నేటి నుంచి ఒంటి పూట బడి
ABN, Publish Date - Mar 15 , 2024 | 12:44 AM
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.
కరీంనగర్ టౌన్, మార్చి 14: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఎండలు మండిపోతుండడంతో ప్రతి యేడు మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఒంటిపూట బడులను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ‘పది’ పరీక్షలు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ విద్యాసంవత్సరం చివరిరోజైన ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని, తరగతుల నిర్వహణ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాలని సూచించింది. దీనితో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటి పూట బడుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించాలని సూచించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండగా మార్చిలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ 36నుంచి 38 డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మార్చి చివరి వారంతో పాటు ఏప్రిల్‌లో మరింత ఎండలు ముదురుతాయని, ఒంటిపూట బడి సమయాన్ని ఎండల తీవ్రతను బట్టి తగ్గించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈనెల 18 నుంచి ‘పది’ పరీక్షలు
పదవ తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షల కోసం జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు డిసెంబర్ నుంచే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్, గాలి, వెలుతురు, మంచినీటి వసతి, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పరీక్షా కేంద్రాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా సమయానికి 5 నిమిషాల ఆలస్యంగా వచ్చిన వారిని సైతం పరీక్ష రాసేందుకు అనుమతించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కొంత ఊరట చెందారు.
Updated Date - Mar 15 , 2024 | 12:45 AM