యాసంగిపై గంపెడాశలు!
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:42 PM
యాసంగి సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వానాకాలం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పెరిగిన భూగర్భ జలాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-భారీ వర్షాలతో పెరిగిన భూగర్భజలాలు
-కళకళలాడుతున్న చెరువులు, కుంటలు
-అతివృష్టితో కన్నీళ్లు మిగిల్చిన వానాకాలం!
-ఈసారి రెట్టింపు సాగుకు అవకాశం
-ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయాధికారులు
-వికారాబాద్ జిల్లాలో 1,42,159 ఎకరాలు..
-మేడ్చల్ జిల్లాలో 19,758 ఎకరాల్లో సాగు అంచనా
-అవసరం మేరకు ఎరువులు, విత్తనాలు సిద్ధం
యాసంగి సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వానాకాలం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పెరిగిన భూగర్భ జలాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లతో పోలిస్తే ఈ యాసంగిలో రెట్టింపు స్థాయిలో సాగు విస్తీర్ణం పెరగనుందని వ్యవసయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు యాసంగి సాగు ప్రణాళికను ఖరారు చేశారు. వికారాబాద్ జిల్లాలో 1,42,159 ఎకరాలు, మేడ్చల్ జిల్లాలో 19,758 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేశారు.
పరిగి/మేడ్చల్ ప్రతినిధి, అక్టోబర్ 27(ఆంధ్రజ్యోతి): వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని నీటి వనరులు కళకళలాడుతున్నాయి. భూగర్భజలు పెరగడంతో మోటార్లు నాన్‌స్టాప్‌గా నీటిని తోడుపోస్తున్నాయి. దీంతో యాసంగి సాగు భారీగా పెరగనుందని వ్యవసాయాధికారులు అంచనాలు సిద్ధం చేశారు. పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈ వానాకాలం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గడిచిన వానకాలంలో 665.3 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 903.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని చెరువుల కింద దాదాపు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టు, కోట్‌పల్లి, జంటుపల్లి, బొంరాసిపేట్, ఎర్పుమల్ల, హస్నాబాద్, దోమ, కులకచర్ల, అంతారంప్రాజెక్టు, ఇబ్రహీంపూర్, గడిసింగానూర్, బాసుపల్లి, తదితర చెరువులు భారీగా నిండాయి. బోర్లలో నీరు ఉబీకి బయటకు వస్తున్న సంఘటనలు కోకోల్లలున్నాయి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 65 వేలకుగాపైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. అలాగే విద్యుత్ సరఫరా 10 నుంచి 12 గంటల విదు్యుత్‌ను అందిస్తే తమ బతుకులు బాగుపడతాయంటున్నారు.
అవసరమైన ఎరువులు సిద్ధం
గతేడాది యాసంగి 83,254 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ సారి 1,42,159 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన పంటలైన వరి, జొన్న, శనగ, చెరకుతోపాటు, రాగులు, గోదుమలు, కుసుమలు, నువ్వులు, ఆముదాలు, అలసంద తదితర పంటలు కూడా రెట్టింపు స్థాయిలో సాగు కానుందని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వేరుశనగ, శనగ విత్తనాలు విత్తారు. ఈ వానాకాలం సీజన్‌లో పత్తి, ెుుక్కజొన్న పంటలు బాగా దెబ్బతినడంతో ఎక్కువగా పత్తినే సాగు చేశారు.
మేడ్చల్ జిల్లాలో 19,758 ఎకరాల్లో సాగు
మేడ్చల్ జిల్లాలో యాసంగి సాగుకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ యాసంగి జిల్లా వ్యాప్తంగా 19,758 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఆ మేరకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడానికి ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన కాలంలో మన తెలంగాణ, మన వ్యవసాయం కార్యక్రమం అమలు చేసి యాసంగిలో సాగు చేయాల్సిన పంటలన అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఇప్పుడు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం వివిధ కంపెనీల విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖాధికారులు సైతం అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
అవసరం మేరకు ఎరువులు సిద్ధం
వరి 13,788, మొక్కజొన్న, జొన్న, మినుములు తదితర పంటలు 691 ఎకరాల్లో, పండ్ల తోటలు 2,808, కూరగాయలు 2,657 ఎకరాలు, ఇతర రకాల పంటలు 520 ఎకరాల్లో సాగవుతందని ప్రణాళికలు రూపొందించారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి వరి, ఇతర పంటలతో కలుపుకుని మొత్తం 5 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదికలను పంపించారు. వరి 4725 క్వింటాళ్లు, మొక్కజొన్న 250 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నాయని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా రైతులకు కావాల్సి ఎరువులు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. యూరియా 2,194, డీఏపీ 2,345, కాంప్లెక్స్ 29,327 బస్తాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో సాగు అంచనా(ఎకరాల్లో..)
పంట గతేడాది ఈ యాసంగి
వరి 45,000 90,179
శనగలు 10,441 20,098
వేరుశనగ 6,526 16,735
జొన్న 3,481 5,601
చెరుకు 2,074 2,321
Updated Date - Oct 27 , 2024 | 11:43 PM