మరమ్మతులకు నోచని ఐవోసీ
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:55 PM
రాష్ట్రంలోనే తొలిసారిగా గజ్వేల్‌లో డివిజన్‌స్థాయిలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
గతేడాది వర్షానికి ఆయా కార్యాలయాల్లోకి నీరు
ఆర్నెళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు
స్పందించని అప్పటి ప్రభుత్వం
వర్షాకాలం వస్తే మరోసారి నీళ్లు కురిసే అవకాశం
గజ్వేల్, జనవరి 18: రాష్ట్రంలోనే తొలిసారిగా గజ్వేల్‌లో డివిజన్‌స్థాయిలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. డివిజన్‌స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే గొడుగు కింద ఉండేలా పైలట్ ప్రాజెక్టుగా ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)ను గజ్వేల్ పట్టణంలో నిర్మించారు. రూ.30కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం రెండేళ్లలోపే నిర్మాణ, నాణ్యతాలోపాన్ని బహిర్గతం చేసింది. గతేడాది జూలై 20, 21 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు భవనంలోని పైపెచ్చుల నుంచి నీరు కారి మొదటి అంతస్తులోని పలు కార్యాలయాల్లోకి నీరు చేరాయి. పలు జాయింట్ల వద్ద నీరు రావడంతో పాటు గోడల వెంట నీరు కిందకు కారడం తో ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడ్డారు. కార్యాలయా ల్లో పనులు చేసుకోవడానికి అధికారులు, సిబ్బంది నరకయాతన అనుభవించారు. వర్షం నీరు కారుతుండడంతో ప్లాస్టిక్ డబ్బాలను ఏర్పాటు చేసి నీటిని ఒడిసిపట్టారు.
స్లాబ్ జాయింట్ల వద్ద లోపాన్ని గుర్తించిన అధికారులు
ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్స్‌లోని బీ బ్లాక్ పెద్ద భవనం కావడంతో రూఫ్ లెవల్లో జాయింట్స్ ఏర్పాటు చేశారు. ఆ జాయింట్స్ ఎండాకాలంలో సంకోచం చెంది, వానాకాలంలో వ్యాకోచం చెందుతాయని, ఎండాకాలంలో సంకోచం చెందిన స్థానాల్లో నుంచి నీరు కింద కు వెళ్లి ఉరుస్తుందని అధికారులు తేల్చారు. ఐవోసీ పరిధిలో మొత్తం 17 చోట్ల ఈ జాయింట్స్‌ను పంచాయతీరాజ్ అధికారులు గుర్తించారు. ఇక కారిడార్లలో నీరు రాకుండా ఉండేందుకు 84 విండో స్లైడ్స్ అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఈ మేర కు రూ.కోటి 40లక్షల వ్యయం అవుతుందని, ఈ నిధులు మంజూరు చేస్తే నీరు కారకుండా చర్యలు తీసుకోవచ్చని తెలుపుతూ పంచాయతీరాజ్ డీఈఈ, ఈఈ ద్వారా కలెక్టర్‌కు నివేదికను అందించారు. కలెక్టర్ నుంచి అప్పటి ప్రభుత్వానికీ నివేదిక అందింది. కానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో అధికారులు చొరవ తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
వర్షాకాలంలోగా సమస్యకు పరిష్కారం దక్కేనా
మరో మూడునెలలు పోతే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ లోగా జాయింట్‌లను రీఫిల్లింగ్ చేయడంతో పాటు స్లైడ్స్ ఏర్పాటు చేస్తేనే ప్రజలకు, అధికారులకు ఇబ్బందులు తప్పుతాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశాలు తక్కువ గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు లేదా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక అధికారులు, ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:55 PM