విద్యార్థులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలి
ABN, Publish Date - Sep 19 , 2024 | 11:21 PM
విద్యార్థినులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
వెల్దండ, సెప్టంబరు 19 : విద్యార్థినులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల ఆఽశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. తమకు సరిపడా మరుగుదొడ్లు, స్నానాలగదులు లేవని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా విద్యార్థినులు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదుల్లోనే పడుకోవాల్సి వస్తుందని, వర్షాలతో కిటికీలు సరిగ్గా లేకపోవడంతో గదుల్లోకి నీరు చేరుతుందని పేర్కొన్నారు. డైనింగ్ హాల్ లేకపోవడంతో చెట్లకింద, గదుల్లోనే భోజనాలు చేయాల్సి వస్తుందని తెలిపారు. నాణ్యమైన బియ్యం సరఫరా అయితేనే తీసుకోవాలని, ఏవైనా పాడైన బియ్యం వస్తే తమ దృష్టికి తేవాలని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వర్ణరత్నంకు సూచించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అందుబాటులో ఉండి వైద్యం అందించాలి
వైద్య సిబ్బంది ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. వెల్దండ పీహెచ్‌సీని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో మందుల వివరాలు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో డెంగీ కేసుల వివరాలు, ఓపీ ఎలా ఉందని ప్రశ్నించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, రోగులకు అందుబాటులో లేకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఇన్‌చార్జి డాక్టర్ మంజుభార్గవి, డీసీవో శ్రీధర్‌రావు తదితరులు ఉన్నారు.
Updated Date - Sep 19 , 2024 | 11:21 PM