విలువల విద్య..
ABN, Publish Date - Jan 01 , 2024 | 11:06 PM
పిల్లలను దేవుళ్లతో పోల్చారు. ఏ పిల్లాడి బాల్యం అద్భుతంగా సాగుతుందో ఆ పిల్లాడు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా తయారవుతాడు. చిన్నతనం నుంచే విలువలతో కూడిన కార్యాచరణ ఆధారిత విద్యను పిల్లలకు అందించగలిగితే వారు భావి భారత పౌరులుగా విభిన్నరంగాల్లో రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. te
మొంటెసోరి విద్యావిధానంతో నేర్పుతున్న పాఠం ఇదే..
ప్రాథమిక దశలోనే కార్యాచరణ ఆధారిత విద్య అవసరం
ఔట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా ఈ విధానం అమలుకు శిక్షణ
గోపాల్‌పేటలో 72 మందికి పది రోజుల పాటు ట్రైనింగ్
ఈ విధానం విస్తరణతో దేశ శాంతికి చిన్నతనంలోనే బీజాలు
అంగన్‌వాడీలు, తల్లుల అవగాహన కోసం కార్యక్రమాలు
వనపర్తి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): పిల్లలను దేవుళ్లతో పోల్చారు. ఏ పిల్లాడి బాల్యం అద్భుతంగా సాగుతుందో ఆ పిల్లాడు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా తయారవుతాడు. చిన్నతనం నుంచే విలువలతో కూడిన కార్యాచరణ ఆధారిత విద్యను పిల్లలకు అందించగలిగితే వారు భావి భారత పౌరులుగా విభిన్నరంగాల్లో రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. దేశంలో మెజారిటీ తల్లిదండ్రులు ప్రస్తుతం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేస్తూ, ఉన్నత విద్యలో తమ పిల్లలు రాణించాలని కోరుకుంటున్నారు. దీనివల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. తనను తాను తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వకుండా చేసే విద్యా విధానం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాత విధానాన్ని మార్చి, మొంటెసోరి విద్యావిధానం అమలు కోసం నెదార్లాండ్ హెడ్‌క్వార్టర్‌గా ఏఎంఐ(అసొసియేట్ మొంటెసోరి ఇంటర్నేషనల్) సంస్థ పని చేస్తోంది. ప్రాథమిక దశలోనే విద్యార్థులను తీర్చిదిద్దడం లక్ష్యంగా పని చేస్తున్న ఈ సంస్థ.. ఓ నూతన సంకల్పాన్ని తీసుకుంది. ఇప్పటివరకు ఈ విధానంలో హైదరాబాద్‌లో 60కి పైగా పాఠశాలలు నడుస్తుండగా, విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఔత్సాహికులను ప్రోత్సహించి కొత్తగా పాఠశాలలు నెలకొల్పడం లేదా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఈ విధానాన్ని అమలు చేయడం దిశగా ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలో మొంటెసోరి విద్యా విధానంలో నడుస్తున్న తొలకరి చినుకులు పాఠశాలలో పది రోజుల పాటు రాష్ట్రంలోనే ఏకైక తెలుగు ఏఎంఐ సర్టిఫైడ్ ట్రైనర్ అయిన మాధవి రవీంద్ర శిక్షణ ఇచ్చారు. మొక్కై వంగనిది మానై వంగునా అనే మోటో లక్ష్యంగా పని చేస్తున్న వారి శిక్షణ విధానాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలిచింది. ఇందులో భాగంగా ట్రెయినర్ మాధవి రవీంద్ర, తొలకరి చినుకులు పాఠశాల నిర్వహకురాలు పరిమళ, శిక్షణ పొందిన మహిళలను పలకరించింది.
మొంటెసోరి లక్ష్యం ఇదే..
