాటు నిత్యావసర సరుకులు కల్తీ చేస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. నీటి నుంచి చిన్న పిల్లలు తాగే పాల వరకు సర్వం కల్తీమయం అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు.
రంగారెడ్డి అర్బన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న హోటళ్లు, రెస్టారెంట్లు రెండు వేలకు పైగా ఉన్నాయి. చిరుతిళ్లు అమ్మే తోపుడు బండ్లు, ట్రక్‌లు, పానీపూరి డబ్బాలు, న్యూడుల్స్ కేంద్రాలు మరో వెయ్యికిపైగా ఉన్నాయి. వైన్‌షాపులు, పైవ్రేటు హాస్టళ్లు, ఐస్‌క్రీం పార్లర్లు, పాల డెయిరీలు, బేకరీలు ఎన్నో ఉన్నాయి. పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలు, ఆసుపత్రుల్లో క్యాంటీన్లు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మసాల, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఫుడ్‌సేప్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి, ఆహార ప్రియులకు సురక్షితమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉంది. కానీ జిల్లాలో హోటళ్ల సామర్థ్యం మేరకు ఫుడ్ సేప్టీ ఆఫీసర్లు లేరు. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారు. దీంతో తనిఖీలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ఆహార ప్రియులు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది. సిబ్బంది కొరతతో ప్రతినెలా ఏదో మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం, నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపిస్తున్నారు.
కేవలం 70 నమూనాలే సేకరణ
తుక్కుగూడలోని ఎస్‌ఎన్‌గ్రాండ్ హోటల్ నిర్వాహకులు బిర్యానీలో సామర్థ్యానికి మించి సింథటిక్ కలర్స్ వినియోగించినట్లు ఫిర్యాదు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. నమూనాలు సేకరించి, పరీక్షించగా ఈ ఆహారం తినడం ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిర్ధారణ అయింది. దీంతో సంబంధిత హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. మొయినాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజీ క్యాంటీన్‌లో పురుగుపట్టిన నాసిరకం పప్పును వడ్డిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు నమూనాలు సేకరించి పరీక్షించారు. ఆహారం అన్‌సే్‌ఫగా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారులు క్యాంటీన్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కిస్మత్‌పూర్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో బిర్యానీలో మోతాదుకు మించి సింథటిక్ కలర్స్ కలిపినట్లు తనిఖీల్లో తేలడంతో అధికారులు నమూనాలు సేకరించి కేసు నమోదు చేయించారు. ఇలా జిల్లావ్యాప్తంగా పది నెలల్లో కేవలం 70 నమూనాలు సేకరించి పరీక్షించగా.. వీటిలో 17నమూనాలు అన్‌సేఫ్‌గా నిర్ధారణ అయింది. ఆయా హోటళ్లు, డెయిరీ ఫామ్‌లపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నా కల్తీ వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదనె విమర్శలు వస్తున్నాయి.
కాటేదాన్ కేంద్రంగా కల్తీ..
కాటేదాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న మసాల, అల్లం వెల్లుల్లి, ఐస్‌క్రీం పార్లర్లు, నెయ్యి ప్యాకింగ్ తయారీ కేంద్రాల్లో తరచూ కల్తీ పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్టులో ఆలుగడ్డను కలుపుతున్నారు. అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్న చికెన్, ఫిష్, మటన్‌కు సింథటిక్ కలర్లు అద్ది, మసాలాలు దట్టించి, నూనెలో వేపి విక్రయిస్తున్నారు.
‘పాల’కూట విషం..
కల్తీపాల తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన చూరియా, సల్ఫర్ తదితర పలు రసాయనాలతో కల్తీపాలు తయారు చేస్తున్నారు. కొందరు అధిక పాల దిగుబడి కోసం పశువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లతో సహా, బీర్ దాణా వంటి హానికర ఆహార పదార్థాలు అందిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రత్యక్షంగా పశువులు ఆయువు ప్రమాణాన్ని తగ్గించడంతో పాటు పరోక్షంగా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇటీవల జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేవెళ్ల, నందిగామ, ఆల్మా్‌సగూడ, నాదర్‌గుల్, ముచ్చింతల, పసుమాములలోని పలు డెయిరీల్లో తనిఖీలు నిర్వహించి, నమూనాలు సేకరించి పరీక్షించగా.. విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. నిర్ధేశించిన ప్రమాణాల మేరకు పాల నాణ్యత లేకపోవడంతో ఆయా వ్యాపారులకు నోటీసులు కూడా జారీ చేశారు. గ్రామాల్లో పాల డబ్బాలు వేసుకుని వాడవాడలా తిరిగి పాలు అమ్ముతున్న పాలల్లో సురక్షితం కాని నీళ్లను కలుపుతున్నారు.
అరకొర జరిమానాలు..!
ఆహార కల్తీ నిరోధక చట్టం కింద వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడితే ప్రస్తుతం రూ.500-3,000 వరకు మాత్రమే జరిమానాలు విధిస్తుండటంతో ఉల్లంఘనులు వెరవడం లేదు. అపరిశుభ్ర పరిసరాల్లో వండిన వంటకాలనే వినియోగదారులకు వడ్డిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీల్లో అక్రమాలు బటయట పడితే తక్కువ మొత్తంలో జరిమానాలను చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు.
Updated Date - Nov 02 , 2024 | 12:18 AM