డిజిటల్ క్రాప్ సర్వే చేయలేం
ABN, Publish Date - Oct 05 , 2024 | 12:35 AM
పంట వివరాలను పక్కాగా ఆన్‌లైన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేను తీసుకొచ్చింది. గతంలోనే ఈ విధానం ఉండగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. కాగా, రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు నిర్ణయించి ఆ బాధ్యతలను ఏఈవోలకు అప్పగించింది.
అదనపు పనిభారంఅంటున్న ఏఈవోలు
చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తున్న వ్యవసాయశాఖాధికారులు
సూర్యాపేట (కలెక్టరేట్): పంట వివరాలను పక్కాగా ఆన్‌లైన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేను తీసుకొచ్చింది. గతంలోనే ఈ విధానం ఉండగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. కాగా, రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు నిర్ణయించి ఆ బాధ్యతలను ఏఈవోలకు అప్పగించిం ది. అయితే ఇప్పటికే పలు కీలక పనులు నిర్వహిస్తున్న తాము అదనంగా డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించలేమని పేర్కొంటున్నారు.
వ్యవసాయరంగంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తుంటుంది. అందుకు గత ప్రభుత్వ హయాంలో ఏఈవోలను (వ్యవసాయ విస్తరణ అధికారులు) నియమించింది. ఏఈవోలకు ఒక్కొక్కరికి 5,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కేటాయిస్తూ ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసింది. ఏఈవోలు రోజు వారీగా సదరు క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు వెళ్లి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పంటల సాగులో నూతన పద్ధతులు, మెళకువలు, తదితర విషయాలపై అవగాహన కల్పించాలి. ఇప్పటి వరకు ఈ విఽధులతో పాటు రుణమాఫీ ప్రక్రియ, రైతుబీమా, పంటల సాగు వివరాల నమోదును అదనంగా చేపడుతున్నారు. దీంతో పాటు ప్రతీ మంగళవారం వారికి కేటాయించిన మండలంలో ఏదైనా ఒక క్లస్టర్ పరిధిలో రైతు వేదికలో ఆయా ప్రాంత రైతులను సమీకరించి హైదరాబాద్ నుంచి జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేట్టు చేస్తున్నారు. అయితే తాజాగా, వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ఏఈవోలను ఆదేశించింది. డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల సాగును పక్కాగా నమోదు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు నిర్ణయించింది. అయితే డిజిటల్ క్రాప్ సర్వే తమ వల్లకాదంటూ ఏఈవోలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు రకాల విఽధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేయలేమని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఈ సర్వేను గత నెల 24 నుంచి నిర్వహించాల్సి ఉండగా, ఉమ్మడి జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. తమకు సహాయకులుగా ఆయా గ్రామాల నుంచి ఎవరినైనా నియమిస్తే ఆలోచిస్తామని ఏఈవోలు చెబుతున్నారు.
డిజిటల్ క్రాప్ సర్వే అదనపు భారం
డిజిటల్ క్రాప్ సర్వే చేయలేమని, ఇది తమకు అదనపు భారమని ఏఈవోలు పేర్కొంటున్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఏఈవోలు వినతి పత్రాలు అం దజేశారు. ఒక్కో గ్రామంలో ఉన్న సర్వే నెంబర్లలోని సబ్ డివిజన్ల వారీగా రైతుల పంటల సాగు వివరాలు, ఫొటోను వ్యవసాయ శాఖ రూపొందించి న యాప్‌లో నమోదు చేయాలి. ఒక్కో సర్వే నెంబర్‌లో పలు సబ్ డివిజ న్లు ఉంటాయి. పదుల నుంచి వందలు, వేల ఎకరాల్లో వ్యవసాయ భూ ములు ఉన్నాయి. అంతేకాకుండా పదుల సంఖ్యలో రైతులు కూడా ఉంటా రు. క్షేత్రస్థాయికి వెళ్లి ఈ సర్వే చేయడం తమవల్ల కాదని ఏఈవోలు అంటున్నారు.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు
డిజిటల్ క్రాప్ సర్వే చేయాలంటే క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు ఏఈవోలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,604 మంది ఏఈవోలలో సగానికి తక్కువగా మహిళలే ఉన్నారు. ఒక్కో ఏఈవోల పరిధిలో కనీసం ఐదు వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వాటి వివరాలు నమోదు చేయాలంటే నెలల సమయం పట్టే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పొలాల వద్ద విషసర్పాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు వ్యవసాయ పొలాల ప్రాంతంలో పెద్దగా జనసంచారం ఉండదు. మహిళా ఏఈవోలు డిజిటల్ సర్వేకు ఎలా వెళ్తారని వారు ప్రశిస్తున్నారు.
