ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ సుర‘వరం’

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:21 PM

సంపాదకుడిగా.. పరిశోధకుడిగా.. పండితుడిగా.. రచయితగా.. ప్రేరకుడిగా.. క్రియాశీల ఉద్యమకారుడిగా.. రాజకీయ నాయకుడిగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది.

సురవరం ప్రతాపరెడ్డి

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరుకు కేబినెట్‌ అంగీకారంపై హర్షం

తెలంగాణ చరిత్ర, సాహిత్య, రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం

1952లో వనపర్తి నియోజకవర్గం నుంచి మొదటి ఎమ్మెల్యేగా ఎన్నిక

తెలుగు భాష కోసం విశేష కృషి.. గోలకొండ కవుల పేరిట సంకలనం

గోల్కొండ, ప్రజావాణి పత్రికల స్థాపన.. నిజాంకు వ్యతిరేక పోరాటం

సంపాదకుడిగా.. పరిశోధకుడిగా.. పండితుడిగా.. రచయితగా.. ప్రేరకుడిగా.. క్రియాశీల ఉద్యమకారుడిగా.. రాజకీయ నాయకుడిగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. తెలుగు భాష కోసం విశేషంగా కృషి చేసిన ఆయన పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణలో కవులే లేరనే ముడుంబ వెంకట రాఘవాచార్యులు అన్న మాటలను సవాలుగా తీసుకుని 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాలను సేకరించి.. గోల్కొండ కవుల సంచికను వెలువరించిన ఘనత ఆయనది.. ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడుకు చెందిన ఆయన పేరు తెలుగు వర్సిటీకి పెట్టడం జిల్లాకు గర్వకారణమని అంటున్నారు ప్రజా ప్రతినిధులు, పండితులు, కవులు, రచయితలు.

- మహబూబ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా తెలుగు బాష ఉన్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. సురవరం ఏబీఎం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్‌ నిజాం కాలేజీలో ఇంటర్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీలో బీఏ, బీఎల్‌ చదివారు. ఆయన పేరును సార్థకం చేసేలా తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై ఉమ్మడి జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు, కుటుంబ సభ్యులు, భాషా పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తెలుగు భాషను మాతృ భాషగా, రాజ్య బాషగా మార్చడంలో ఆయన సేవలు మరువలేనివని కొనియాడుతున్నారు. గత ప్రభుత్వాల హయాం నుంచి సురవరం ప్రతాపరెడ్డిని పలు సందర్భాల్లో గుర్తు చేసుకుంటున్నారు. ట్యాంక్‌బండ్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, స్వగ్రామం ఇటిక్యాలపాడులో తన విగ్రహాలు ఏర్పాటు చేసి ఏటా వర్ధంతి, జయంతులకు స్మరించుకుంటున్నారు.

సాంస్కృతిక చరిత్రలో ఆయన ఒక అధ్యాయం

తెలంగాణ స్థానిక చరిత్ర, ఇక్కడి సాహిత్యం, ప్రజల కడగండ్లను కళ్లకు కట్టినట్లు తెలియజేయాలని తపన ఉన్న సురవరం.. ఆ దిశగా అనేక సేవలు అందించారు. తెలంగాణలో కవులు లేరనే నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని ఏకంగా 354 మంది తెలంగాణ కవుల పద్యాలు, శ్లోకాలు, రచనలను గోల్కొండ కవుల సంచిక పేరుతో వెలువరించారు. అందులో పాలమూరు జిల్లాకు చెందిన 87 మంది కవుల వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఇది ఒక ప్రామాణిక గ్రంథంగా ఉంది. 1926లో తెలుగు బాషా వికాసానికి దోహదపడే విధంగా గోల్కొండ పత్రికను స్థాపించి.. సంపాదకులుగా వ్యవహరించారు. నిజాం కాలంలో రాజ్య భాష, పాలన, వ్యవహార భాషగా ఉర్దూ ఉండగా.. తెలుగులో రెండు వార పత్రికలు మాత్రమే ఉం డేవి. ఆ తర్వాత సురవరం భారతీ సాహిత్య, ప్రజావాణి పత్రికలను కూడా స్థాపించి నడిపా రు. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫా ర్సీ, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులుగా ఉన్న ఆ యన నైజాం నిరంకుశ పాలనలో తెలుగు వారి అణిచివేతను వ్యతిరేకించారు. ప్రజలను చైతన్యం చేసేందుకు తెలుగు భాష, సంస్కృత వికాసానికి ఎనలేని సేవలు అందించారు. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలోనూ ఆయన పాత్ర చాలా కీలకం. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు ఆయన అధ్యక్షత వహించారు. 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్‌కు కూడా అధ్యక్షులుగా పని చేశారు. రెడ్డి హాస్టల్‌ కార్యదర్శిగా ఉన్నప్పుడు వేయి గ్రంథాలు ఉన్న లైబ్రరీని 11 వేల గ్రంథాలకు పెంచి.. విద్యార్థుల బాషాభివృద్ధికి కృషి చేశారు. అలాగే 1930లో మెదక్‌ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరగాలని తీర్మానం చేయించారు. ఇందుర్తి ప్రభాకర్‌రావు, ఎల్లూరి శివారెడ్డి, ముద్దసాని రామిరెడ్డి వంటి వారు ఆయన జీవితం, రచనలపై సమగ్ర పరిశీలన చేస్తూ గ్రంథాలు కూడా రాశారు.

