డ్రగ్స్, రౌడీయిజంపై ఉక్కుపాదం
ABN, Publish Date - Jan 02 , 2024 | 12:38 AM
డ్రగ్స్, అక్రమ రవాణా, రౌడీయిజం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వరావు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు బదిలీ కాగా, ఆమె స్థానంలో 2012 బ్యాచ్‌కు చెందిన చందనా దీప్తి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు.
భూవివాదాల పరిష్కారానికి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ఏ సమాచారం ఉన్నా నేరుగా సంప్రదించండి8 ఎస్పీ చందనా దీప్తి
నల్లగొండ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): డ్రగ్స్, అక్రమ రవాణా, రౌడీయిజం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వరావు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు బదిలీ కాగా, ఆమె స్థానంలో 2012 బ్యాచ్‌కు చెందిన చందనా దీప్తి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మత్తు పదార్థాలు ప్రగతి నిరోధకాలని, డ్రగ్స్ యువతను నిర్వీర్యం చేస్తాయన్నారు. యువత అంటే రేపటి దేశ భవిష్యత్ అని, దేశ భవిష్యత్తును కాపాడుకోవడంలో యువత తమతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని జన జీవన స్రవంతిలో కలిపేందుకు పోలీసులకు పెద్ద వ్యవస్థ ఉందన్నారు. బానిసలుగా మారిన వారు పోలీ్‌సశాఖను సంప్రదిస్తే వారిని సన్మార్గంలో నడిపిస్తామన్నారు. తమతో సహకరించిన వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెల్లడించేది లేదన్నారు. మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యాపారులను, వాటిని సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో భూ వివాదాలు ఎక్కువగా ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. సివిల్ వివాదాల్లో పోలీస్ సిబ్బంది ఎంత వరకు జోక్యం చేసుకోవచ్చు, సిబ్బందికి ఉండే పరిధులు ఏంటి అనే అంశంపై త్వరలో అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్టు సమాచారం ఉందని, అందుకు కారణాలు విశ్లేషించి ప్రమాదాల నివారణకు ప్రయత్నిస్తానన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. తన నాయకత్వంలో ప్రొఫెషనల్ పోలీసింగ్ అందుబాటులోకి తీసుకువస్తానని, పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలంటే ఎటువంటి భయం లేకుండా ప్రజలు వచ్చేలా చూస్తానన్నారు. పనిచేయని సీసీ కెమెరాల వివరాలు తీసుకుని ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించడంలో శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రం, జిల్లాతో నల్లగొండకు భారీ సరిహద్దు ఉన్నందున దొంగతనాలు, చోరీలు జరుగుతున్నాయని, దొంగలను గుర్తించడం, పట్టుకోవడం, వారి నుంచి సొమ్ము రికవరీ చేయడంపై దృష్టి పెడతామన్నారు. జిల్లాలో శాంతి భద్రతల సంరక్షణకు ప్రజల దృష్టికి వచ్చిన ఎలాంటి సమాచారాన్నైనా తనకు నేరుగా చెప్పవచ్చన్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా పోలీ్‌సశాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఐపీఎస్ శిక్షణలో భాగంగా, ఆ తరువాత కృష్ణా పుష్కరాల విధుల్లో, పోలీస్ నియామకాల క్రమంలో జిల్లాలో తాను పనిచేశానని, జిల్లాపై తనకు కొంతమేర అవగాహన ఉందని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ హనుమంతరావు, ఎస్‌బీ డీఎస్పీ సోమ్‌నారాయణ్‌సింగ్, డీఎస్పీలు శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చందనా దీప్తి విలేకరుల సమావేశం అనంతరం డివిజన్ల వారీగా పోలీస్ అధికారులు, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త ఎస్పీతో సిబ్బంది కేక్ కట్ చేయించారు.
Updated Date - Jan 02 , 2024 | 12:38 AM