తెలంగాణలోనే రిచెస్ట్.. రంగారెడ్డి జిల్లా
ABN, Publish Date - Jan 24 , 2024 | 03:40 AM
రాష్ట్రంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. తెలంగాణ ఎకానమీ-2023 పేరిట రాష్ట్ర ప్రణాళికా విభాగం ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో తలసరి ఆదాయం ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత ధనిక జిల్లాల జాబితాను పేర్కొంది. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల జాబితాలో
2,3 స్థానాల్లో హైదరాబాద్, సంగారెడ్డి
తలసరి ఆదాయం ఆధారంగా గుర్తింపు
తెలంగాణ ఎకానమీ -2023 నివేదిక
హైదరాబాద్, జనవరి 23 : రాష్ట్రంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. తెలంగాణ ఎకానమీ-2023 పేరిట రాష్ట్ర ప్రణాళికా విభాగం ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో తలసరి ఆదాయం ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత ధనిక జిల్లాల జాబితాను పేర్కొంది. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల జాబితాలో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు వరుసగా ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.
తెలంగాణ ఎకానమీ-2023 ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.8,15,996. రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ. 4,03,214. మూడో స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 3,08,166గా ఉంది. ఈ గణాంకాల ప్రకారం హైదరాబాద్ వాసుల కంటే రంగారెడ్డి జిల్లా వాసులే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఐటీ హబ్ కారణంగానే రంగారెడ్డి రిచెస్ట్ జిల్లాగా మారిందని నిపుణులు చెబుతున్నారు. స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జిడిడిపి) పరంగా కూడా తెలంగాణలోని జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. జిల్లా తలసరి ఆదాయం ఆ ప్రాంతంలోని వ్యక్తుల సంవత్సర సగటు ఆదాయాన్ని తెలియజేస్తోంది. ఇక, తలసరి ఆదాయం ఆధారంగా దేశంలో టాప్-10 ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో సిక్కిం మొదటి స్థానంలో ఉండగా.. గోవా రాష్ట్రం రెండో స్థానంలో ఉంది.
Updated Date - Jan 24 , 2024 | 03:40 AM