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశం నుంచి బహిష్కరణకు గురైన మొంటెసోరి అనే విద్యావేత్తను జెంషెడ్ టాటా ఇండియాకు రప్పించారు. మహాత్మగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్.. విద్యావిధానంలో మార్పుల కోసం కన్న కలలకు మొంటెసోరి ఒక సాంకేతిక రూపం తెచ్చారు. పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ స్వతహాగా నేర్చుకోవడం, క్రమశిక్షణ అలవర్చుకోవడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఇందులో 0-3 ఎలిమెంట్రీ, 3-6 అంగన్‌వాడీ దశల్లోనే బీజం పడాల్సిన అవసరం ఉంటుంది. చిన్నతనం నుంచే పిల్లలు అనుకరణ పద్ధతిలో ఎవరు ఏమీ నేర్పకపోయినా మాతృభాషను, ఇతర పనులను నేర్చుకుంటారు. వారు చాలా ఏకాగ్రతతో తమను తాము మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. 0-6 సంవత్సరాల మధ్య వయసులోనే మెదడు పరిపూర్ణంగా తయారవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు స్వతహాగా నేర్చుకోకుండా.. ఇంట్లో, పాఠశాలలో నియంత్రణ కొనసాగుతోంది. దీనివల్ల సామాజిక, శారీరక, భావోద్వేగ, ఆర్థిక ఎదుగుదల మందగిస్తోంది. మొంటెసోరి విద్యావిధానంలో గురువులు కేవలం చదువు మాత్రమే కాకుండా పిల్లాడు పరిపూర్ణమైన మనిషిగా మారడం కోసం చిన్నతనం నుంచే బీజాలు వేస్తారు. ఆ వయసు పిల్లలకు పరిసరాలు అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తారు. పిల్లలను కొట్టడం, తిట్టడం ద్వారా మెరుగువుతారని అనుకోవడం సరైన పద్ధతి కాదు. వారు స్వతహాగా నేర్చుకునే విధానం కలిగి ఉంటారు. మనం చేయాల్సిందల్లా అందుకు అనుగుణంగా పరిసరాలను సిద్ధం చేయాలి. అలాగే వారు చెప్పింది వినాలి. కేవలం మార్క్ షీట్ల ఆధారంగా విద్యార్థి ప్రగతి సాధించారని మాత్రం అనుకోవద్దు. ప్రస్తుతం తెలంగాణలో ఈ విధానంలో సర్టిఫైడ్ ట్రెయినర్లు ముగ్గురు ఉండగా.. తెలుగులో నేను శిక్షణ ఇవ్వగలుగుతున్నాను. ఏఎంఐ ఔట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చి, ఈ విద్యా విధానం అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో 72 మంది మహిళలకు ఈ విధానం కింద పది రోజుల పాటు శిక్షణ ఇచ్చాం. నేను వృత్తిపరంగా న్యాయవాదిని అయినప్పటికీ.. ఈ విద్యా విధానం వ్యాప్తి చెందితే సమాజ మేలు జరుగుతుందనే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం కొత్తగా వచ్చిన జాతీయ విద్యా విధానంలో కూడా కార్యాచరణ ఆధారిత విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
- మాధవీ రవీంద్ర, ఏఎంఐ సర్టిఫైడ్ ట్రెయినర్
పిల్లాడు ఒక మనిషి తండ్రిలాంటివాడు
మొంటెసోరి విద్యా విధానం అనేది ఎక్కువగా కార్యాచరణ ఆధారిత విద్యపై ఆధారపడి ఉంటుంది. ఒక పరిపూర్ణమైన మనిషి తయారవ్వాలంటే పిల్లాడి దశ నుంచే ప్రారంభం కావాలి. మొంటెసోరి విద్యా విధానంలో చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ మ్యాన్(పిల్లాడు ఒక మనిషికి తండ్రి) లాంటివాడని చెబుతారు. పిల్లాడి సామర్థ్యాల పెంపునకు అనుగుణంగా పరిసరాలను సమకూర్చితే వారు స్వతంత్రంగా ఎదుగుతారు. ఏది తప్పు, ఏది కాదు అనేది చిన్నతనంలో తెలిసేలా చేయాలి. ప్రాథమిక దశలోనే సరైన విద్యావిధానం అమలు చేస్తే.. యాంటీ సోషల్ ఎలెమెంట్లుగా పిల్లలు తయారు కారు. బయట, ఇంట్లో పిల్లలు నేర్చుకునే అవలక్షణాలను దూరం చేయడమే ఈ పాఠశాలల ఉద్దేశం. ఈ విధానాన్ని విస్తరించడం కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్‌లో అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ విధానం అమలు కావాల్సిన అవసరం ఉంది. చైనాలాంటి దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేయడానికి 700 మంది శిక్షకులు అందుబాటులోకి వచ్చారు.
