ఎట్టకేలకు కొత్త సామగ్రి
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:15 AM
ఎట్టకేలకు మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహించే మహిళలకు కొత్త వంట పాత్రలను కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు ప్రభుత్వం 49 లక్షల 15 వేల రూపాయలను కేటాయించింది. 389 పాఠశాలలను గుర్తించారు.
- మధ్యాహ్న భోజనానికి కొత్త వంట పాత్రలు
- జిల్లాకు రూ. 49.15 లక్షల కేటాయింపు
- 389 పాఠశాలలకు సరఫరా
- టెండర్ల ద్వారా పాత్రల కొనుగోలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఎట్టకేలకు మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహించే మహిళలకు కొత్త వంట పాత్రలను కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు ప్రభుత్వం 49 లక్షల 15 వేల రూపాయలను కేటాయించింది. 389 పాఠశాలలను గుర్తించారు. ఈ పాఠశాలలకే కొత్త వంట పాత్రలను సరఫరా చేయనున్నారు. ఈ పాత్రలను కొనుగోలు చేసేందుకు టెండర్లు ప్రకటించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సూచనల మేరకు కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్‌గా అదనపు కలెక్టర్(రెవెన్యూ), కన్వీనర్‌గా జిల్లా విద్యా శాఖాధికారి, సభ్యులుగా జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఒక మండల విద్యాశాఖాధికారి, ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని నియమించాల్సి ఉంటుంది. కమిటీలో నిర్ధేశించిన జిల్లా అధికారులు పోనూ, పెద్దపల్లి మండల విద్యా శాఖాధికారి సురేందర్ కుమార్, పెద్దపల్లి మండలం రాగినేడు జడ్పీ ఉన్నత పాథశాల ప్రధానోపాధ్యాయులు ఆగయ్యను నియమించారు. ఈ కమిటీ సమావైశమై టెండర్లను ప్రకటించనున్నది.
ఫ విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు 30 ఏళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మొదట 5వ తరగతి వరకే దీనిని అమలు చేయగా, తర్వాత 8వ తరగతి వరకు పెంచారు. 9,10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకాన్ని నిర్వహించేందుకు స్వశక్తి సంఘాల మహిళలకు అవకాశం కల్పించింది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక మెయిన్ కుక్, ఇద్దరు, ముగ్గురు వరకు అసిస్టెంట్ కుక్‌లను నియమించారు. ప్రభుత్వం నేరుగా పాఠశాలలకు బియ్యం సరఫరా చేస్తుండగా, కిరాణ సామాగ్రి, కూరగాయలు, వంట గ్యాస్ లేదా కట్టెలను మహిళలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా తరగతుల వారిగా ఒక్కో విద్యార్థి పేరిట ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లిస్తున్నది. గౌరవ వేతనంగా ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇవ్వగా, ప్రస్తుతం 3 వేల రూపాయలు ఇస్తున్నారు.
ఫ వంటపాత్రలు కొనుగోలు చేసి 25 ఏళ్లు..
జిల్లాలో 535 ప్రభుత్వ పాఠశాలలు, 10 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 30 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీటిలో 910 మంది మహిళలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. 1995 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో స్వశక్తి సంఘాల మహిళలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం వంటలు వండేందుకు, విద్యార్థులకు భోజనాలు వడ్డించేందుకు గాను వంట పాత్రలను కొనుగోలు చేసి ఇచ్చింది. ఆ పాత్రలు కొనుగోలు చేసి 25 ఏళ్లు దాటాయి. ఆ పాత్రల్లో వంటలు చేయడం వల్ల రుచికరంగా ఉండడం లేదని, కొత్త పాత్రలను కొనుగోలు చేయాలని పదేళ్లుగా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటూ వస్తున్నారు. నవంబర్ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు వంట పాత్రలు కావాలని దృష్టికి తీసుకవెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన పాఠశాలలకు కొత్త వంట పాత్రలను సరఫరా చేసేందుకు నిధులకు కేటాయించింది. ఆ మేరకు టెండర్లు నిర్వహించి పాత్రలను త్వరలోనే కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్నం, కూరలు, సాంబారు వండేందుకు కావాల్సిన గంజులు, అన్నం వడ్డించేందుకు స్టీలు తట్టాలు, స్టీల్ బకెట్లు, జగ్గులు, గరిటెలు తదితర వంట పాత్రలను కొనుగోలు చేయనున్నారు.
Updated Date - Oct 27 , 2024 | 01:15 AM