మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా మర్రి జనార్దన్‌రెడ్డి?
ABN, Publish Date - Mar 14 , 2024 | 05:29 AM
నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి త్వరలోనే హస్తం గూటికి చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
నాగర్‌కర్నూలు బీఆర్‌ఎస్
మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు
ఒకట్రెండు రోజుల్లో ప్రకటన!
నాగర్‌కర్నూల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి త్వరలోనే హస్తం గూటికి చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బుధవారం నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీలో ఏడుగురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. శాసనసభ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి పార్టీ మార్పుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందాయి. జహీరాబాద్ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. అదేసమయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మర్రి జనార్దన్‌రెడ్డి.. బీజేపీ నాయకులు తనను సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చించకుండా తాను నిర్ణయం తీసుకోబోనని చెప్పారు. అయితే, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డిని ప్రకటించనున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ నుంచి మల్కాజిగిరి లేదా మహబూబ్‌నగర్ స్థానాల్లో పోటీ చేయాలని ఆఫర్ ఉన్నా.. జనార్దన్‌రెడ్డి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ క్రమంలో ఆయన్ను మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం లాంఛనమేనని తెలుస్తోంది. కాగా, పార్టీ మారే అంశంపై జనార్దన్‌రెడ్డి మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. కాంగ్రెస్, బీజేపీలు తనను సంప్రదిస్తున్నా.. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Updated Date - Mar 14 , 2024 | 09:47 AM