అదనపు సిబ్బందిని నియమిస్తే
డిజిటల్ క్రాప్ సర్వే చేయాలంటే ప్రభుత్వం గ్రామానికి ఒకరి చొప్పున అదనపు సిబ్బందిని నియామకం చేయాలని ఏఈవోలు కోరుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు బీబీనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అయితే ఆ మండలంలో 20 మంది ఏఈవోలు డిజిటల్ క్రాప్ సర్వే చేయడానికి మూడు నెలల సమయం పట్టింది. దీని ప్రకారం ఒక్కో ఏఈవో వారికి కేటాయించిన క్లస్టర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలంటే నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అందుకోసం గ్రామానికి ఒకరిని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నియమించినట్లు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను నియమించాలని ఏఈవోలు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు.
ఏఈవోలపై ఒత్తిడి తెస్తున్న వ్యవసాయశాఖాధికారులు
డిజిటల్ క్రాప్ సర్వే చేయాల్సిందేనని ఏఈవోలపై రాష్ట్ర వ్యవసాయశాఖాధికారులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అన్ని జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా, ఇంకా మొదలు పెట్టలేదు. క్రాప్ సర్వే చేయకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏఈవోలు జేఏసీగా ఏర్పడి వ్యవసాయశాఖాధికారులతో చర్చించాలని, ఆ చర్చల్లో సానుకూలాంగా నిర్ణయం రాని పక్షంలో తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు ఏఈవోలు సిద్ధపడుతున్నారు. ఇటీవల సం బంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని ఏఈవోలు రెండు రోజులు విధులకు గైర్హాజరైనట్టు వారి మస్టర్‌లో అధికారులు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాలో 82 క్లస్టర్ల పరిధిలో 6.70లక్షల ఎకరాలు, యాదాద్రి-భువనగిరి జిల్లా లో 92 క్లస్టర్లకు ఐదు లక్షల ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 12లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులో ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు : జానయ్య, ఏఈవోల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు
డిజిటల్ క్రాప్ సర్వేతో ఏఈవోలు క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సర్వే నెంబర్లలోని ప్రతీ సబ్ డివిజన్ వారీగా పంటల వివరాలు సంబంధిత యాప్‌లో నమోదు చేయడం ఒక్క ఏఈవోలతో సాధ్యం కాదు. కేంద్ర ప్రభు త్వం డిజిటల్ క్రాప్ సర్వేకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో ఇతరులను నియమించి సర్వే చేయించాలి. ఏఈవోలపై వ్యవసాయశాఖాధికారులు ఒత్తిడి తేవడం బాధాకరం. ఇప్పటికే పలు రకాల విధులతో ఇబ్బందులు పడుతున్నాం. డిజిటల్ క్రాప్ సర్వే నుంచి ఏఈవోలను మినహాయించాలి.
రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : శ్రీధర్‌రెడ్డి, డీఏవో సూర్యాపేట
డిజిటల్‌క్రాప్ సర్వేపై రాష్ట్ర స్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఏఈవోలు మాత్రం డిజిటల్ క్రాప్ సర్వే తమవల్ల కాదంటున్నారు. అంతేగాక ప్రస్తుతం వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఏఈవోలు డిజిటల్ క్రాప్ సర్వే చేయలేమని, మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే వినతిపత్రాలు అందించారు.డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ప్రతీ రైతు సాగు చే సిన పంటల వివరాలు నమోదు కానున్నాయి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగ పథకాలను అమలుచేయాలని ప్రణాళిక రూపొందించింది.
Updated Date - Oct 05 , 2024 | 12:35 AM