- పరిమళ, తొలకరి చినుకులు నిర్వాహకురాలు
సమాజ మార్పు పిల్లల నుంచే ప్రారంభం
సమాజ మార్పు పిల్లల నుంచే ప్రారంభమవుతుంది. 0-6 సంవత్సరాల వయసు నుంచే మొంటెసోరి విద్యావిధానం అమలుచేస్తే.. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పిల్లలు ఎలా ప్రవర్తించాలనే విషయంలో నియంత్రణ పెట్టడం కంటే పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని సీరియ్‌సగా తీసుకోవాలి. ప్రస్తుత విద్యా విధానంలో మార్కులే ఆధారంగా ప్రగతిని నిర్దేశిస్తున్నాం. కానీ అది కొలమానం కాదు. ఈ పది రోజుల శిక్షణలో మేము గతంలో ఎలా ఉన్నాం.. భవిష్యత్‌లో ఎలా ఉండాలనేది తెలిసింది.
- విజయలక్ష్మి, పేరెంట్, డీఎస్సీ అభ్యర్థి, వనపర్తి
చదువే జ్ఞానం కాదు
మా పిల్లలు మొంటెసోరి విద్యావిధానంలో నడుస్తున్న తొలకరి చినుకులు పాఠశాలలోనే చదువుతున్నారు. ఇందులో చదివించడం కోసమే గోపాల్‌పేటకు మేము షిఫ్ట్ అయ్యాం. చదువు మాత్రమే జ్ఞానం కాదని ఈ విద్యావిధానం నేర్పుతోంది. సమాజంలో ఎలా బతకాలి. ఏం తెలుసుకోవాలి.. చదువు కాకుండా సంగీతం, నాట్యం, కర్రసాము, కరాటే లాంటి విద్యలను కూడా ఇక్కడ నేర్పుతారు. సమాజం పట్ల ఎలా ఉండాలి, ఇతరుల పట్ల ఎలా నడుచుకోవాలి అనేది చిన్నతనం నుంచే నేర్పిస్తే దేశ సమగ్రతకు నాంది పడుతుంది.
- రేణుక, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, పేరెంట్, బిజినేపల్లి
వారే నేర్చుకునేలా ప్రోత్సహించాలి
పిల్లలు చిన్నతనం నుంచే తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తారు. వాటి ఆధారంగా తాము ఎలా ఉండాలనే విషయాలను నేర్చుకుంటారు. వారు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. వారికి వారే పనులు చేసుకునే విధంగా.. నేర్చుకునే విధంగా మనం పనిచేస్తే సరిపోతుంది. మేము అంగన్‌వాడీల్లో పిల్లలను కేర్ తీసుకుంటాం. వారికి ప్రాథమిక విద్యను కూడా అందిస్తాం. కానీ మొంటెసోరి విద్యా విధానం అనేది మనం నేర్పించడమే కాకుండా వారికి వారు నేర్చుకునేలా ప్రోత్సహించడమేనని చెప్పొచ్చు.
- నారాయణమ్మ, అంగన్‌వాడీ టీచర్, వనపర్తి
Updated Date - Jan 01 , 2024 | 11:06 PM