ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ
ABN, Publish Date - Oct 11 , 2024 | 12:39 AM
సద్దుల బతుకమ్మ వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం వైభవంగా జరిగాయి.
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 10: సద్దుల బతుకమ్మ వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం వైభవంగా జరిగాయి. నగరంలోని గంజ్, టవర్ వద్ద విభిన్న ఆకృతుల్లో వైవిద్యభరితంగా తీర్చిదిద్దిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. చైతన్యపురి మహాశక్తి దేవాలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ, దాండియా ఆటలతో హోరెత్తించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, సతీమణి అపర్ణ పాల్గొన్నారు. రాంనగర్ రమాసత్యనారాయణ స్వామి ఆలయం ముందు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు.. టవర్‌సర్కిల్ వద్ద గౌరిశెట్టి మునీందర్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో హైండ్లూమ్ అంశంగా బతుకమ్మను రూపొందించి చేనేత కళాకారుల గొప్పదనాన్ని వివరించారు. హనుమాన్‌నగర్, సప్తగిరి కాలని, మార్క్‌ఫెడ్ గ్రౌండ్, భాగ్యనగర్ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసం ఎదుట కుటుంబ సభ్యులు, సమీప నివాస మహిళలు బతుకమ్మ ఆడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలు బతుకమ్మ ఆడారు. ఎల్‌ఎండీ, ఎస్సారెస్పీ కెనాల్, పద్మనగర్, చింతకుంట, సీతారాంపూర్, కొత్తపల్లి, మానకొండూరు, వేదభవన్, లేక్ పోలీస్ స్టేషన్ వద్ద, గౌతమీనగర్ తదితర నిమజ్జన ప్రదేశాలు జనంతో కిటకిటలాడాయి. లేక్ పోలీస్ స్టేషన్ వద్ద మానేరు డ్యాంలో నిమజ్జన వేడుకల్లో ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.
వేడుకలకు వరుణుడి అడ్డంకి...
బతుకమ్మ వేడుకలకు వరుణుడు అడ్డంకిగా మారాడు. సాయంకాలం బతుకమ్మ ఆడే సమయంలో వర్షం పలు దఫాలుగా కురియడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. అనంతరం గెరువు ఇచ్చిన సందర్భాల్లో కొందరు, వర్షంలో తడుస్తూనే కొందరు వేడుకల్లో పాల్గొన్నారు.
Updated Date - Oct 11 , 2024 | 12:39 AM