గోవిందా హరి గోవిందా! గోకుల నందన గోవిందా
ABN, Publish Date - Dec 10 , 2024 | 11:38 PM
జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి.
- వైభవంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- తొలి రోజు ధ్వజారోహణ, ప్రత్యేక పూజలు
- గోవింద నామ స్మరణతో మారుమోగిన మల్దకల్ పట్టణం
మల్దకల్, డిశంబరు 10 (ఆంద్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఆలయం ముందు భక్త జన సందోహం మద్య ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సంతానం లేని దంపతులకు ప్రసాదం
బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు పూజల అనంతరం సంతానం లేని దంపతులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ప్రసాదం స్వీకరిస్తే వచ్చే ఏడాది నాటికి సంతానం కలుగుతుందని స్థానికుల విశ్వాసం. అందుకోసం వారందరూ ఉపవాస దీక్ష చేపట్టి, ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి నేతృత్వంలో రుత్వికులు మధుసూదనాచార్యులు రమేశాచార్యులు, ధీరేంద్రదాసులు, రవిఆచార్యులు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన స్వామి
ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అధికారులు, వేద పండితులు స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన సూర్య ప్రభావాహనంపై ఆశీనులను చేసి, పుర వీధుల మీదుగా దశమికట్ట వరకు ఊరేగించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
13న కల్యాణోత్సవం
లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 13న కల్యాణోత్సవం, 14న తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని 15న రాత్రి 12 గంటలకు నిర్వహించ నున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Updated Date - Dec 10 , 2024 | 11:38 PM