తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
ABN, Publish Date - Jan 11 , 2024 | 04:15 AM
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికంగా అభివృద్ధికి తోడ్పడాలని సీఎం రేవంత్ రెడ్డి పదమూడు దేశాలకు చెందిన ప్రతినిధుల బృందాన్ని కోరారు.
13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ పిలుపు
కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద ఆతిథ్యం
పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని వినతి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికంగా అభివృద్ధికి తోడ్పడాలని సీఎం రేవంత్ రెడ్డి పదమూడు దేశాలకు చెందిన ప్రతినిధుల బృందాన్ని కోరారు. వారికి సీఎం బుధవారం రాత్రి కుతుబ్ షాహీ టూంబ్ వద్ద ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ర్టేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వారికి స్వాగతం పలికిన సీఎం తెలంగాణలో తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, జవ హర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నేతల ఆశయాలను, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ స్ఫూర్తితో సమానత్వం, పారదర్శకతతో తమ ప్రభుత్వం పని చేస్తుందని విదేశీ ప్రతినిధుల బృందానికి స్పష్టం చేశారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించనుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతి కుమారి, జయేష్ రంజన్, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి స్నేహజ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2024 | 04:20 AM