పత్తి ధరలు పతనం
ABN, Publish Date - Oct 15 , 2024 | 12:32 AM
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు పతనమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 7,500 రూపాయల పైచిలుకు పలికిన తెల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గిందని చెబుతున్న వ్యాపారులు ధరల్లో కోతలు మొదలు పెట్టారు. క్వింటాల్ పత్తికి 7,521 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది.
జమ్మికుంట, అక్టోబరు 14: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు పతనమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 7,500 రూపాయల పైచిలుకు పలికిన తెల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గిందని చెబుతున్న వ్యాపారులు ధరల్లో కోతలు మొదలు పెట్టారు. క్వింటాల్ పత్తికి 7,521 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. జమ్మికుంట మార్కెట్లో గత బుధవారం 6,750 రూపాయల ధర పలికింది. దసరా సందర్భంగా గురువారం నుంచి మార్కెట్‌కు సెలవులు ఇచ్చారు. మంగళవారం నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం కానున్నాయి. గత నెల 25 నుంచి కొత్త పత్తి రావడం ప్రారంభమైంది. అప్పటి వరకు పాత పత్తికి వ్యాపారులు 7,600 రూపాయల వరకు చెల్లించారు. దసరా పండగకు ముందు ఆర్థిక అవసరాల నిమిత్తం రైతులు పత్తిని విక్రయించేందుకు ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్ధతు ధర వచ్చిణాపర్వాలేదని భావించిన రైతులకు మార్కెట్లో వాస్తవ పరిస్థితి అందుకు బిన్నంగా తయారైంది. గ్రేడ్ ఏ రకం పత్తికి వ్యాపారులు 6,750 రూపాయలకు మించి ధర చెల్లించడం లేదు. మద్ధతు ధర కంటే 771 రూపాయలు తక్కువ చెల్లిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పత్తికి అంతకన్న మించి ధరలు చెల్లించలేమని వ్యాపారులు అంటున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోళ్లు ప్రారంభిస్తేనే మద్దతు ధర వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి సీసీఐ కొనుగోళ్లను త్వరగా ప్రారంభించాలని పత్తి రైతులు కోరుతున్నారు.
Updated Date - Oct 15 , 2024 | 12:32 AM