వనపర్తి మొదటి శాసన సభ్యులు

సురవరం ప్రతాపరెడ్డి.. హైదరాబాద్‌ రాష్ర్టానికి జరిగిన మొదటి ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన న్యాయవాది వి.రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. ఆయనకు మొదటి నుంచి రాజకీయాలు అంటే ఆసక్తి లేకపోయినా.. కాంగ్రెస్‌ పార్టీ, సన్నిహితుల ఒత్తిడితో పోటీచేసి గెలుపొందారు. అప్పుడు జిల్లా వ్యక్తి అయిన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాలనే చీకటి బజారులో తాను, తనవంటి వారు పనికిరారు అని పేర్కొని.. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన రాసిన వాటిలో ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తెలంగాణలో కవులు లేరని చెప్పిన ఆంధ్ర పండిత విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. గోల్కొండ కవుల సంచిక, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హైందవ ధర్మవీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలతో గ్రంథాలు రచించారు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదం అనే నాటకాలు కూడా రాశారు.

గర్వించదగిన పరిణామం

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. తెలంగాణలో కవు లు లేరని అవహేళన చేసిన వారి సవాల్‌ను స్వీకరించి.. గోల్కొండ కవుల సంచిక తీసుకువచ్చిన ఘనత సురవరం ప్రతా్‌పరెడ్డిది. గత ప్రభుత్వాలు కూడా వారి పేరును ప్రతీ సందర్భంలో గుర్తు చేసుకున్నాయి. పాలమూరు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని గతంలో నిరంజన్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌ కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

- సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి

సమున్నత గౌరవం

తెలుగు భాష కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. వనపర్తి తొలి శాసన సభ్యులుగా పనిచేసిన ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఈ రోజు తెలంగాణ కవులు ప్రామాణిక గ్రంథంగా గోల్కొండ కవుల సంకలనం తీసుకుంటున్నారంటే ఆ రోజు ఆయన తెలంగాణకు చెందిన కవులను ఏ స్థాయిలో నిలబెట్టారో అర్థం చేసుకోవచ్చు. తెలుగు వర్సిటీకి ఆయన పేరు పెట్టినందుకు సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

- తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే

ఆయన చరిత్ర ఈ తరానికి తెలియాలి

తెలంగాణ, తెలుగు భాషకు ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి. ఆయన చేసిన సేవలు, ఆయన చరిత్ర ఈ తరానికి తెలియాలి. అందుకే గత ప్రభుత్వంలో నేను స్వయంగా ఆయన చేసిన సేవలపై సంకలనాలు ముద్రించి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేసిందుకు గర్వపడుతున్నా. వనపర్తి తొలి శాసన సభ్యుడిగా ఆయన విగ్రహం పెట్టించాను. అప్పట్లోనే తెలుగు వర్సిటీకి ఆయన పేరు పెట్టాలని 126వ జయంత్రి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియజేశాను. తర్వాత ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడం జరిగింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం.

- సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రివర్యులు

తెలుగు భాషకు సమున్నత సేవలు

తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషకు సమున్నతమైన సేవలు అందించన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. ఒకనాడు తెలుగు మాట్లాడాటానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో.. గో ల్కొండ పత్రిక ద్వారా తెలుగు భాషా సేవకు పాటుపడిన భాషాభిమాని ఆయన. నూరు సంవత్సరాల కిందటే తెలంగాణ ఆత్మగౌరవం సురవరం. సంస్థాన పాలకుల సహచర్యంతో తెలుగు బాషా సేవ సాహిత్య సృజనకు తనవంతు కృషి చేశారు.

- బైరోజు చంద్రశేఖర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌, తెలుగు

మాతృభాష మీద మమకారం పెంచిన వ్యక్తి

మాతృ భాష తెలుగు మీద మమకారం పెంచిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. తెలుగు బాష ప్రజల భాషగా తీర్చిదిద్దేందుకు సార్వసత్త పరిషత్‌ ద్వారా ప్రాథమిక పాఠశాలల కొనసాగించారు. విద్యార్థులకు తెలు గుపై పట్టును పెంచేందుకు గ్రంథాలను సమకూర్చారు. గోల్కొండ, ప్రజావాణి పత్రికలను నిర్వహించి తెలంగాణ ప్రజలకు మాతృభాష మీద మమకారాన్ని పెంచిన మహానుభావుడు.

- బలరాం, కవి, రచయిత, వనపర్తి

సాహితీ లోకానికి ఆయన సేవలు అనన్యం

సురవరం ప్రతాపరెడ్డి పాలమూరు వాసి కావడం అందరికీ గర్వకారణం. తెలంగాణ ఆత్మగౌరవం, తెలుగు భాష ఖ్యాతిని పెంచిన ఘనత ఆయనది. ధిక్కార స్వరాన్ని కలం ద్వారా వినిపించారయాన. గోల్కొండ, ప్రజావాణి పత్రికల ద్వారా భాషోద్యమాలు నడిపారు. ఆయన స్ఫూర్తితోనే సాహితీ కళా వేదికను ప్రారంభించాం. ఆయన స్ఫూర్తితోనే మేము కూడా అందరూ పుస్తకాలు చదవడం కోసం వివిధ రకాల పుస్తకాలను సేకరిస్తున్నాం.

- పలుస శంకర్‌గౌడ్‌, సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు, వనపర్తి

Updated Date - Sep 21 , 2024 | 11:21 PM