ఆ ఊరిలో.. మూడు బొడ్రాయిలు
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:46 PM
ఆదిభట్ల.. పరిచయం అక్కర్లేని ఊరు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఈ గ్రామం పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. పేరున్న పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ఇక్కడే వెలిశాయి. పెట్టుబడులకు గ్యారంటీలా అనేక ప్రత్యేకతలు ఉండడటంతో నేడు అభివృద్ధికి కేరా్‌ఫగా మారింది. వీటితో పాటు మరో ప్రత్యేకత ఉంది.
-ఎక్కడా లేని విధంగా ఆదిభట్లలో ఏర్పాటు
-ఎప్పుడు ఎవరు ప్రతిష్ఠించారో తెలియదు
-మూడు నాభి శిలలకు ప్రత్యేక పూజలు
-ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
ఆదిభట్ల.. పరిచయం అక్కర్లేని ఊరు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఈ గ్రామం పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. పేరున్న పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ఇక్కడే వెలిశాయి. పెట్టుబడులకు గ్యారంటీలా అనేక ప్రత్యేకతలు ఉండడటంతో నేడు అభివృద్ధికి కేరా్‌ఫగా మారింది. వీటితో పాటు మరో ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా గ్రామ నడిబొడ్డున నాభిశిల(బొడ్రాయి) ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామాన్ని నిర్మాణం చేస్తారు. కాగా, దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ గ్రామంలో మూడు బొడ్రాయిలున్నాయి. ఎప్పుడు, ఎవరు, ఎందుకు ప్రతిష్ఠించారో తెలియదుగాని ఇప్పటికీ ఆ ఆచారం అలాగే కొనసాగుతోంది. బోనాలు పండుగ సమయంలో మూడు చోట్ల ప్రత్యేక పూజలు జరుగుతుండటం విశేషం.
ఆదిభట్ల, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఆదిభట్లలోని కింది బస్తీలో ఒకటి మధ్యలో ఎస్‌బీఐ ఎదుట మరోటి, మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఒకటి మొత్తం మూడు చోట్ల బొడ్రాయిలున్నాయి. వందల ఏళ్ల కిందట గ్రామాన్ని నిర్మించిన రోజు ఏర్పాటు చేసిన బొడ్రాయి గ్రామంలో సీసీ రోడ్ల ఏర్పాటుతో భూమికి సమానంగా మారుతున్నాయి. అనేక గ్రామాలలో బొడ్రాయిని తొలగించి పూజలు నిర్వహించి కొత్త నాభిశిల ఏర్పాటు చేస్తుండటం తరుచూ చూస్తున్నాం. ఆదిభట్లలో ఉన్న ఈ మూడు నాభిశిలలు భూమి లేవల్‌కు చేరుకున్నాయి. ఇక్కడ కూడ కొత్తది ఏర్పాటు చేసేందుకు ప్రతిపాధనలు వచ్చినా పైకి లేపాలంటే ముందు ఏది కదిలించాలి అనే మీమాంసతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు? అనవసరంగా కదిలిస్తే ఏలాంటి సమస్యలు వస్తాయో? అని వాటి జోలికి పోవడం లేదు. ఏదేమైనా గతంలో డంపింగ్ యార్డు కోసం గుర్తించిన ఓ శివారు కుగ్రామం నేడు జాతీయ అంతర్జాతీయ గుర్తింపునకు నోచుకోని ప్రపంచపటంలో చోటు దక్కిందంటే ఆ బొడ్రాయి నాటిన వేళావిశేషం కూడా కావచ్చని గ్రామస్తులు చెప్పుకోవడం గమనార్హం.
ఎప్పుడు పెట్టిండ్రో తెలవదు
మా ఊరిలో మూడు బొడ్రాయిలు ఉన్న విషయం నేను చిన్నతనం నుంచి చూస్తున్నా. మాతాతల కాలం నుంచే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇలా మూడు బొడ్రాయిలు ఉండవు. ఎప్పుడు పెట్టిండ్రో, ఎందుకు పెట్టిండ్రో తెల్వదు. ఏ ఊరిలో మూడు బొడ్రాయిలు చూడలే ఇక్కడనే ఈ సిత్రం ఉందంటూ ఊరికి వచ్చిన చుట్టాలు మాట్లాడుతరు.
-కోరే జంగయ్య, ఆదిభట్ల
--------------------------
ఈ బొడ్రాయిలతో మంచే జరిగింది
దేశంలోనే ఎక్కడ లేని విదంగా మా ఊరిలో మూడు చోట్ల బొడ్రాయిలు ఉండటం మా అదృష్టంగా చెప్పుకుంటాం. గ్రామానికి గుర్తింపు రావడానికి నాభిశిల పాతిన వేళావిశేషంగా మాపెద్దలు చెబుతుంటారు. ఏ ఆచారం ప్రకారం ఏర్పాటు చేశారో తెలియదు గాని వాటి వల్ల మంచి జరిగిందని చెప్పొచ్చు. కనీస ఉపాధి అవకాశాలు లేని స్థాయి నుంచి వేల మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఆదిభట్ల చేరుకుంది.
-మర్రి నిరంజన్ రెడ్డి, చైర్మన్ ఆదిభట్ల మున్సిపాలిటీ
Updated Date - Oct 27 , 2024 | 11:46 PM