ఉపాధి ఫలాలు
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:44 PM
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఎలాంటి ఉపాధి వనరులు లేకపోవడంతో ని త్యం హైదరాబాద్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు నిత్యం వలస వెళ్తున్న పేద జీవులకు మండలంలో ప్రకృతి పుణ్యమా అంటూ సుమారు రెండు నెలల పాటు ఉపాధి లభిస్తుంది.
- నవాబ్‌పేట మండలంలో విరివిగా ఫలాలు లభ్యం
- రైతుల నుంచి పండ్ల సేకరణ
నవాబ్‌పేట, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఎలాంటి ఉపాధి వనరులు లేకపోవడంతో ని త్యం హైదరాబాద్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు నిత్యం వలస వెళ్తున్న పేద జీవులకు మండలంలో ప్రకృతి పుణ్యమా అంటూ సుమారు రెండు నెలల పాటు ఉపాధి లభిస్తుంది. ఇక్కడ ఉచితంగా దొరికే సీతాఫలానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చిన్న, పెద్దా తేడా లేకుండా ఉదయం నుంచి సాయంత్రం గుట్టలు, చెట్లు వెంబడి తిరిగి సీతాఫలం సేకరించి నాలుగురాళ్లు పోగు చేసుకుంటూ అటు ఉపాధి.. ఇటు ఆరోగ్యం సంపాదించుకుంటున్నారు. ప్రకృతిలో లభించే సీ తాఫలం నుంచి ఆదాయం సమకూర్చుకోవాలన్న ఆలోచనతో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా గుజ్జు తయారీ కేంద్రం ఏర్పాటు చేసి తమకు అవసరమైన మేర ఫలం సేకరిస్తున్నారు. కూలీలు, రైతుల నుంచి సీతా ఫలాలను నాణ్య తను బట్టి కిలోకు రూ.10 నుంచి రూ.15 కేంద్రం నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన ఫలాలను ప్రాసెసింగ్ యూనిట్‌లో రెండు రోజులు మాగపెట్టి, గుజ్జును వేరు చేస్తున్నా రు. అనంతరం ఆ గుజ్జును కిలో చొప్పున ప్యాకింగ్ చేసి, ఐస్‌క్రీం కంపెనీలకు రూ.180 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు. రోజూ 40 మంది పని చేస్తుండగా, ఒక్కొక్కరికి రూ.400 చొప్పున కూలీ చెల్లిస్తున్నారు.
పుష్కలంగా సీతాఫలం చెట్లు ...
మండలంలో మెట్ట ప్రాంతంతో పాటు గుట్టలు ఎక్కువగా ఉం డటంతో ఇక్కడ సీతాఫలం వనాలు ఎక్కువస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రం సమీప మండలాలైన నవాబ్‌పేట, చౌడాపూర్, మహబూబ్‌నగర్, హన్వాడ, కోయిలకొండ, మహ్మదా బాద్, జడ్చర్ల తదితర మండలాల్లో అధిక సంఖ్యలో ఈ చెట్లు ఉన్నాయి. ప్రతి వర్షాకాలంలో జూన్ నెలలో సీతాఫలంకొచ్చి ఆగస్టు మొదటి చివరి వారం నుంచి ఖాత మొదలవుతుంది. దీంతో గ్రామాల్లో సీతాఫలం సేకరణ ప్రారంభమవుతుంది.
గుజ్గు తయారీ ఇలా...
మండలంలో సీతాఫలం గుజ్జు తయారీ మహిళాసంఘాల ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతుంది. అయితే ప్రతి ఏడాది సుమారు 5 లక్షల వ్యాపారం సాగుతుందని మహిళాసంఘాల సభ్యులు చెబుతున్నారు. సుమారు రెండు నెలల పాటు గుజ్జు సేకరణ పనులు కొనసాగుతాయని, నిత్యం ప్రత్యక్షంగా 40 మంది, పరోక్షంగా మరో 50 మందికి తాము ఉపాధి కల్పిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పక్వానికి (పండుదశకు) వచ్చిన కాయలను సేకరించి వాటి నుంచి విత్తులు, గుజ్జు తీసి ప్రత్యేక పాకెట్లలో భద్రపర్చి హైదరాబాద్, విజయవాడ, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ఐస్‌క్రీం వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
ఔషధ గుణాలెన్నో...
ప్రకృతి ఒడిలో లభించే సీతాఫలం నుంచి ఎన్నో లాభాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సీతాఫలం తింటే విటమిన్ ఏ,బీ,సీ,కే, ప్రొటీన్స్, క్యాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, కాపర్, పైబర్, ఇనుము, వంటి ఖనిజాలు పుష్కలం.
- విటమిన్-ఏతో కంటి చూపు, చర్మ, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో చెడు కొలెస్ర్టాల్‌ను బయటకు పంపడంతోపాటు అధిక బరువు తగ్గిస్తుంది. అలాగే కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్ జీర్ణాశయ సమస్యలనుంచి విముక్తి, సీతాఫలంను తినడం వల్ల గర్భశ్రవం నివారిస్తుంది. గుండె వ్యాధులు అధిక రక్తపోటు నివారిస్తుంది. గర్భిణులలో దంత సమస్యలనుంచి రక్షిస్తుంది. మలబద్దకం నివారించడంతో పాటు శిశివు యెక్క రోగనిరోధక వ్యవస్థ, నాడి వ్యవస్థ, మెదడు అభివృద్ధికి సహాయ పడుతుందని పలువురు వైద్యులు తెలుపుతున్నారు.
విస్తరిస్తున్న కొనుగోలు కేంద్రాలు...
మండలంలో ఒకప్పుడు సీతాఫలం విక్రయ కేంద్రాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు మహబూబ్‌నగగర్, మహ్మదాబాద్ రేంజ్‌లలో పలు గ్రామాల్లో గ్రామస్థులు సమూహంగా ఏర్పడి సీతాఫలం క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఇక్కడి సీతాఫలం కర్నూల్, కడప, బెంగళూర్, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
మహిళలకు ఉపాఽధి...
సీతాఫలం గుజ్జు సేకరణతో గ్రామాల్లో సుమారు రెండు నెలలు ఉపాధి దొరుకుతుంది. ప్రతీ గ్రామం నుంచి తమ వద్దకు సీతాఫలం నాణ్యతను బట్టి డబ్బులు చెల్లిస్తాం. ప్రతీ ఏడాది వ్యాపారం వృద్ధి చేస్తున్నాం. ఏటా రూ.5 లక్షల వరకు క్రయ విక్రయాలు జరుపుతున్నాం. మున్ముందు గ్రామాల్లో గుజ్జు తయారీ కేంద్రాలు విస్తరించి మహిళలకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తాం.
- జీవరత్నం, ఏపీఎం
Updated Date - Oct 27 , 2024 | 11:44 PM