అసైన్డ్ భూములు మాయం!
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:26 PM
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం లక్ష్మాపూర్‌లో అసైన్డ్ భూములు అన్యాక్రాంతవుతున్నాయి.
లక్ష్మాపూర్‌లో పట్టా నంబర్ల్‌తో రిజిస్ట్రేషన్లు
రెవెన్యూ అఽఽధికారుల కనికట్టు
భూ మాఫియాతో కుమ్మక్కు
గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
మూడుచింతలపల్లి, జనవరి 18 : మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం లక్ష్మాపూర్‌లో అసైన్డ్ భూములు అన్యాక్రాంతవుతున్నాయి. లక్ష్మాపూర్‌నకు సరైన రెవెన్యూ నక్ష లేకపోవడంతో దళారులు, రెవెన్యూ అధికారులకు కాసులవర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ భూములను తమ కబంధహస్తాల్లోకి తీసుకొని వారు ఆడిందే ఆట పాడిందే పాటగా దోపిడీ సాగిస్తున్నారు. మూడుచింతలపల్లి మండలాన్ని అప్పట్లో కేసీఆర్ దత్తత తీసుకొని ఎస్‌డీఎఫ్ కింద నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. దీంతో చుట్టుముట్టు గ్రామాల భూములకు ఎకాయకిన ధరల పెరిగాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఇదే అదనుగా దళారులు పథకం ప్రకారం పట్టా, అసైన్డ్ భూములపై కన్నేశారు. పాత రికార్డుల్లో భూమి ఎక్కువగా ఉండి పొజిషన్‌లో లేనివారిని ఎంచుకొని వారిని నయానో భయానో ఒప్పించి ఎంతోకొంత ముట్టజెపుతూ వారి సర్వే నంబరునే అసైన్డ్ భూములకు సైతం వేసి రిజిస్ర్టేషన్లు చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అసైన్డ్ భూములకు పట్టా ల్యాండ్ నంబర్లతో రిజిస్ట్రేషన్లు
లక్ష్మాపూర్‌లోని సర్వే నంబరు 120లో 1,040 ఎకరాల అటవీ, అసైన్డ్ భూములున్నాయి. ఇందులో 300 ఎకరాల వరకు అసైన్డ్ భూమి. పాత రికార్డుల ప్రకారం భూమి ఎక్కువ ఉండి పొజిషన్‌లో లేనివారిని దళారులు గుర్తించి ఎకరానికి వారికి రూ.10లక్షల నుంచి 12లక్షల చొప్పున ఇచ్చి వారి భూమిని సర్వే నంబరు 120 పక్కనున్న పట్టా నంబరుతో రిజిస్ర్టేషన్ చేయించుకుంటూ పట్టా భూములుగా మార్చుకుంటున్నారు. అనంతరం ఇవే భూములను ఎకరం రూ.50లక్షల నుంచి రూ.70లక్షలు, రోడ్డు బిట్లు కోటికి చొప్పున అమాయకులకు విక్రయిస్తున్నారు. మొత్తానికి అందరూ కలిసి అసైన్డ్, ప్రభుత్వ భూములకు శఠగోపం పెడుతున్నారు. ఇప్పటి వరకు 50ఎకరాల అసైన్డ్ భూమి చేతులు మారింది. ఈ దందా విషయం తెలియక భూమి కొన్న అమాయకులు మోసపోతూ భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
భూ మాఫియా, రెవెన్యూ అఽధికారులు కలిసే దందా?
ధరణి పోర్టల్ వచ్చిన తరువాత గ్రామాల్లో భూ సమస్యలు పెరిగాయి. పోర్టల్‌లోని లొసుగులను దళారులు వాడుకుంటూ రెవెన్యూ అధికారులకు లంచాలు ఇస్తూ అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. తమకు పట్టా పాస్‌పుస్తకాలు రాలేదని, రికార్డుల్లో భూ వివరాలు తప్పుగా నమోదయ్యాయని.. వాటిని సరిచేయాలని రైతులు ఏళ్ల తరబడి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని.. ఇప్పుడు ఎక్కడో ఉన్న సర్వే నంబరు తెచ్చి ఈ నంబరు ఇక్కడే వస్తుందని చెప్పగానే అసైన్డ్ భూమిని సైతం పట్టా భూమి సర్వే నంబర్‌తో రెవెన్యూ అధికారులు ఎలా రిజిస్ర్టేషన్ చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఽఽధికారులకు కాసులిస్తే ఒక లెక్క.. లేదంటే మరో లెక్కనా? అని అంటున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే దళారులతో కలిసి భూ దందాకు ఊతం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ తతంగంపై తాము ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి భూములను అన్యాక్రాంతం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
అసైన్డ్ భూములకు హద్దులను ఏర్పాటు చేయాలి : సింగం రాజు, లక్ష్మాపూర్
అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి మా గ్రామంలో అసైన్డ్ భుములకు హద్దులు ఏర్పాటు చేయాలి. అలా అయితేనే అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఉంటాయి. ఇప్పటికే పట్టా భూముల సర్వే నంబర్లతో రిజిస్ర్టేషన్లు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉన్న ప్రభుత్వ భూములు గ్రామానికి ఉపయోగపడేలా చూడాలి.
అఽఽధికారుల చేతివాటంతోనే ఈ దందా : అరుణ్, లక్ష్మాపూర్
లక్ష్మాపూర్‌లోని అసైన్డ్ భూములన్నీ అధికారుల చేతివాటంతోనే పట్టా భూములగా మారుతున్నాయి. మా భూ సమస్యలను తీర్చాలని మేం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కానీ అసైన్డ్ భూములు మాత్రం దళారుల పాలవుతున్నాయి. ఈ మాఫియాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న అఽధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
మా దృష్టికి రాలేదు.. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం : వాణిరెడ్డి, తహసీల్దార్, మూడుచింతలపల్లి
లక్ష్మాపూర్‌లో అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై గ్రామస్తులు మాకు ఫిర్యాదే చేయలేదు. ఇప్పటికైనా ఫిర్యాదు చేస్తే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పాత రికార్డుల ప్రకారం అసైన్డ్ భూములకు హద్దులు నిర్ణయిస్తాం. దీంతో ఎక్కడెక్కడ అసైన్డ్ భూములున్నాయో నిర్ధారణ అవుతుంది. అప్పుడు అసైన్డ్ భూములను అమ్మిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
Updated Date - Jan 18 , 2024 | 11:26 PM